ముదురుతున్న పోస్టల్ బ్యాలెట్ వివాదం.. బాబు కీలక సూచనలు
x

ముదురుతున్న పోస్టల్ బ్యాలెట్ వివాదం.. బాబు కీలక సూచనలు

ఆంధ్రలో ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు వివాదం ముదురుతోంది. వీటిపై ఎన్నికల సంఘం తీసుకొచ్చిన కొత్త నిబంధనలే ఈ వివాదానికి ప్రధాన కారణం.


ఆంధ్రలో ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు వివాదం ముదురుతోంది. వీటిపై ఎన్నికల సంఘం తీసుకొచ్చిన కొత్త నిబంధనలే ఈ వివాదానికి ప్రధాన కారణం. పోస్టల్ ఓటుపై ఆర్‌ఓ సీలు, సంతకం లేకపోయినా లెక్కించవచ్చని, ఆ ఓటు వేలిడ్ అవుతుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. దీనిపైనే ప్రస్తుతం టీడీపీ-వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. పోలింగ్ తర్వాత మౌన ముద్ర వేసిన నేతలంతా ఈ వివాద సమయంలో గొంతెత్తి విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో ఆంధ్రలో పోస్టల్ బ్యాలెట్ వార్ రోజురోజుకు అధికం అవుతోంది.

వైసీపీ ఫిర్యాదు

పోస్టల్ బ్యాలెట్ విషయంపై ఎన్నికల సంఘం చేసిన నిబంధనల సడలింపును వైసీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. వీటిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలంటూ ఏపీ అదనపు ఎన్నికల అధికారిని కలిసి ఫిర్యాదు చేశారు వైసీపీ నేతలు. పోస్టల్ బ్యాలెట్ కవర్ల దగ్గర నుంచి 13ఏ, 13బీకి సంబంధించిన అన్ని నిబంధనలను ముందుగానే ప్రకటించేశారని గుర్తు చేశారు. వాటిలో ఇప్పుడు సడలింపు ఎలా తీసుకొస్తారని, ఇది చట్టవిరుద్ధమే అవుతుందని వారు వివరించారు. ఈ ఫిర్యాదు చేసిన వారిలో మాజీ మంత్రి పేర్ని నాని కూడా ఉన్నారు. దీనిపై ప్రత్యేక దృష్టి సారించి న్యాయం చేయాలని అదనపు సీఈఓను కోరారు.

ఓటమి భయంతోనే ఈ రాద్దాంతం

పోస్టల్ బ్యాలెట్ నిబంధనల సడలింపులు వైసీపీ ఖండించడంపై టీడీపీ తీవ్రంగా స్పందిస్తోంది. ఓడిపోతామన్న భయంతోనే ఈ అంశంపై వైసీపీ ఇంతటి రాద్దాంతం చేస్తోందని టీడీపీ శ్రేణులు విమర్శిస్తున్నాయి. ఆర్వోలు చేసే తప్పుకు ఉద్యోగుల ఓట్లు పోవడం సరికాదని, దీనినే ఉద్యోగ సంఘాలు కూడా చెప్తున్నాయని టీడీపీ వివరించింది. కాబట్టి ఈ సడలింపు ఎట్టిపరిస్థితుల్లో చట్టవిరుద్దం కాదని, ఎవరో చేసిన తప్పుకు ఒక ఉద్యోగి తన ఓటును ఎందుకు కోల్పోవాలని టీడీపీ ప్రశ్నించింది.

ఇదే రికార్డ్

మరోవైపు ఈసారి ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు రికార్డ్ స్థాయిలో నమోదయ్యాయి. ఇప్పటికే వైసీసీ ప్రభుత్వం అన్ని రంగాలు ఉద్యోగులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసి ఉన్నారు. అందుకే ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ల విషయంలో వైసీపీ భారీగా ఆందోళన చెందుతుందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈసారి ఎన్నికల్లో మొత్తం 5 లక్షల 39 వేల 189 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోల్ అయ్యాయి. వీటిలో శ్రీకాకుళంలో అత్యధికంగా 38 వేల 865 ఓట్లు పోల్ అయినట్లు ఈసీ ప్రకటించింది. భారీగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోల్ కావడంతో ఈసారి ఎన్నికల ఫలితాలు వెలువడం కూడా ఆలస్యం కావొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

చంద్రబాబు కీలక సూచనలు

రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వివాదం ముదురుతున్న నేపథ్యంలో పార్టీ నేతలకు చంద్రబాబు కీలక సూచనలు చేశారు. రాష్ట్రానికి తిరిగి వచ్చీరాగానే టెలీకాన్ఫరెన్స్ ద్వారా నేతలతో చర్చించారు. ఇందులో భాగంగానే మే 31న ఆయన ఎలక్షన్ ఏజెంట్లతో భేటీ కానున్నారని, జూన్ 1న జోనల్ స్థాయిలో టీడీపీ ఏజెంట్లకు పార్టీ శిక్షణ అందిస్తుందని చెప్పారు. అందులో భాగంగానే కౌంటింగ్ రోజున పూర్తి బందోబస్తు ఏర్పాటు చేయాలని కూడా బాబు.. నేతలకు సూచించారు. పోస్టల్ బ్యాలెట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, వైసీపీ రాద్దాంతం చేస్తున్న క్రమంలో మరింత జాగ్రత్తగా పోస్టల్ బ్యాలెట్లను గమనించాలని హెచ్చరించారు. ఓడిపోతామని తెలియడంతో తమ ఓటమిని కవర్ చేసుకోవడానికి వైసీపీ కారణాలు వెతుక్కుంటుందని బాబు చెప్పారని పార్టీ వర్గాలు తెలిపాయి.

Read More
Next Story