సమావేశాలకు మొదటిగా వచ్చే వ్యక్తి, చివరిగా వెళ్లే వ్యక్తి చంద్రబాబు. అలాంటి వ్యక్తి నేతృత్వంలో మేమందరం పని చేస్తున్నందకు గర్వంగా ఉంది.


ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ మరో సారి తనదైన శైలిలో పొగడ్తలతో ముంచెత్తారు. అసెంబ్లీ సమావేశాలు, కలెక్టర్ల కాన్ఫెరెన్స్‌లు, ఇతర ప్రభుత్వ సమావేశాల్లో సీఎం చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తే పవన్‌ కల్యాణ్, విజన్‌ 2047 డాక్యుమెంట్‌ ఆవిష్కరణ సభలో కూడా కొనసాగించారు. సీఎం చంద్రబాబు అధికారులతో నిరంతరం, ఎడతెరిపి లేకుండా సమీక్షలు నిర్వహిస్తుంటారని, కొంచెం కూడా అలసట కనిపించదని, అది తనకు చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంటుందని, అంత ఓపిక మీకు ఎక్కడ నుంచి వచ్చిందని, నిజంగా మీ ఓపికకు నా సలాం అంటూ చంద్రబాబుపై ప్రశంల జల్లు కురిపించారు. ఎప్పుడు సమీక్షలకు వచ్చినా.. రివ్యూలు చేపట్టినా ఎప్పుడెప్పడు వెళ్దామా అనే చూపుల్లోనే తమ లాంటి వారు ఉంటారని, కానీ మీలో అలాంటి ఆలోచనలు కనబడవని చంద్రబాబు నాయుడుపై పొగడ్తల వర్షం కురిపించారు. సమావేశాలకు మొదటగా వచ్చే వ్యక్తి.. చివరిగా వెళ్లే వ్యక్తి కూడా చంద్రబాబేనని ఓ రేంజ్‌లో ప్రశంసలు కురిపించారు. అందరు తమ కోసం కలలు కంటారని, కానీ చంద్రబాబు మాత్రం రాష్ట్ర ప్రజల కోసం కలలు కంటుంటారని, ఇది అందరికీ సాధ్యం కాదని, కేవలం చంద్రబాబుకే సాధ్యమని అన్నారు. ఇది గతంలో విజన్‌ 2020 సాధ్యం చేసిందని, విజన్‌ 2047 కూడా సాధ్యం చేస్తుందని అన్నారు. హైటెక్‌ సిటీ ప్రాంతంలో మాకు రాళ్లు రప్పలు కనిపిస్తే చంద్రబాబుకు భవిష్యత్‌ కనిపింందన్నారు.

2047లో ఆంధ్రప్రదేశ్‌ ఎలా ఉండాలో ఒక విజన్‌ డాక్యుమెంట్‌ తీసుకొని రావాలనేది అందరికీ సాధ్యం కాదు. దీనికి 2020 విజన్‌ డాక్యుమెంటే నిదర్శనం. అదే ఇప్పుడు భిక్ష పడుతోంది. 2047 విజన్‌ డాక్యుమెంట్‌ అంత కంటే మెరుగైన అభివృద్ధి జరుగుతుందని అన్నారు. దీనికి రూల్‌ ఆఫ్‌లా అనేది చాలా అవసరం. ఆంధ్రప్రదేశ్‌లో ఇది సమగ్రంగా అమలు కావాలి. అప్పుడే విజన్‌ 2047 నెరవేరుతుందన్నారు. ప్రజలను..ప్రభుత్వాన్ని అనుసంధానం చేయాల్సింది అధికారులే. ప్రజల సమస్యలను పరిష్కరించాల్సింది అధికారులే అని అన్నారు.
Next Story