నిద్రపోతున్న నీళ్ల ప్రాజెక్టుల కోసం ఓట్లేయాలా జగన్...
x
Source: Twitter

నిద్రపోతున్న నీళ్ల ప్రాజెక్టుల కోసం ఓట్లేయాలా జగన్...

‘ప్రజాగళం’ ప్రచారయాత్రను టీడీపీ అధినేత చంద్రబాబు.. పలమనేరులో ప్రారంభించారు. ఈ సభలో సీఎం జగన్‌కు ఓట్లు అడిగే హక్కు లేదంటూ బాబు మండిపడ్డారు.


రాయలసీమను రాళ్ల సీమగా మార్చిన ఘనుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అని టీడీపీ అధినేత చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజలను ఓటు అడిగే హక్కు కూడా వైసీపీ నేతలకు లేదని, రాష్ట్రానికి, ప్రజలకు ఏం చేశారని ఇప్పుడు వచ్చి ఓట్లు అడుగుతారని విమర్శించారు. ‘ప్రజాగళం’ పేరిట ప్రారంభించిన ప్రచారంలో భాగంగా పలమనేరులో నిర్వహించిన ప్రచారయాత్రలో అధికార పక్షంపై విమర్శలు గుప్పించారు ప్రతిపక్ష నేత చంద్రబాబు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రారంభించిన ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడంలో వైసీపీ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించిందని బాబు మండిపడ్డారు. ‘‘ఎన్నికలకు ‘మేమంతా సిద్ధమని’ ఆయన తిరుగుతున్నారు.. ఆయనను ఇంటికి పంపించడానికి ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారని అర్థం కావట్లేదు’’అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

నిద్రిస్తున్న నీళ్ల ప్రాజెక్ట్‌లు
‘‘టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సాగునీటి ప్రాజెక్ట్‌లకు పెద్దపీట వేశాం. కరువు సీమలో కూడా నీళ్లు పారాయి. రాష్ట్ర విభజనతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సాగునీటి ప్రాజెక్ట్‌ల విషయంలో రాజీ పడలేదు. ఈ ప్రాజెక్ట్‌ల కోసం ఐదేళ్లలో రూ.68వేల కోట్లు ఖర్చు చేశాం. రాయలసీమలోనే రూ.12 వేల కోట్లు ఖర్చు పెట్టాం. తెలుగు గంగ, హంద్రీనీవా, గాలేరు-నగరి ప్రాజెక్ట్‌లు మేము ప్రారంభించినవే. వీటిలో హంద్రీనీవా ప్రాజెక్ట్‌పై రూ.4,200 ఖర్చు చేసి పనులను పరుగులు పెట్టించాం. వీటిని టీడీపీ ప్రభుత్వంలోనే 90 శాతం పూర్తి చేశాం. కానీ అప్పుడు ప్రభుత్వం మారింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ఈ ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడంలో మొద్దునిద్ర పోతోతంది. మిగిలిన 10 శాతం పనులను కూడా ఇంకా పూర్తి చేయలేదు. పైగా అధికారంలోకి వచ్చాయ ఎన్నడూ లేని విధంగా 25 ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లను అటకెక్కించి అసహ్యపు చరిత్ర వైసీపీది. వైసీపీ ప్రభుత్వం రాయలసీమలో నీటిపారుదల ప్రాజెక్ట్‌ల కోసం కేవలం రూ.2,165 కోట్లే కేటాయించారు’’ అని వైసీపీ టార్గెట్‌గా మండిపడ్డారు చంద్రబాబు.
ముసుగు వీరుడు వస్తున్నాడు
రాయలసీమను రాళ్ల సీమగా మార్చిన సీమ ద్రోహి జగన్ మోహన్‌రెడ్డి అని చంద్రబాబు ధ్వజమెత్తారు. ‘‘రాయలసీమకు కృష్ణ నీళ్లు అందించిన సీఎం.. ఎన్‌టీఆర్. అదే రాయలసీమను కరువు ప్రాంతంలా.. రాళ్ల సీమలా మార్చిన సీఎం.. వైఎస్ జగన్. ఈ ముసుగు వీరుడు వస్తున్నాడంటే ఖాళీ రోడ్లు స్వాగతం పలకాలి. రానున్న ఎన్నికల్లో ప్రజలే ఈ సీఎంకు గుణపాఠం నేర్పాలి. జనం గెలవాలంటే జగన్ దిగిపోవాలి. రాష్ట్ర ప్రయోజనం కోసం కూటమి కట్టాం అంటే మమ్మల్ని విమర్శిస్తున్నారు. ఐదేళ్లపాటు అధికారంలో ఉన్న జగన్.. కేంద్రంలో బీజేపీ పెట్టిన అన్ని బిల్లులకు అంగీకార ముద్ర వేశారు. కానీ గత ఎన్నికల సమయంలో మైనారిటీలకు ఇచ్చిన ఏ హామీనైనా జగన్ నెరవేర్చారా?’’అని ప్రశ్నించారు. కాగా తాము గతంలో ఎన్‌డీయే కూటమిలో ఉన్నప్పుడు మైనారిటీలకు ఎన్నడూ అన్యాయం జరగలేదని, వారికి చెప్పిన వాటికన్నా ఎక్కువ పథకాలనే అమలు చేశామని వెల్లడించారు. రాయలసీమకు చేసిన అన్యాయంపై రాయలసీమలో జగన్‌ను ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు చంద్రబాబు.
Read More
Next Story