అదిరిందయ్యా చంద్రం...  బిజెపిపై చంద్రన్న మార్క్..!
x
Source: Twitter

అదిరిందయ్యా చంద్రం... బిజెపిపై చంద్రన్న మార్క్..!

రాయలసీమలో బిజెపి తన అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో కూడా చంద్రబాబు మార్క్ ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది.


(ఎస్.ఎస్.వి.భాస్కర్ రావ్)

తిరుపతి: అసెంబ్లీ అభ్యర్థుల తుది జాబితాలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడు తన చాతుర్యాన్ని ప్రదర్శించారు. బిజెపిలో కూడా తన మార్క్ కనిపించేలా చేసుకున్నారు. అభ్యర్థుల ఎంపిక తీరు ఆ విషయాన్ని స్పష్టం చేస్తోంది. కడప జిల్లాలో బద్వేలు అసెంబ్లీ స్థానంలో టిడిపి అభ్యర్థికి కాషాయం కండువా వేయించారు. అనంతపురం జిల్లాలో పరిటాల కుటుంబానికి రెండో సీటుకు చుక్కెదురైంది. ఈ వ్యవహారం వెనుక అలా ఇచ్చి ఇలా తీసుకునే పద్ధతిని అవలంబించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

అభ్యర్థుల ఎంపిక వెనక టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు మైండ్ గేమ్ బట్టబయలైంది. కడప జిల్లా రాజంపేట శాసనసభ స్థానం నుంచి ఎవరిని పోటీ చేయించాలనేది టీడీపీ-జనసేన ఇంకా ఒక అవగాహనకు రాని పరిస్థితి ఏర్పడింది. టిడిపి అయితే మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్‌రాయలును, జనసేన అయితే మాజీ ఎంపీ సుగువాసి పాలకొండ రాయుడు కుమారుడు సుగువాసి బాలసుబ్రమణ్యం పోటీ చేయించాలా? అనే విషయంపై ఆ పార్టీలు ఇంతవరకు ఓ నిర్ణయానికి రాలేదు.

తెలుగు తమ్ముడికి కాషాయ కండువా

కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం నుంచి మొదట టిడిపి అభ్యర్థిని పోటీలో ఉంచాలని నిర్ణయించారు. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి డాక్టర్ రాజశేఖర్ స్థానంలో.. ఈసారి ఎన్నికలకు కొత్త వ్యక్తిని తెరమీద తీసుకొచ్చారు. పోరుమామిళ్లలోని గిరి నగర్‌కు చెందిన బొజ్జ రోశన్నను టిడిపి నాయకులు కర్నూలు తెలుగు గంగ డీఈ ఉద్యోగానికి రాజీనామా చేయించి తీసుకువచ్చారు. బద్వేలు నియోజకవర్గంలో తమ పార్టీ అభ్యర్థి పోటీ చేయాలని బిజెపి నాయకులు పట్టుబట్టారు. దీంతో టీడీపీ అభ్యర్థిగా మొదట తెరమీదకు వచ్చిన బొజ్జ రోశన్నను బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని ఆ పార్టీ బుధవారం రాత్రి ప్రకటన విడుదల చేసింది. బొజ్జ రోశన్న.. టిడిపి అభ్యర్థిగా బరిలో దిగి ఉంటే వైఎస్సార్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ గట్టి పోటీ ఇచ్చే వారని భావిస్తున్నారు.

2019 ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే జయరాములు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయనకు ఐదువేల ఓట్లు మాత్రమే వచ్చాయి. వైయస్ఆర్సీపీ అభ్యర్థిగా గుంటూరు సుబ్బరామయ్య గెలుపొందారు. ఆ తర్వాత ఆయన మరణించడంతో జరిగిన ఉప ఎన్నికల్లో సుబ్బరామయ్య భార్య డాక్టర్ సుధ పోటీ చేశారు. మరణించిన ఎమ్మెల్యేను గౌరవిస్తూ ఎన్నికల్లో పోటీకి టీడీపీ దూరంగా ఉంది. ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా తనతల సురేష్ పోటీ చేసి 25 వేల ఓట్ల వరకు సాధించగలిగారు. బీజేపీ నుంచి పోటీ చేసి ఓటమి చెందిన వారిగా మేము సిద్ధంగా ఉంటే మా అభ్యర్థిత్వాన్ని పరిగణనలోకి తీసుకోకపోవడం ఏంటని 2019 ఎన్నికల్లో పోటీచేసి ఓటమి చెందిన జయరాములతోపాటు, ఉప ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన పణతల సురేష్ కూడా ప్రశ్నిస్తున్నారు.

ధర్మవరంలో.. సత్తన్న ఎంట్రీ

అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. అనూహ్యంగా బిజెపి జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ను అభ్యర్థిగా ఆ పార్టీ ప్రకటించింది. దీంతో ఇక్కడి నుంచి పోటీ చేయాలనుకున్న పరిటాల రవి తనయుడు పరిటాల శ్రీరామ్ కు చుక్కెదురైంది. బిజెపిలో ఉన్న వరదాపురం సూరికి కూడా సీటు దక్కకుండా పోయింది. కాస్త వెనక్కి వెళితే.. ధర్మవరం నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి పోటీ చేయడానికి శ్రీరామ్ రెండు నెలలుగా రంగం సిద్ధం చేశారు. టిడిపి రాష్ట్ర నాయకులను కూడా పిలిపించి భారీ సభలతో పెద్ద హంగామా చేశారు. పరిటాల శ్రీరామ్ తల్లి పరిటాల సునీతమ్మ రాప్తాడు నుంచి పోటీ చేస్తున్నారు.


బెడిసిన టిడిపి వ్యూహం

ధర్మవరంలో టిడిపి నాయకుడిగా ఉన్న వరదాపురం సూరి ఆ తర్వాత బిజెపిలోకి వెళ్లారు. ఆయన బిజెపి నుంచి సీటు ఆశించారు. కూటమిలో అభ్యర్థిని నిర్ణయించడంలో కాలయాపన చేశారు. దీంతో వరదాపురం సూరిని టిడిపిలోకి రప్పించి సీటు ఇవ్వాలనే ప్రతిపాదన ఆలోచనలు కూడా జరిగాయి. ఈ విషయాన్ని బీజేపీ నేతలు గ్రహించినట్లు ఉన్నారు. అందువల్ల ధర్మవరం సీటును పట్టు పట్టి సాధించుకున్న బిజెపి ఆ పార్టీ అభ్యర్థిగా జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్‌ను ప్రకటించి చంద్రబాబు ఎత్తుగడకు అడ్డుకట్ట వేశారనే పరిస్థితి కనిపిస్తోంది. ధర్మవరం సీటును ఆశించిన వరదాపురం సూరి, టిడిపి నాయకుడు పరిటాల శ్రీరామ్ కూడా అవకాశం దక్కకుండా పోయింది.

ఆదికే అవకాశం...

టిడిపి కంచుకోటలో అభ్యర్థి కొరత

కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో టిడిపి నుంచి పోటీ చేసే అభ్యర్థి కరువయ్యారు. గత్యంతరం లేని స్థితిలో ఆ స్థానాన్ని బిజెపికి కేటాయించారు. మాజీ మంత్రి సి.. ఆదినారాయణ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఇక్కడ ప్రకటించారు. చదిపిరాళ్ల ఆదినారాయణ రెడ్డి.. జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి 2004, 2009లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఆయన వైస్సార్సీపీలో చేరి 2014లో కూడా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత అప్పటి అధికార టిడిపిలోకి చేరిన ఆదినారాయణ రెడ్డి మంత్రి పదవి కూడా తీసుకున్నారు.

తర్వాత ఆయన బీజేపీలో చేరారు. అంతకుముందే జమ్మలమడుగుకు చెందిన మాజీ మంత్రి పి రామసుబ్బారెడ్డి వైఎస్ఆర్సిపిలో చేరిపోయారు. దీంతో జమ్మలమడుగు నియోజకవర్గంలో టిడిపికి అభ్యర్థి లేకుండా పోయిన పరిస్థితి ఏర్పడింది. బిజెపిలో కొనసాగుతున్న చదిపిరాళ్ల ఆదినారాయణ రెడ్డి అనివార్యంగా అక్కడ అభ్యర్థి అయ్యారు. ప్రస్తుతం జమ్మలమడుగు నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మూలే సుధీర్ రెడ్డిపై రెండోసారి పోటీ చేయనున్న చదిపిరాళ్ళ ఆదినారాయణ రెడ్డి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

పార్థ... ఎంతవరకు నీ ప్రస్థానం..

కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం నుంచి బీజేపీ నాయకులు పట్టు పట్టి ఆ స్థానాన్ని దక్కించుకున్నారు. తనకు గట్టి పట్టు ఉన్న ఆదోని నియోజకవర్గాన్ని టీడీపీ కోల్పోయింది. ఇక్కడి నుంచి టిడిపి అభ్యర్థిగా మీనాక్షి నాయుడు 5 సార్లు పోటీ చేసి మూడు ఎన్నికల్లో విజయం సాధించారు. ఈ దఫా తనకే టికెట్ దక్కుతుందని ఆయన చివరి క్షణం వరకు ఆశగా ఉన్నారు. పట్టు పట్టి సాధించుకున్న ఆదోని అసెంబ్లీ స్థానంలో పార్థ డెంటల్ క్లినిక్ యజమాని పీవై పార్థసారథిని అభ్యర్థిగా బిజెపి ప్రకటించింది. గత ఎన్నికల్లో కూడా ఆయన కర్నూలు పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేశారు. చిత్తూరు జిల్లా మదనపల్లికు చెందిన పీవై పార్థసారథి రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో పార్థ డెంటల్ ఆస్పత్రుల ద్వారా సేవలందిస్తున్నారు. నాన్ లోకల్ అనే సమస్య వెంటాడుతుండడంతోపాటు, టికెట్ దక్కని సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఆయన వర్గం ఎంతవరకు సహకారం అందిస్తుంది అనేది ప్రశ్నార్ధకమేని ఆ ప్రాంత నాయకులు అంటున్నారు.

Read More
Next Story