‘ఆ ఘనత మూటకట్టుకున్న తొలి సీఎం జగనే’.. ప్రజాగళంలో చంద్రబాబు
x
Source: Twitter

‘ఆ ఘనత మూటకట్టుకున్న తొలి సీఎం జగనే’.. ప్రజాగళంలో చంద్రబాబు

పత్తిపాడు ప్రజాగళం సభ వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు.. సీఎం జగన్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం లేదని దుయ్యబట్టారు.


జగన్ ప్రభుత్వం అంటే ప్రజల్లో విశ్వాసం లేదని, ప్రజల నమ్మకం కోల్పోయిన తొలి ప్రభుత్వం జగన్‌దేనని టీడీపీ నేత చంద్రబాబు చురకలంటించారు. అభివృద్ధి, ప్రజా సంక్షేమం, ప్రజా పరిరక్షణకు పెద్దపీట వేసే పాలన రావాలి అంటే ఈ సైకో సీఎం పోవాలని, అది ప్రజల చేతుల్లోనే ఉందంటూ రానున్న ఎన్నికల్లో కూటమిని గెలిపించాలని ప్రజలను కోరకనే కోరారు చంద్రబాబు. ప్రజలకు న్యాయం జరగాలన్నదే జనసేనాని పవన్ కల్యాణ్ ధ్యేయమని, ఆ ఆశయ సాధన కోసమే ఆయన రాజకీయాల్లోకి వచ్చారని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఎన్నికల బరిలో నిలబడనున్న కూటమిలో ఉన్న పార్టీలవి జెండాలు వేరైనా అజెండా ఒక్కటేనని, రాష్ట్ర భవిష్యత్తు కోసం మూడు పార్టీలు ఒక్కోరకంగా త్యాగాలు చేశాయని వెల్లడించారు చంద్రబాబు. అనంతరం వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. ఆంధ్రలో భూమి విలువ తగ్గిపోవడానికి జగనే కారణమని ఆరోపించారు.

ప్రభుత్వం అంటే విశ్వాసం లేదు

‘‘రాష్ట్రంలో భూమి విలువ తీవ్రంగా పడిపోయింది. ఇంకా పడిపోతూనే ఉంది కూడా. అందుకు రాష్ట్రంలో అభివృద్ధి కనుమరుగుకావడమే కారణం. ప్రస్తుతం రాష్ట్రంలో భూమి కొనేవాడే లేరు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తేనే కదా భూమి విలువ పెరిగేది. కానీ రాష్ట్రాన్ని ఇప్పుడున్న ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందన్న నమ్మకం రాష్ట్ర ప్రజలకు ఇసుమంత కూడా లేదు. సీఎం కూడా అభివృద్ధి చేసే ముఖ్యమంత్రి కాదు. ప్రజల విశ్వాసం కోల్పోయిన ప్రభుత్వంగా జగన్ నేతృత్వంలోని సర్కార్ అరుదైన ఘనతను మూటగట్టుకుంది. టీడీపీ తెచ్చిన అమరావతి ఒక్కటి వచ్చి ఉన్నా లక్షల ఉద్యోగావకాశాలు లభించి ఉండేవి. ప్రభుత్వ ఆదాయంతో పాటు ప్రజల ఆదాయం కూడా గణనీయంగా పెరిగి ఉండేది. కానీ ఈ సైకో సీఎం.. అమరావతిని సర్వనాశనం చేశారు. ప్రభుత్వ ఆదాయానికి ఐదేళ్లలో నాలుగు లక్షల కోట్ల నష్టం తీసుకొచ్చారు’’ అంటూ సీఎం జగన్‌పై మండిపడ్డారు.

ఒక్క నెలే టైం

మే 13న ఆంధ్రలో ఎన్నికల పండుగ జరగనుంది. ఆ తర్వాత జూన్ 4న మరో పండగ జరగనుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అదే జగనాసుర వధ అని, దాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు జరుపుకోనున్నారంటూ చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘కూటమి అధికారంలోకి వస్తే అమరావతి మన రాజధాని. విశాఖపట్నం మన ఆర్థిక రాజధాని. కర్నూలును అభివృద్ధి చెందిన ప్రాంతంగా చేస్తాం. అది నా బాధ్యత. దాంతో పాటుగా రాష్ట్రంలో మరోపక్క నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. దానికి కూడా చెక్ పెడతాం. ప్రజలకు రూ.60ల క్వార్టర్ మందును రూ.200కు అందిస్తూ.. నాసిరకం మందుతో జగన్.. ప్రజల నెత్తురు తాగుతున్నారు’’అని దుయ్యబట్టారు.

Read More
Next Story