జగన్ క్షమించరాని తప్పులు చేశారు.. మండిపడ్డ చంద్రబాబు
x

జగన్ క్షమించరాని తప్పులు చేశారు.. మండిపడ్డ చంద్రబాబు

పోలవరం ప్రాజెక్ట్ ఆలస్యానికి వైసీపీనే కారణం.. రాష్ట్రానికి జగన్ ఒక శాపం.. వైసీపీ ఒక్క పని కూడా సవ్యంగా చేయలేదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు.


ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పోలవరం ప్రాజెక్ట్‌ను సందర్శించారు. హెలికాప్టర్ నుంచే ఆయన స్పిల్‌వే సహా పలు ప్రాంతాలను పరిశీలించారు. ప్రాజెక్ట్ దగ్గరకు చేరుకున్న వెంటనే పనుల పురోగతి గురించి చంద్రబాబు.. అధికారులతో సమీక్షించారు. పనులు ఎంతవరకు వచ్చాయి. ఎలా సాగుతున్నాయి అని జలవనరుల శాఖ అధికారులను అడగారు. అనంతరం ప్రాజెక్ట్ స్థితి గతులు, జరిగిన పనుల గురించి అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి చర్చించారు. ఈ చర్చలో మంత్రి నిమ్మల రామానాయుడు సహా పలువురు ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు. సమావేశం అనంతరం మాట్లాడిన చంద్రబాబు.. వైఎస్ జగన్, ఆయన ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్రానికి జగన్ ఒక శాపమని, వారి ప్రభుత్వం ఒక పీడ అంటూ ఆగ్రహంతూ ఊగిపోయారు.

జీవనాడి నిండా సంక్షోభాలే

ఆంధ్ర ప్రదేశ్‌కు జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్ట్ ఇప్పుడు సంక్షోభాల ప్రాజెక్ట్‌లా తయారయిందని ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు. పోలవరంను విభజన చట్టంలో జాతీయ ప్రాజెక్ట్ చేర్చడంతో 2014-2019లో అధికారంలో ఉన్న టీడీపీ హయాంలోనే 72 శాతం పనులు పూర్తి చేశామని వెల్లడించారు. ‘‘పోలవరం కోసం నేను పడిన కష్టాన్ని జగన్ బూడిలో పోసిన పన్నీరులా మార్చారు. ఈ ప్రాజెక్ట్‌కు ఆటంకాలు రాకూడదన్న ఉద్దేశంతోనే తెలంగాణలోని ఏడు మండలాలను ఆంధ్రలో విలీనం చేసేలా ఆనాడు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాను. ప్రాజెక్ట్ ప్రారంభం నుంచి ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. కానీ వేటికీ తలొగ్గకుండా ముందుకు సాగాం. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌ దుస్థితిని చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. మా హయాంలోనే 72 శాతం ప్రాజెక్ట్ పూర్తయింది. అప్పుడే స్పిల్ వేపై 15 లక్షల క్యూసెక్కుల నీరు డిశ్చార్జ్ అయ్యాయి’’ అని చెప్పారు.

జగన్.. రాజకీయాల్లో ఉందగరు..

‘‘రాజకీయాల్లో ఉండటానికి ఎటువంటి అర్హత లేని వ్యక్తి అధికారంలోకి వచ్చి రాష్ట్రానికి శాపంలా మారారు. అధికారంలోకి వచ్చీరాగానే రివర్స్ టెండరింగ్ చేపట్టింది వైసీపీ ప్రభుత్వం. ఏజెన్సీలతో పాటు సిబ్బందిని కూడా మార్చారు. డయాఫ్రమ్ వాల్‌ గత ప్రభుత్వం ఏమాత్రం కాపాడుకోలేదు. పూర్తి నిర్లక్ష్యం చేసింది. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో జగన్ చేసిన తప్పులన్నీ క్షమించరానివే. ఈ ప్రాజెక్ట్‌పై వందల సారలు సమీక్ష నిర్వహించా. ఇప్పడు ఈ ప్రాజెక్ట్ దుస్థితి అత్యంత దుర్భరంగా మారింది. రూ.446 కోట్లతో మరమ్మతులు చేయించినా బాగుపడుతుందన్న గ్యారెంటీ లేదు. సమాంతరంగా డయాఫ్రమ్ వాల్ కడితే రూ.990 కోట్లు ఖర్చవుతుంది. గతంలో చేపట్టిన ప్రాజెక్ట్ నిర్మాణం అంతరాయం లేకుండా కొనసాగి ఉంటే 2020 చివరికి పూర్తయి ఉండేది. కానీ ఇప్పుడు అన్నీ సవ్యంగా జరిగితేనే పోలవరం పూర్తికి మరో నాలుగేళ్లు పడుతుందని అధికారులు చెప్తున్నారు’’ అని వివరించారు.

వేల కోట్లు వృథా

‘‘వేల కోట్ల రూపాయలు వృథా అయ్యాయి. ఎలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండకూడదు అనడానికి ఇది ఒక కేస్ స్టడీ. మా ప్రభుత్వం ఆపిన దగ్గర నుంచి అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ప్రాజెక్ట్‌కు కొనసాగించి ఉంటే అతి తక్కువ ఖర్చుతో ప్రాజెక్ట్ పూర్తయి ఉండేది. కానీ అలా చేయకపోవడంతో ఇప్పుడు ప్రాజెక్ట్ వ్యవయం భారీగా పెరిగింది. ప్రాజెక్ట్‌కు నష్టం తీసుకొచ్చిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఏజెన్సీని మార్చొద్దని కేంద్రప్రభుత్వం అప్పుడే చెప్పింది. కానీ కేంద్రం మాటలను రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. అలా ఏజెన్సీని మార్చడం వల్లే ప్రాజెక్ట్ ఆలస్యమైంది. దీనికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? అధికారంలో ఉన్న ఐదేళ్ల పాటు వైసీపీ ఎవరూ ఇక్కడి రాకుండా జాగ్రత్తలు తీసుకుంది. ప్రజలు, మీడియా, ప్రతిపక్ష నేతగా నన్ను ఇక్కడి రాకుండా అధికార బలంతో అడ్డుకుంది’’ అని చెప్పుకొచ్చారు.

చిక్కుముడులు విప్పే ప్రయత్నం

‘‘చాలా సాఫీగా సాగిన ప్రాజెక్ట్ ఇప్పుడు అత్యంత క్లిష్టంగా మారింది. ప్రాజెక్ట్ విషయంలో ఏర్పడిన అన్ని చిక్కుముడులను విప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రాజెక్ట్ ద్వారా నధుల అనుసంధానం చేసి రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు నీళ్లు అందించాలని ఎన్నో కలలు కన్నా. కానీ అవన్నీ ఇప్పుడు చెల్లాచెదులు అయిపోయాయి. మళ్లీ పోలవరం సవ్యంగా మార్చడమే ప్రథమ లక్ష్యంగా పెట్టుకుంటున్నా. ఇది ఒక పార్టీకి, ఒక వర్గానికి సంబంధించిన ప్రాజెక్ట్ కాదు. రాష్ట్రంలోని ప్రతి వ్యక్తికి సంబంధించిన ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ప్రతి ఆంధ్రుడికి లాభం చేకూరుతుంది’’ అని చంద్రబాబు తెలిపారు.

అప్పుడే అవకతవకలు

‘‘రాష్ట్రంలో కరువు ఉండకూడదన్న లక్ష్య సాధన కోసం పోలవరం ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లాం. కానీ 2005లో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి.. ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన సమయంలోనే అనేక అవకతవకలు జరిగాయి. దాంతో కాంట్రాక్టర్లు తమ కాంట్రాక్ట్‌లను రద్దు చేసుకున్నారు. ఆ కారణంగా ఈ ప్రాజెక్ట్ అటకెక్కింది. భూ సేకరణ, కుడి.. ఎడమ కాల్వల నిర్మాణాల విషయాల్లో కోర్టులకు వెల్లడంతో ప్రాజెక్ట్‌ మరింత ఆలస్యం అయింది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రతో పాటు రాయలసీమ రైతులు కూడా గోదావరి నీళ్లు వాడుకోవచ్చు. తద్వారా రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో కూడా కరవు అనే మాట వినిపించకుండా చేయొచ్చు. కానీ ఇప్పుడు అంతా తలకిందులైంది. ప్రాజెక్ట్ అంతా దారుణంగా తయారయింది’’ అని అన్నారు చంద్రబాబు.

Read More
Next Story