ప్రజలకు సంక్షేమం అందించాల్సిన కూటమి ప్రభుత్వం వారి నుంచే డబ్బులు గుంజుకుంటోందని మాజీ మంత్రి మేరుగ ధ్వజమెత్తారు.


మెగా డీఎస్సీ పేరుతో సీఎం చంద్రబాబు నిరుద్యోగులను మోసం చేస్తున్నారని, వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను రద్దు చేసి, టెట్‌ పెడుతున్నామంటూ మోసాలకు పాల్పడ్డారని మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు మేరుగ నాగార్జున మండిపడ్డారు. ఇచ్చిన మాటను చంద్రబాబు ఎన్నడూ నిలబెట్టుకోలేదని, ఇచ్చిన హామీలను ఎప్పుడూ అమలు చేయలేదని ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎంతో ఆశతో ఎదురు చూస్తోన్న నిరుద్యోగ యువతను మెగా డీఎస్సీ పేరుతో మరో సారి మోసానికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. గురువారం ఆయన తాడేపల్లి వైఎస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం తీరును, సీఎం చంద్రబాబు పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వికలాంగులు, వృద్ధుల పెన్షన్లను కర్కశంగా కట్‌ చేసి, వారి జీవితాలతో చెలగాటం ఆడుకుంటున్నారని మండి పడ్డారు.

ప్రజలకు సంక్షేమ పథకాలను అందించాల్సిన సీఎం చంద్రబాబు ప్రజల నుంచే డబ్బులు గుంజుకుంటున్నారని ధ్వజమెత్తారు. దీపం పథకానికి రూ. 4500 కోట్లు అవసరమైతే.. కేవలం రూ. 800 కోట్లతోనే సరిపెట్టారని విమర్శించారు. అన్నా క్యాంటీన్లకు ఒక సారి వెళ్తే రెండో సారి వెళ్లే పరిస్థితి లేకుండా నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. ఇచ్చిన హామీలను చంద్రబాబు ఏనాడు నిలబెట్టుకోలేదని, నిరుద్యోగ భృతి పేరుతో యువతను మోసం చేశారని విమర్శించారు. వలంటీర్లను ఉద్యోగాల నుంచి తొలగించిన కూటమి ప్రభుత్వం అసూయ, కక్షలతో పాలన సాగిస్తోందని ధ్వజమెత్తారు. వ్యవసాయం దండగ అని తన పుస్తకంలో రాసుకున్న వ్యక్తి సీఎం చంద్రబాబు అని ధ్వజమెత్తారు. పెట్టుబడి సాయం కింద రైతులకు రూ. 20వేలు ఇస్తామని చెప్పి దగా చేశారని విమర్శించారు. తాము రైతులకు అండగా నిలుస్తామని, శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Next Story