అయిననూ... త్యాగం తప్పదు..!!
పార్టీ కోసం కష్టపడ్డారు. త్యాగాలు తప్పవు. అనే మాటలతో టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు అభ్యర్థులను మార్చబోమనే సంకేతం ఇచ్చారు.
(ఎస్.ఎస్.వి. భాస్కర్ రావ్)
తిరుపతి: పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారు.. ధర్నాలు చేశారు.. అరెస్టయ్యారు.. జైలుకు వెళ్లారు.. భవిష్యత్ అవసరాలు, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా త్యాగాలూ తప్పవని టీడీపీ అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడు పార్టీ నాయకులకు కర్తవ్య బోధ చేశారు. ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థులు, మిత్రపక్షాలకు కేటాయించిన సీట్లలో అభ్యర్థులను మార్చే ప్రసక్తి ఉండబోదనే సంకేతం ఇచ్చారు. దీర్ఘకాలిక ప్రయోజనాలు పొందాలంటే, కొన్ని త్యాగాలు చేయక తప్పదని హితవు పలికారు.
ఈ ఎన్నికల్లో పోటీ చేయించనున్న ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో శనివారం టీడీపీ అధ్యక్షుడు ఎన్ చంద్రబాబునాయుడు వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సభలో ఆయన మాట్లాడుతూ.. పొత్తు ధర్మాన్ని పాటిస్తూ, పార్టీ కోసం కష్టపడిన వారికి న్యాయం చేయలేకపోయామని అసహ్యత వ్యక్తం చేశారు. పొత్తు ధర్మంలో భాగంగా ఇది తప్పదన్నారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ పార్టీ కోసం కష్టపడ్డారు. ఆందోళనలు నిర్వహించారు. ధర్నాలు చేశారు. జైలు కూడా వెళ్లారంటూ.. మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గంలోని పార్టీ క్యాడర్ చేసిన సాహసాలను ఆయన అభినందించారు. పొత్తు ధర్మంలో భాగంగా జనసేనకు కేటాయించిన తిరుపతి సీటులో అభ్యర్థిని మార్చే అవకాశం ఉండదని ఆయన స్పష్టం చేశారు.
మిగతా చోట్లా అంతే..
చిత్తూరు జిల్లాలో తిరుపతి తర్వాత.. శ్రీకాళహస్తి, మదనపల్లి, తంబళ్లపల్లె, సత్యవేడు అసెంబ్లీ స్థానాల్లో కూడా టీడీపీ అభ్యర్థులను ప్రకటించారు. ఈ నియోజకవర్గాల్లో టీడీపీలో అంతర్గత పోరు, జనసేన నుంచి కూడా నిరసన వ్యక్తం అవుతుంది. వేరుకుంపట్లు పెట్టినా టికెట్లు దక్కని వారు అభ్యర్థులను మార్చాలని డిమాండ్ చేస్తున్నారు.
అర్థం అదేగా...
విజయవాడలో శనివారం నిర్వహించిన వర్క్‌షాప్ ద్వారా టీడీపీ అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడు ఇచ్చిన సందేశం చూస్తే ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థులను మార్చే ప్రసక్తి ఉండబోదనే సంకేతాన్ని ఆయన నేరుగా ఇచ్చినట్లు భావిస్తున్నారు. పట్టు వీడకుండా ఆందోళన చేస్తున్న నాయకుల సమాచారం ఎప్పటికప్పుడు టీడీపీ అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌కు అందుతూనే ఉంది. అభ్యర్థుల ఎంపికలో తలమునకలైన వారు ఈ విషయాలను చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని పార్టీ వర్గాల సమాచారం. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తికావచ్చిన నేపథ్యంలో.. అసంతృప్తులను, తిరుగుబాటుదారులను దారిలోకి తెచ్చుకోవడానికి ఎలాంటి నష్ట నివారణ చర్యలు చేపడతారో అనేది వేచి చూడాలి.