కుప్పం ప్రజలపై హామీలు.. వైసీపీపై విమర్శల జల్లు కురిపించిన చంద్రబాబు
కుప్పంలో మహిళలతో నిర్వహించిన ముఖాముఖి సమావేశంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, రాష్ట్ర అభివృద్ధే తమ అజెండా అని వెల్లడించారు.
ప్రజాస్వామ్య పరిరక్షణ, రాష్ట్ర అభివృద్ధి తమ అజెండా అని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. తమ కూటమి అధికారంలోకి వస్తే పెన్షన్ రూ.4000కు పెంచుతామని, దానిని ఇంటికే తెచ్చి అందిస్తామని తేల్చి చెప్పారు. వైసీపీ హయాంలో రాష్ట్రంలో 30 ఏళ్లు వెనక్కు వెళ్లిందని, దాన్ని మళ్లీ గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు. అందుకు కేంద్ర ప్రభత్వం సహకారం కావాల్సి ఉంటుందని పరోక్షంగా చెప్పారు. అనంతరం కుప్పంలోకి ఎలా అడుగు పెడతారంటూ సీఎం జగన్, మంత్రి పెద్దదిరెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా ప్రశ్నించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు హంద్రినీవా ప్రాజెక్ట్‌ను 90 శాతం పూర్తి చేశామని, మిగిలిన 10 ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడానికి వాళ్లకు ఏళ్లు పట్టిందని, అయినా నీళ్లు రాలేదని విమర్శించారు.
తాము అధికారంలోకి వస్తే వచ్చే సీజన్ నాటికి కుప్పంలోని అన్ని నదులు నీళ్లతో కళకళాడేలా చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచార బస్సు యాత్రను ప్రారంభించడానికి రెండు రోజుల ముందు ఆయన కుప్పంకు చేరుకున్నారు. అక్కడ గంగమ్మ ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం కుప్పంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన వైసీపీ నేతలపై విమర్శలు గుప్పించారు. ఐదేళ్లలో ప్రజలకు కోసం వైసీపీ ప్రభుత్వం ఏమీ చేయలేదని, అప్పులు తెచ్చి సంక్షేమం చేసినట్లు ఫోజులు మాత్రమే కొట్టిందంటూ ధ్వజమెత్తారు.
అంతేకాకుండా కూటమి అధికారంలోకి వస్తే కుప్పంను దేశం గర్వించేలా అభివృద్ధి చేసి చూపుతానన్నారు. దాంతో పాటుగా మహిళల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని, అన్ని రంగాల అభివృద్దికి పెద్దపీట వేస్తానని హామీ ఇచ్చారు. కుప్పంను అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. అంతేకాకుండా వైసీపీ పార్టీపై విమర్శల అస్త్రాలను సంధించారు. వైసీపీ ప్రభుత్వానికి అసలు బాధ్యత అనేది ఉందా అని ప్రశ్నించారు. వైసీపీ హయాంలోనే రాష్ట్రం భ్రష్టుపట్టిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఆస్తులకు రక్షణ కరువు
వైసీపీ హయాంలో రాష్ట్రంలో ఎవరి ఆస్తులకు రక్షణ లేదని, అందరి ఆస్తులకు ప్రభుత్వంతోనే ప్రమాదం ఉండేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఐదేళ్లో రాష్ట్రంలో భూమాఫియా యథేచ్చగా సాగింది. అందుకు ఒంటిమిట్ట, విశాఖ, తిరుపతి, పలమనేరులో సంభవించిన ఘటనలే ఉదాహరణలు. ప్రజల శ్రేయస్సు కోసం తెచ్చిన ఆన్‌లైన్ విధానాన్ని వైసీపీ నేతలు తమ స్వార్థం కోసం, అక్రమాలు చేయడానికి అనువుగా మలుచుకున్నారు. కుప్పంలో కుప్పి గంతులు వేసిన జగన్.. అభాసుపాలయ్యారు. కుప్పంలో టీడీపీ తప్పకుండా లక్ష మెజార్టీ దాటాలి. అందుకోసం పార్టీ కార్యకర్తలు కృషి చేయాలి. వైసీపీ హయాంలో కుప్పం అభివృద్ధి కుప్పకూలింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కుప్పం అభివృద్ధిని మళ్లీ ముందుకు సాగిస్తాం. ప్రత్యేక ప్రణాళికలతో కుప్పంను దేశానికి ఆదర్వంగా మారుస్తాం. రూ.10 ఇచ్చి రూ.100 దోచే ప్రభుత్వాలు మనకొద్దు. ఆంక్షలు, బాదుడు లేని సంక్షేమానికి ఓటు వేయండి. కూటమి ప్రభుత్వం వస్తే ప్రతి నెల రూ.4వేల పెన్షన్ అందిస్తాం. అది కూడా మీ ఇంటికే వస్తుంది’’అని చంద్రబాబు హామీ ఇచ్చారు.
కుప్పంపై చంద్రబాబు ప్రశంసలు
ఈ ముఖాముఖి సందర్భంగా కుప్పం నియోజకవర్గం, ప్రజలపై చంద్రబాబు ప్రశంసలు గుప్పించారు. మనది బంగారు కుప్పం అంటూ సంతోషం వ్యక్తం చేశారు. ‘‘సైకిల్ గుర్తుకు తప్ప ఇతర పార్టీలకు ఓటేయడం అనేది కుప్పంకు తెలీదు. ఈసారి ఎన్నికల్లో టీడీపీకి లక్ష మెజార్టీ ఇవ్వాలని మీరే నిర్ణయించుకున్నారు. రాష్ట్రంలో అతిపెద్ద మెజార్టీ కుప్పందే కావాలి. కుప్పం గురించి బయట కాలర్ ఎగరరేసుకుని చెప్తున్నానంటే అది మీ ప్రేమ, అభిమానమే. కొందరు నేతలు కులం, మతం చూసుకుని తాము ఎక్కడి నుంచి పోటీ చేయాలో నిర్ణయించుకుంటారు. నేను మాత్రం పేదలు ఎక్కడున్నారా అన్ని వెతుక్కుంటూ ఇక్కడకు వచ్చాను. ఇక్కడి ప్రజలు కూడా నన్ను అదే విధంగా ఆదరించి వరుసగా పట్టం కడుతున్నారు. ఇప్పటివరకు కుప్పం నుంచి ఏడుసార్లు పోటీ చేశాను. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వస్తుండగా మీ ఆశీర్వాదం తీసుకుందామని ఇక్కడ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాను. మీ రుణాన్ని తీర్చుకోవడం అనేది ఎన్ని జన్మలెత్తినా వీలుపడదు’’అని భావోద్వేగంగా మాట్లాడారు చంద్రబాబు.
వైసీపీకి డిపాజిట్లు కూడా ఇవ్వొద్దు
‘‘కుప్పం ప్రజలకు వైసీపీ ప్రభుత్వం ఎంతో అన్యాయం చేసింది. అలాంటి వాళ్లకు ఈసారి ఎన్నికల్లో డిపాజిట్లు కూడా ఇవ్వొద్దు. ఒక్క ఓటును కూడా వాళ్లకు వేయొద్దు. పేదలకు రెండు పూటలా కడుపు నింపాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లను కూడా మూయించేసిన వైసీపీ వాళ్లు అసలు మనుషులేనా. పోలీసులకు అడ్డుపెట్టుకుని ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోయిన వైసీపీ నేతలకు ఇదే నా హెచ్చరిక.. రానున్న ఎన్నికల్లో మీకు ఇక్కడి ఓటర్లు తగిన గుణపాఠం నేర్పిస్తారు. ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఇప్పుడు మీకు, మాకు ఎవరికీ పోలీసుల అండలేదు. ఈసీ ఆదేశాలను అందరం తూచా తప్పకుండా పాటించాల్సిందే. మీ కుప్పిగంతులు ఇప్పుడు సాగవు. నియోజకవర్గానికి రాకుండా నన్ను అడ్డుకున్నారు. నాపై అక్రమ కేసలు పెట్టారు. మా నేతలను జైల్లో పెట్టారు. అధికార అహకారంతో కళ్లు మూసుకుపోయి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించారు. ఇప్పుడు అధికారమంతా ప్రజల చేతుల్లో ఉంది. ప్రజాస్వామ్యాన్ని ప్రజలే కాపాడాలి’’అని కోరారు ఆయన.
నీళ్లు ఏవి సీఎం గారూ
కుప్పానికి హంద్రినీవా నీళ్లు ఇస్తానన్నారు. అవెక్కడ ఉన్నాయో సీఎంకే తెలియాలంటూ సెటైర్లు వేశారు చంద్రబాబు. ‘‘హంద్రినీవా నీళ్ల అంశంపై డ్రామాలు ఆడతావా సైకో సీఎం. సీఎం గేట్లు ఎత్తారు.. జలగా నీళ్లేవి అంటూ అంతా ప్రశనిస్తున్నారు. నేను సీఎంగా ఉన్నప్పుడు పులివెందులకు కూడా నీళ్లు ఇచ్చాం. ఐదేళ్లు అధికారంలో ఉన్నా 10శాతం ప్రాజెక్ట్‌లను పూర్తి చేయలేని చమటదద్దమలు వైసీపీ నేతలు.. నన్ను విమర్శిస్తారా? కుప్పంలో నన్ను ఓడించడానికి కొందరు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అందులో బాగంగానే వైనాట్ కుప్పం అంటూ నినాదాలు చేస్తున్నారు. కానీ మీ మద్దతు ఉన్నంత కాలం నన్ను ఏ శక్తీ ఓడించలేదన్న నమ్మకం నాకుంది’’అని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.
‘‘ప్రతి ఒక్కరూ కూటమి అభ్యర్థులకే ఓటేయండి. ఒక దుర్మార్గుడు రాష్ట్రాన్ని నాశం చేశారు. దాన్ని తిరిగి మళ్లీ బాగు చేసుకోవడానికి ఈసారి కూటమికి ఓటేయండి. నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఐదేళ్లలో జరిగినటువంటి దారుణాలను నేను ఎన్నడూ చూడలేదు. రానున్న ఎన్నికల్లో కలిసికట్టుగా పోరాడి సైకోను తరిమేద్దాం. ప్రజలు గెలివాలి.. రాష్ట్రం నిలవాలి అన్నదే నా అజెండా. రాష్ట్రాన్ని వైసీపీ ఐదేళ్లల్లో 30 ఏళ్లు వెనక్కు నెట్టేసింది. అటువంటి రాష్ట్రాన్ని గాడిన పెట్టడం అత్యవసరం. అందుకు ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలి. కేంద్రంలో 400కు పైగా, రాష్ట్రంలోని ఎమ్మెల్యే స్థానాల్లో 160కి పైగా గెలివాలి. రాష్ట్రంలో 24 మంది ఎంపీలు కూటమి వాళ్లే గెలివాలి. ఎన్‌డీఏ ప్రభుత్వంలో వ్యవస్థలపై దాడులు ఉండవు. అందరికీ పూర్తి స్థాయి భద్రత ఉంటుంది. రాష్ట్రానికి డ్రగ్స్, మారణాయుధాలు కాకుండా పెట్టుబడులు వస్తాయి’’ అని చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.