శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల..
x

శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల..

ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతలు ప్రస్తుతం దేశమంతా హాట్ టాపిక్‌గా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ అంశంపైనే సీఎం చంద్రబాబు.. అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు.


ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతలపై కొన్ని రోజులుగా అధికార కూటమి నేతలు, విపక్ష వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయంటూ ఢిల్లీకి వెళ్లి మరీ ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధర్నా నిర్వహించారు. జగన్ ధర్నాకు ఇండియా కూటమి సభ్య నేతలైన ఎస్‌పీ అధినేత అఖిలేష్ యాదవ్, శివసేన నేత సంజయ్ రౌత్, ప్రియాంక చతుర్వేదీ కూడా మద్దతు పలికారు. ఆంధ్రప్రదేశ్‌ వ్యవహారంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని సంజయ్ రౌత్ కోరారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క క్షణం కూడా అధికారంలో ఉండటానికి కూటమికి హక్కు లేదంటూ సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. శాంతి భద్రతలపై ఇంతటి రచ్చ జరుగుతున్న నేపథ్యంలో కూటమి సర్కార్.. అసెంబ్లీలో రాష్ట్రంలోని శాంతి భద్రతలపైనే శ్వేతపత్రాన్ని విడుదల చేయడం ఆసక్తికర అంశంగా మారింది.

వైసీపీ హయాంలోనే అంతా జరిగింది: చంద్రబాబు

అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని విడుదల చేసిన సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ పాలనలోనే శాంతి భద్రతలు దయనీయ పరిస్థితికి చేరాయని అన్నారు. ‘‘ఈ శ్వేతపత్రాన్ని ఐదు అంశాలుగా విభజించాం. ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ రాష్ట్రంలోని శాంతి భద్రతలను అత్యద్భుతంగా నిర్వహిస్తోంది. గతంలో రాయలసీమలో వెరసిల్లిన ఫ్యాక్షనిజాన్ని కూడా కంట్రోల్ చేశాం. సీమలో ఫ్యాక్షనిజాన్ని సంపూర్ణంగా నిర్మూలించే దిశగా చర్యలు చేపట్టాలని కూడా ఆశించాం. ఇందులో భాగంగా మార్పు మా పార్టీ నుంచే ప్రారంభించి.. ఇద్దరు సీనియర్ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేశాం. ఆ తర్వాత ఫ్యాక్షనిజాన్ని పెంచి పోషిస్తున్న ఇతరులను అదుపులోకి తీసుకున్నాం. ఆ చర్యల ద్వారా రాయలసీమలో ఫ్యక్షనిజం లేకుండా చేశాం’’ అని చంద్రబాబు గుర్తు చేశారు.

ఘర్షణలపై ఉక్కుపాదం

‘‘అదే విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న సమయంలో హైదరాబాద్‌లో జరుగుతున్న ఘర్షణలు, అల్లర్లపై ఉక్కుపాదం మోపాలని చర్యలు చేపట్టాం. అనుకున్న విధంగానే వాటిని అణచివేశాం. ఘర్షణలు, అల్లర్లను అణచివేయడంతో మత సామరస్యానికి వేదికగా హైదరాబాద్‌‌ను నిలిపాం. దాంతో పాటుగా వామపక్ష తీవ్రవాదాన్ని సైతం గ్రేహౌండ్స్ ద్వారా అదుపులోకి తీసుకు వచ్చే ప్రయత్నం చేశాం’’ అని వివరించారు. వీటితో పాటుగా రౌడీయిజంపై కూడా కఠిన చర్యలు తీసుకున్నామని చెప్పారాయన. తమ ప్రభుత్వ తీసుకున్న చర్యల వల్ల ప్రజల్లో భద్రత పెరిగి ప్రతి ఒక్కరిలో ప్రభుత్వం, పోలీసులపై నమ్మకం వచ్చిందన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటానికి సాంకేతికతను కూడా ఉపయోగిస్తున్నామని చెప్పారు.

అంతా క్షీణించినవే

‘‘2024లో లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు కూడా ఎన్నికలు జరిగాయి. అందులో రాష్ట్ర ప్రజలు అద్భుతమైన తీర్పునిచ్చారు. కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు. భారీ మెజార్టీతో కూటమిని అదికారంలో కూర్చోబెట్టారు. అసెంబ్లీ స్థానాల్లోనే కాకుండా, లోక్‌సభ స్థానాల్లో కూడా కూటమి నేతలకే పట్టం కట్టారు ప్రజలు. అప్పటి నుంచి రాష్ట్రంలోని అన్ని శాఖలను తిరిగి గాడిలో పెట్టడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ.. గత ప్రభుత్వ హయాంలో అన్ని శాఖలు నిర్వీర్యమయ్యాయి. ఆర్థికాభివృద్ధితో పాటు రాష్ట్రంలో శాంతి భద్రతలు సైతం తీవ్రంగా క్షీణించాయి. గత ప్రభుత్వం ఏకాడికీ తమ స్వార్థాన్నే చూసుకుంది తప్ప.. రాష్ట్ర అభివృద్ధి, శాంతి భద్రతలను గాలికి వదిలేసింది’’ అంటూ మండిపడ్డారు చంద్రబాబు.

‘‘ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై ఇష్టారాజ్యంగా తప్పుడు కేసులు పెట్టించారు. వారి అరాచకం ఎంత దూరమెళ్లిందంటే.. నాపై 17, పవన్ కల్యాణ్‌పై 7 కేసులు పెట్టారు. స్టీల్ ప్లాంట్ కోసం నిరాహార దీక్ష చేస్తుంటే అరెస్ట్‌లు చేశారు. ధూలిపాళ నరేంద్ర, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టారు. ఆదిరెడ్డి అప్పారావు, పత్తిపాటి పుల్లారావు వంటి నేతల కుటుంబాలను ఇబ్బందులకు గురిచేశారు. వారి వేధింపులు తట్టుకోలేక, వీరు చేసిన అవమాన భారంతోనే కోడెల ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ప్రస్తుత హోం మంత్రి అనిత సహా కొందరు ఎస్సీలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు బనాయించారు. ఆపరేషన్ చేయించుకుని రెస్ట్ తీసుకుంటున్న అచ్చెన్ననను 600 కిలోమీటర్లు తిప్పారు. రఘురామను జైల్లో హింసించారు’’ అని గతంలో జరిగిన అంశాలను గుర్తు చేశారు చంద్రబాబు.

మెజార్టీ కేసులు ఉన్నవారే: చంద్రబాబు

ఈ సందర్భంగానే అసెంబ్లీలో కేసులు లేని వారి చాలా తక్కువ మంది ఉన్నారని చెప్పారు చంద్రబాబు. ఈ విషయాన్ని తాను నిరూపిస్తానంటూ.. అసెంబ్లీలో ఒక్క కేసు కూడా లేని నేత దయచేసి నిలబడాలని కోరారు. దీంతో కేసులు లేని వారు లేచి నిలబడ్డారు. దానిని చూపిస్తూ.. ‘‘చూస్తున్నారా అధ్యక్షా.. శాసనసభలో మెజార్టీ మంది సభ్యులు తమపై కేసులు ఉన్నవారే. వైసీపీ హయాంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉందో అని చెప్పడానికి ఇదే నిదర్శనమని’’ అని వ్యాఖ్యానించారు. కాగా చంద్రబాబు చూపిన ఉదాహరణకు నేతలంతా ఒక్కసారి నవ్వేశారు. దీంతో అసెంబ్లీ అంతా కాసేపు నవ్వులతో నిండిపోయింది.

Read More
Next Story