జనసేన పార్టీ తరపున పోటీ చేస్తున్న వారిలో సగం మంది కాపులు చంద్రబాబు ద్వారా వచ్చారా? ఇప్పుడు కాపు సంఘాల్లో ఇదే హాట్ టాపిక్.
చంద్రబాబు కాలాంతకుడవునో కాదో కానీ ‘కాపాంతకుడు’.. కాపుల కన్ను కాపులతోనే పొడిపించాడు. కాపుల్ని మరో 30 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లాడు అన్నాడు కాపు నాయకుడు కఠారి అప్పారావు. ఈ మాట ఆయన ఎందుకన్నారు. ఏ స్థితిలో ఆయన నోటి నుంచి ఈ మాట రావాల్సి వచ్చిందో ఆలోచిస్తే నిజమేనేమో అనిపిస్తుంది.
ఏపీలో జనసేన కాపు పార్టీనే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పార్టీ పక్కాగా కాపు పార్టీనే. దీనిని కాదనే ధైర్యం ఎవరికైనా ఉంటే చాలెంజ్ చేయొచ్చు.. డిబేట్లల్లో కూడా పాల్గొనొచ్చు. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సామాజిక వర్గాల వారీగా అభ్యర్థుల కేటాయింపులు ఒక్క సారి పరిశీలిస్తే ఇది స్పష్టమౌతుంది. ఈ రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌సీపీకి రెడ్డి పార్టీ అని, తెలుగుదేశానికి కమ్మ పార్టీ అని ముద్ర ఉంది. అలాగే జనసేన పార్టీ కూడా ముమ్మాటికి కాపు పార్టీ అనే ముద్ర పడిందని చెప్పొచ్చు.
అందుకు అనేక కారణాలున్నాయి. అన్ని పరిశీలన చేసిన తర్వాతనే ఈ విషయాన్ని స్పష్టం చేయాల్సి వస్తోంది. అధికార, ప్రతిపక్ష పార్టీలను పక్కన పెడితే.. ఈ రాష్ట్రంలో మూడో పార్టీగా ఉన్న జనసేన పార్టీని, ఆ పార్టీ కేటాయించిన సీట్లలోని అభ్యర్థుల వివరాలను పరిశీలిస్తే ఎవరు ఏ పార్టీ వారో .. ఏ కులం వారో అవగతమవుతుంది.
పోటీలో ఉన్నవారిలో సగం మంది టీడీపీ వారే..
జనసేన పార్టీ తరపున పోటీ చేస్తున్న వారిలో సగానికిపైన తెలుగుదేశం పార్టీ వారే కావడం విశేషం. పవన్‌కళ్యాణ్ త్యాగాలు చేయాలంటున్నారంటే ఇదేనేమోనని జనసైనికులు అంటున్నారు. ఉదాహరణకు రెండు సీట్ల గురించి తెలుసుకుందాం. కృష్ణాజిల్లా అవనిగడ్డ సీటును మండలి బుద్ధప్రసాద్‌కు కేటాయించారు. నిన్నటి వరకు ఆయన తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్. చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలు ఉన్న వారు. పైగా తెలుగుదేశం ప్రభుత్వంలో డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు. ఆయనకు తప్పకుండా చంద్రబాబు అవకాశం కల్పించాలి. ఈరూపంలో అవకావం కల్పించారని తెలుగుదేశం, జనసేన పార్టీల నాయకులు వ్యాఖ్యానించడం విశేషం. మరొకరి విషయం కూడా ఇలాగే జరిగింది. శ్రీకాకుళం జిల్లా పాలకొండ ఎస్టీ రిజర్వుడు నియోకర్గం ఆనియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకుడుగా ఉన్న నిమ్మక జయకృష్ణ పార్టీ సీటు కోసం శతవిధాల ప్రయత్నించారు. జనసేనకు నియోజకవర్గం ఖరారు కావడంతో చంద్రబాబే జయకృష్ణను జనసేనలో చేర్పించి సీటు ఇప్పించారనే చర్చ జరుగుతోంది. వీరిరువురు ముందు రోజు జనసేనలో చేరి సాయంత్రానికి అభ్యర్థులయ్యారు.
భారతీయ జనతా పార్టీ మరి కొన్ని సీట్లు జనసేన నుంచి లాక్కోవడం చివరకు జనసేనకు 21 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలకు కుదించింది. అయినా ఆ కుదింపును ప్రసాదంగా స్వీకరించిన జనసేన పార్టీ ఆచి తూచి తన అభ్యర్థులను మూడు నుంచి నాలుగు దఫాలుగా ప్రకటించింది. చంద్రబాబు మాత్రం మూడు దఫాల్లో అభ్యర్థులందరినీ ప్రకటించేశారు. చంద్రబాబు దగ్గర ఎవరైతే ప్రాముఖ్యం ఉండి, సీట్లు సంపాదించుకోలేక పోయారో వారిని కాస్తా ఆదరించాలని పవన్ కల్యాణ్‌కు చెప్పినట్లు ఆయన అభ్యర్థుల ఎంపిక స్పష్టం చేస్తోంది. ఇందులో నిజం లేక పోలేదని తెలుగుదేశం పార్టీ వాళ్లే చెప్పకనే చెబుతున్నారు.
50శాతానికి పైన కాపులకు..
జనసేన పార్టీ మొత్తం 21 అసెంబ్లీ స్థానాల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు స్థానాలు పోను కాపులకు 12 స్థానాలను కేటాయించింది. అంటే దాదాపు 50 శాతం స్థానాలు జనసేనలో కాపులు మాత్రమే పోటీ చేస్తున్నారు. ఇక రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఎస్సీ రిజర్వుడు స్థానాలు 3 ఉన్నాయి. ఆ మూడింటిలో వేరే వారికి సీటివ్వడం సాధ్యం కాదు కాబట్టి ఎస్సీలకే అవకాశం కల్పించారు. అలాగే రెండు ఎస్టీ రిజర్వుడు స్థానాలున్నాయి. ఆ రెండు కూడా ఎస్టీలకే కేటాయించారు. లేకుంటే ఏ క్షత్రియనో, ఏ కాపునో తీసుకొచ్చి పెట్టేవారేమో అనే అనుమానాలు కూడా స్థానిక ఓటర్ల నుంచి వ్యక్తమవుతున్నాయి. అయినా రిజర్వేషన్లను మార్చే శక్తి పవన్ కల్యాణ్‌కు లేదు కాబట్టి ఆ రెండింటిని ఎస్టీలకే కేటాయించారు. మరో రెండు స్థానాల్లో బిసి ఓటర్లు 50 శాతం ఉన్నారు కాబట్టి దిక్కు తోచక అక్కడ బిసిలకే సీట్లు కేటాయించారు. ఒక్క స్థానంలో క్షత్రియులకు, మరొక స్థానంలో కమ్మ సామాజిక వర్గానికి సీటు కేటాయించడం కూడా విశేషంగానే చెప్పుకుంటున్నారు.
కాపులెక్కడంటే ..
పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్, అనకాపల్లి నుంచి కొణతల రామకృష్ణ, కాకినాడ రూరల్ పంతం నానాజీ, రాజానగరం బత్తుల బలరామకృష్ణ, నిడద ఓలు కందుల దుర్గేష్, పెందుర్తి పంచకర్ల రమేష్‌బాబు, యలమంచిలి సుందరపు విజయకుమార్, తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్, భీమవరం పులపర్తి ఆంజనేయులు, తిరుపతి ఆరణి శ్రీనివాసులు, అవనిగడ్డ మండలి బుద్దప్రసాద్ జనసేన పార్టీ అభ్యర్థులుగా ఆయా నియోజక వర్గాల్లో ఎంపికయ్యారు. విచిత్రం ఏమిటంటే అవనిగడ్డ నుంచి మండలి బుద్ద ప్రసాద్, భీమవరం నుంచి పులపర్తి ఆంజనేయులు అప్పటికప్పుడు జనసేన పార్టీలో చేరి టికెట్లు సంపాదించారు. పులపర్తి ఆంజనేయులు గతంలో తెలుగుదేశం పార్టీలో ఉండటంతో పాటు ప్రస్తుత తెలుగుదేశం పార్టీలో భీమిలి టీడీపీ అభ్యర్థి అయిన గంటా శ్రీనివాసరావు వియ్యకుండు కావడం విశేషం. అవనిగడ్డ నుంచి మండలి బుద్ద ప్రసాద్ నిన్న మొన్నటి వరకు టీడీపీలో ఉండి తమ శాసన సభ డిప్యూటీ స్పీకర్‌గా కూడా వ్యవహరించి టీడీపీని కాదని జనసేనలో టికెట్‌ను సంపాదించడం చర్చనీయాంశం.
12 అసెంబ్లీ నియోజక వర్గాల్లో అభ్యర్థులందరూ కాపులే
మొత్తం 12 నియోజక వర్గాల్లో కాపులే అభ్యర్థులుగా ఉన్నారు. విచిత్రం ఏమిటంటే ఈ 11 నియోజక వర్గాల్లో కాపులు కేవలం పూర్వపు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనే ఉండటం విశేషం. మరొకరు రాయలసీమ ప్రాతమైన తిరుపతి నుంచి ఆరణి శ్రీనివాసులు పోటీలో ఉంటున్నారు. ఇప్పుడు చెప్పండి జనసేన పార్టీ కాపు సామాజిక వర్గానికి కొమ్ము కాస్తుందా లేదా?. కుల పార్టీనా కాదా?. ఆలోచించాల్సింది ఓటర్లే. ఏదేమైనా కాపులకు పెద్ద పీట వేసింది జనసేన పార్టీనే. ఇందులో ఏమాత్రం రెండో మాట లేదు.
అలాగే ఎస్సీ రిజర్వేషన్లు ఉన్న 3 నియోజ వర్గాలైన రైల్వే కోడూరు నుంచి డాక్టర్ యనమల భాస్కర్‌రావు, రాజోలు నుంచి దేవ వరప్రసాద్, పి గన్నవరం నుంచి గిడ్డి సత్యనారాయణలను రంగంలోకి దించింది. అదేవిధంగా ఎస్టీ రిజర్వుడు స్థానాలైన పాలకొండ నుంచి నిమ్మక జయకృష్ణను రంగంలోకి దించారు. జయకృష్ణ నిజానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా చెప్పొచ్చు. చాలా కాలంగా నిమ్మక జయకృష్ణ టీడీపీలో ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. ఇక విశాఖ సౌత్ నియోజ వర్గాన్ని ఒక సారి పరిశీలిద్దాం. ఇక్కడ నుంచి సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ పేరును జనసేన ఖరారు చేసింది. ఈయన బిసి సామాజిక వర్గానికి చెందిన వారు. కనీసం యాదవ సామాజిక వర్గం నుంచి ఒక్కరికైనా ఇవ్వకుంటే బాగుండదని, పైగా ఎంతో కాలం నుంచి జనసేన పార్టీకి సేవ చేస్తున్నారని, సానుభూతిని చూపించారో ఏమో కానీ శ్రీనివాస్‌కు సీటిచ్చారు. ఇక నరసాపురం అసెంబ్లీ నియోజక వర్గం నుంచి బొమ్మిడి నాయకర్‌ను అభ్యర్థిగా జనసేన నాయకుడు పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఈయన మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన బిసి నేత. ఆ నియోజక వర్గంలో మత్స్యకార ఓట్లు సుమారు 1.10లక్షలకుపైగా ఉన్నాయి. కుల ప్రాతిపదికన తీసుకుంటే బొమ్మిడి నాయకర్ గెలుపు ఖాయమైనట్లే.
ఇక ఉంగుటూరు నుంచి పత్సమట్ల ధర్మరాజు పోటీ చేస్తున్నారు. ఆయన క్షత్రీయ కులానికి చెందిన వారు. అయితే మొదటి నుంచి జనసేనలోనే ఉంటూ ఆ పార్టీ నియమ నిబంధనలకు లోబడి పని చేశారు. అందువల్లనే ఆయనకు సీటు కేటాయించినట్లు సమాచారం. అయితే ఇక్కడ కూడా కాపులు తక్కువేమీ లేరు. సుమారు 2.25లక్షల ఓటర్లుంటే అందులో 50వేల మంది కాపులున్నారు. అలాగే క్షత్రియులు కూడా సుమారు 11వేల మంది వరకు ఉన్నారు. పార్టీకి సేవలందిస్తూ కష్టపడి పని చేస్తున్న ధర్మరాజుకు రాజుల కోటాలోనే సీటు దక్కింది.
ప్రత్యేకించి ఇక్కడ నెల్లిమర్ల గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడ అభ్యర్థి లోకం మాధవి నిజానికి బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన మహిళ. అయితే ఆమె భర్త తెలగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. నెల్లిమర్ల నియోజక వర్గంలో తెలగ సామాజిక వర్గం ఓట్లు సుమారు లక్ష వరకు ఉన్నాయి. అంటే మొత్తం ఓట్లలో సగం వరకు తెలగ సామాజిక వర్గానికి చెందిన ఓట్లేనని చెప్పొచ్చు. ఇది వారికి ప్రత్యేకంగా లభించే ఓటు బ్యాంకు.
పూర్తిస్థాయిలో పరిశీలిస్తే .. కాపులు అభ్యర్థులుగా ఉన్న ప్రతి నియోజక వర్గంలోను దాదాపు 50 శాతం పైగా కాపు ఓటర్లు ఉన్నారు. ఈ ఓటర్లు తప్పకుండా జనసేన పార్టీని గెలిపిస్తారని, అభిమానించి ఆదరిస్తారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. చూద్దాం. వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పవరేమిటో..కాపు ఓటర్ల బలమేమిటో.. బయట పడుతుంది. అప్పుడే కుల పార్టీలా..జన పార్టీలా అనే అంశం తెరపై వెలిగి పోతుంది.
Next Story