
జగన్ పై చంద్రబాబుకి మళ్లీ కోపం వచ్చింది!
న్యాయస్థానాలంటే జగన్‌కు ఏమాత్రం లెక్కలేదు అంటూ విమర్శలు గుప్పించారు సీఎం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మళ్లీ కోపం వచ్చింది. ఈసారి కాస్తంత తీవ్ర స్వరంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయంలో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన సీఎం చంద్రబాబు జగన్ కి న్యాయస్థానాలంటే లెక్కే లేదన్నారు. జగన్ వ్యవహార శైలిని తప్పుపట్టారు.
‘జగన్ తన అక్రమాస్తుల కేసుల్లో కోర్టుకు గైర్హాజరవుతాడు. సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలు చేస్తున్నా అభ్యంతరం వ్యక్తం చేస్తాడు. న్యాయస్థానాలంటే జగన్‌కు ఏమాత్రం లెక్కలేదు’ అంటూ విమర్శలు గుప్పించారు సీఎం.
పరకామణి చోరీ కేసును సాధారణ కేసుగా చూడటాన్ని హైకోర్టు కూడా తప్పు పట్టిందని గుర్తు చేశారు సీఎం. భక్తులు కానుకగా సమర్పించిన సొమ్ము చోరీ కావటం సెంటిమెంట్‌తో ముడిపడిన అంశం అని.. పరకామణి లెక్కింపులో కూడా ఏఐ వాడాలని న్యాయస్థానాలు చెప్పటం శుభ పరిణామం అన్నారు.
పీపీపీ వైద్య కళాశాలల విషయంలో వైసీపీ ఎంపీలు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ను సైతం తప్పుదోవ పట్టించే యత్నం చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పీపీపీ విధానంపై తనను తప్పుదోవ పట్టించే యత్నం చేయవద్దని కేంద్ర ఆర్థిక మంత్రి గట్టిగా చెప్పటంతో వారు వెనుదిరిగారన్నారు. పీపీపీ అనేది ప్రపంచ వ్యాప్తంగా అమలవుతున్న సక్సెక్ మోడల్ అని.. అన్ని రంగాల్లోనూ ఇది అమలవుతోందన్నారు సీఎం. దీని కారణంగా సీట్లు పెరగటంతో పాటు పేదలకు కార్పొరేట్ వైద్యం అందుతుందన్నారు. కుటుంబ సభ్యుల మధ్య ఉద్యోగ నియామక పత్రాలు అందచేయటం అభ్యర్థులకు గొప్ప అనుభూతినిస్తుందన్నారు ముఖ్యమంత్రి. నాడు డీఎస్సీ, నేడు యువగళం పేరిట పోలీసు కానిస్టేబుల్ నియామకాలు ఈ తరహా విధానం అందుకే అనుసరిస్తున్నామని చెప్పారు సీఎం చంద్రబాబు.
‘‘రాబోయే ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మహిళల్లో సమర్థ నాయకత్వాన్ని తీసుకురావాలి. మహిళలకు 28.4 శాతంగా ఉన్న ప్రాధాన్యాన్ని 30 శాతానికి పెంచాలి. రెండు రోజుల్లో జిల్లా అధ్యక్ష పదవుల ప్రకటన ఉంటుంది. నెలాఖరులోపు రాష్ట్ర కమిటీ ప్రకటిస్తాం. ప్రతి 3 నెలలకు ఒకసారి కమిటీల పనితీరును సమీక్షిస్తాను. పనిచేయని వారిని తొలగించేందుకు వెనుకాడను. నా నుంచి కార్యకర్త వరకు.. అందరూ పార్టీ క్యాలెండర్‌కు అనుగుణంగా పనిచేయాల్సిందే. జనవరి నుంచి పూర్తిస్థాయిలో పనిలోకి దిగాల్సిందే’’ అని స్పష్టం చేశారు.
Next Story

