
మా ఎమ్మెల్యే రాత్రి 10 తర్వాత రమ్మంటున్నారు!
ఆముదాలవలస, గుంటూరు తూర్పు ఎమ్మెల్యేల నివేదిక కోరిన చంద్రబాబు
గుంటూరు ఎమ్మెల్యే వ్యవహారం ఇంకా కొలిక్కి రాకమునుపే మరో టీడీపీ ఎమ్మెల్యే వివాదంలో చిక్కుకున్నారు. ఈ ఇద్దరు మహిళలను వేధింపులకు గురి చేస్తున్నారనే ఆరోపణలనే ఎదుర్కొంటున్నారు. తాజాగా ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ వివాదంలో చిక్కారు. ఓ కళాశాల ప్రిన్సిపాల్ ఈ ఎమ్మెల్యేపై ఆరోపణలు చేశారు. దీనిపై దళిత సంఘాలు భగ్గుమన్నాయి. కూన రవికుమార్ వేధింపులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ కళాశాల ప్రిన్సిపాలకు మద్దతుగా నిలిచాయి. ఎమ్మెల్యేపై ఎస్టీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసు పెట్టాలని డిమాండ్ చేశాయి. కేసు నమోదుచేయకపోతే ఆగస్టు 20న రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి ఆ ఎమ్మెల్యేని నిలదీయాలని నిర్ణయించాయి.
ఈ వివాదం తెరమీదికి రావడానికి సరిగ్గా 24 గంటల ముందే గుంటూరు తూర్పు టీడీపీ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పై ఓ మహిళ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే వేధింపులు భరాయించలేకే ఆత్మహత్యాయత్నం చేసినట్టు ఆ మహిళ ప్రకటించారు.
ఇప్పుడీ ఘటనలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. వీళ్లు చేసే పనుల వల్ల పార్టీకి తీవ్రనష్టం జరుగుతోందని మండిపడ్డారు. ఆముదాలవలస, గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేల తీరుపై తక్షణమే నివేదిక ఇమ్మని పార్టీ నాయకత్వాన్ని ఆదేశించారు. కీలకమైన పదవుల్లో ఉండే వారు ఇలా ఉంటే జనంలో చులకన అయిపోతామని హెచ్చరించారు. దీంతో వీరిద్దరిపై వేటు పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మిగతా ఎమ్మెల్యేలు ఇటువంటి వివాదాల్లోకి పోకుండా చూసేందుకే ఈపని చేస్తారని పార్టీ వర్గాలు చెప్పాయి.
ఇంతకీ వివాదం ఏమిటంటే...
పొందూరు కేజీబీవీ ప్రిన్సిపాల్ సౌమ్య ఆరోపించిన దాని ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి...
‘ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమా ర్ రాత్రి 10 గంటల తర్వాత పార్టీ కార్యాలయాలకు రావాలని తన అనుచరులతో పిలిపిస్తారు. చాలాసేపు అక్కడే ఉంచుతారు. రాత్రి 10.30 దాటిన తర్వాత వీడియో కాల్ చేసి వేధిస్తుంటాడు. శారీరకంగా, మానసికంగా వేధించాడు. సాధారణ కాల్స్ చేయరు. వీడియో కాల్ అయితేనే మాట్లాడతారని అనుచరులతో చెప్పిస్తారు. దుర్బుద్ధితోనే ఇదంతా... దారికి రాలేదని వేధింపులకు గురి చేస్తున్నారు. నా మాదిరిగా నియోజకవర్గంలో అనేక మంది మహిళా ఉద్యోగులను ఇబ్బంది పెట్టారు. ఎమ్మెల్యేతో పాటు టీడీపీ నేతల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకోవాలను కున్నా...!’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఆత్మహత్యాయత్నం చేశారు.
టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ ఈ వేధింపుల ఆరోపణను ఖండించారు. తనకు ఎటువంటి సంబంధం లేదన్నారు. కానీ సౌమ్య మాత్రం రవికుమార్ తీరు సక్రమంగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితురాలిని కావడం వల్లే ఆయన తీవ్రంగా వేధించారంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు.కూన రవికుమార్ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలని భావించినట్లు చెబుతున్నారు.
ఇటీవల ఎమ్మెల్యే ఇద్దరు మనుషులను పంపించి కేజీబీవీలోని టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందితో తనకు వ్యతిరేకంగా బలవంతంగా సంతకాలు చేయించినట్లు తెలిపారు. అధికారులు తనకు అండగా ఉండకపోగా ఎమ్మెల్యేకు కొమ్ము కాస్తున్నారని వాపోయారు.
గార, కంచిలి కేజీబీవీల ప్రిన్సిపాళ్లపై కూడా వ్యూహాత్మకంగా ఫిర్యాదులు చేయించి బదిలీలు చేయించారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
ఎమ్మెల్యే తీరును దళిత సంఘాలు తీవ్రంగా ఖండించాయి. సౌమ్యకు అండగా ఉంటామని ప్రకటించాయి. ఈనెల 20న రౌండ్ టేబుల్ సమావేశానికి అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు, మీడియాను ఆహ్వానిస్తున్నట్టు తెలిపాయి.
Next Story