ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆగస్టు 1న కృష్ణా నదిలో జలహారతి ఇవ్వనున్నారు. ఈ మేరకు శ్రీశైలం వెళ్లనున్నారు.
దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా కృష్ణానదికి నీరు భారీగా చేరింది. ఇప్పటి వరకు నీరు లేక కృష్ణా డెల్టాకు కూడా సాగునీరు అందించలేదని పరిస్థితి ఏర్పడింది. నాగార్జున సాగర్ కుడి కాలువ ద్వారా తాగునీటిని తప్ప సాగునీరు విడుదల చేయలేదు. కృష్ణా నదిలో నీరు లేకపోవడమే ప్రధాన కారణం. కర్నాటకలో భారీగా వర్షాలు పడటంతో ఆల్మ్‌ట్టి డ్యామ్ నుంచి కృష్ణా జలాలను కిందకు వదిలారు. దీంతో శ్రీశైలం డ్యామ్ నిండింది. మూడే గేట్ల ద్వారా శ్రీశైలం నుంచి సాగర్‌కు నీరు విడుదల చేశారు.
సాగర్ డ్యామ్ కూడా నిండేందుకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం శ్రీశైలం డ్యామ్‌కు ప్రస్తుతం వరద ప్రవాహం ద్వారా 4,53,188 క్యూసెక్స్ నీరు వస్తోంది. సాగర్ డ్యామ్‌కు 1,66,160 క్యూసెక్స్ నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం డ్యామ్ పూర్తి నీటి నిలువ 215.81 టీఎంసీలు. ప్రస్తుతం శ్రీశైలం డ్యామ్‌లో ఉన్న నీటి నిల్వ 198.36టీఎంసీలు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జలాశయాన్ని పరిశీలించడంతో పాటు శ్రీశైలం కుడి జల విద్యుత్ కేంద్రాన్ని కూడా పరిశీలిస్తారు. త్వరలో విద్యుత్ ఉత్పత్తి చేపట్టే అవకాశం ఉంది.