ప్రభుత్వం, అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు. సామాన్య ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు.
సంక్రాంతి సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణీకులకు ఎటువంటి ఇబ్బంది రానీయొద్దు అని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓ పక్క ఆదేశాలు ఇస్తుంటే మరోపక్క ప్రైవేటు ఆపరేటర్లు పబ్లిక్ గా ప్రయాణీకులను దోచేస్తున్నారు. సాధారణంగా ఉండే రేట్లకు డబుల్, త్రిబుల్ రేట్లకు టికెట్లను అమ్ముతున్నారు.
విజయవాడ నుంచి విశాఖపట్నానికి సాధారణ రోజుల్లో ఏసీ స్లీపర్‌లో ఒక్కో టికెట్ ధర రూ.1,000–1,200. కొన్ని బస్సుల్లో రూ.1,500 తీసుకుంటారు. సంక్రాంతి రద్దీ దష్టిలో పెట్టుకొని కొన్ని ప్రైవేటు ట్రావెల్స్ ఏకంగా రూ.4 వేలు, 5 వేలు వసూలు చేస్తున్నాయి. పైగా.. ఆన్‌లైన్‌లోనూ ఆ ధరలు ప్రదర్శిస్తున్నాయి. తనిఖీలు చేయాల్సిన రవాణా శాఖ అధికారులకు ఇదేమీ పట్టడం లేదు. దీంతో ప్రైవేటు ట్రావెల్స్ దోపిడీ బాహాటంగానే జరిగిపోతోంది.
‘ మీ కార్లలో మందుందా, మీ సూట్ కేసు లో ఏముందీ‘ అని సోదా చేసే అధికారులు ‘ మీరెంతకు టికెట్ కొన్నారు ‘ అని మాట వరసకైనా అడగడం లేదు. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారితో బస్టాండ్లు, ప్రధాన బస్‌స్టాప్‌లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. విద్యాసంస్థలకు జనవరి 12 నుంచి సెలవులు ఇవ్వడం, హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులు సొంతూళ్లకు వెళ్తుండటంతో శుక్ర, శని, ఆదివారాల్లో ఎక్కువ మంది ప్రయాణిస్తున్నారు. ఇదే అదనుగా ప్రైవేటు ట్రావెల్స్ డిమాండ్‌ను బట్టి రేట్లు పెంచేస్తున్నాయి.
విజయవాడ నుంచి విశాఖపట్నానికి అనేక ట్రావెల్స్ సంస్థలు ఏసీ స్లీపర్ టికెట్‌కు రూ.2 వేల నుంచి రూ.3 వేలు వసూలు చేస్తున్నాయి. కొన్నైతే ఏకంగా రూ.4 వేలు ధర పెట్టాయి. విజయవాడ నుంచి కడపకు ఒక్కో ఏసీ స్లీపర్ టికెట్ ధర రూ.2,500, తిరుపతికి రూ.2 వేలు– 3 వేలకు విక్రయిస్తున్నాయి.
విజయవాడ నుంచి శ్రీకాకుళం జిల్లాలోని వివిధ ప్రాంతాలకు నిత్యం నాన్ ఏసీ సీటర్ బస్సులు తిరుగుతాయి. వీటిలో సాధారణ రోజుల్లో టికెట్ రూ.500–600. నాన్ ఏసీ స్లీపర్‌కు రూ.700 ఉండేది. ఇప్పుడు నాన్ ఏసీ సీటర్‌లో రూ.1,500, స్లీపర్‌లో రూ.2 వేలు వసూలు చేస్తున్నారు. విజయవాడ నుంచి కాకినాడ, అమలాపురం, నెల్లూరు.. తదితర ప్రాంతాలకూ ఇదేవిధంగా అధిక ఛార్జీలు బాదేస్తున్నారు.
ఆర్టీసీ బస్సుల్లో అధిక రద్దీ
ఆర్టీసీ బస్సులన్నీ కిటకిటలాడుతున్నాయి. రెగ్యులర్ సర్వీసులకు తోడు పండగ కోసం ఆర్టీసీ 3,900 ప్రత్యేక బస్సులు నడుపుతోంది. వీటిలో హైదరాబాద్ నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు వచ్చేవారి కోసం 2,400 ప్రత్యేక బస్సులు వేసింది. విజయవాడ నుంచి ఊళ్లకు వెళ్లే వారి కోసం శుక్ర, శనివారాల్లో అదనంగా 120 ప్రత్యేక బస్సులు నడుపుతోంది. బెంగళూరు నుంచి 375, చెన్నై నుంచి 42 ప్రత్యేక బస్సులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు తిరుగుతున్నాయి. విజయవాడ బస్టాండ్‌లో 50 బస్సులు అదనంగా అందుబాటులో ఉంచారు. పండగ ప్రత్యేక బస్సులపై ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు శుక్రవారం ఈడీలతో సమీక్షించారు. ప్రయాణికులంతా గమ్యస్థానాలకు చేరేలా అవసరమైన బస్సులు నడపాలని ఆదేశించారు.
రైళ్లన్నీ కిటకిట
సంక్రాంతి ప్రయాణికులతో రైళ్లన్నీ కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్ వైపు నుంచి ఏపీ వైపు వచ్చే రైళ్లు రద్దీగా ఉన్నాయి. సాధారణ రిజర్వేషన్లు ఎప్పుడో అయిపోవడంతో, తత్కాల్, ప్రీమియం తత్కాల్ టిక్కెట్ల కోసం ఎక్కువ మంది ప్రయత్నాలు చేస్తున్నారు. హైదరాబాద్ శివారు చర్లపల్లి నుంచి నరసాపురం, కాకినాడ, శ్రీకాకుళం తదితర ప్రాంతాలకు 43 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నారు. అన్నీ జనరల్ బోగీలతో కూడిన 16 జనసాధారణ్ రైళ్లను చర్లపల్లి స్టేషన్ నుంచి రాష్ట్రానికి నడుపుతున్నారు. 15 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అదనపు బోగీలు జతచేశారు. సికింద్రాబాద్–విశాఖ మధ్య నడిచే వందేభారత్‌కు 4 ఛైర్‌కార్ కోచ్‌లను జతచేశారు.
ఈ రద్దీ.. సంక్రాంతి స్పెషల్
సంక్రాంతి నేపథ్యంలో పట్నంవాసులు సొంతూళ్ల బాట పట్టడంతో రైల్వే స్టేషన్లు, బస్టాండ్‌లు కిక్కిరిసి పోతున్నాయి. శనివారం విశాఖ స్టేషన్‌లో ప్రయాణికులు ప్లాట్‌ఫాంపైనే కాకుండా ఇలా పట్టాల పక్కనా నిలబడి రైలు కోసం నిరీక్షించారు.
Next Story