సీఎం చంద్రబాబు రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారు. టీటీడీ లడ్డూ వివాదంపై సుప్రీం కోర్టు తీర్పు తరువాత మొదటిసారి వెళుతున్నారు.


ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. సోమవారంతో పాటు మంగళవారం కూడా ఆయన ఢిల్లీలోనే టూర్‌ చేస్తారు. ప్రధాని మోదీతో పాటు ఇతర ఢిల్లీ పెద్దల అప్పాయింట్‌మెంట్స్‌ ఇప్పటికే ఖరారయ్యాయి. సోమవారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకుంటారు. సాయంత్రం 4:30 గంటలకు ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. తర్వాత రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్‌తో భేటీ అవుతారు. మంగళవారం హోమ్‌ మంత్రి అమిత్‌ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రహదారుల శాఖ మంతి నితిన్‌ గడ్కరీతో భేటీ కానున్నారు.

లడ్డూ వివాదంపై సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు చేస్తున్న తొలి ఢిల్లీ పర్యటన ఇది. తిరుమల తిరుపతి లడ్డూ వివాదంతో గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్‌ అట్టుడికి పోయింది. ఇది దేశ వ్యాప్తంగా పాకింది. కోట్లాది మంది వెంకటేశ్వరుని భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కావడంతో దేశ వ్యాపిత చర్చకు దారి తీసింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌లే స్వయంగా దీనిపై వ్యాఖ్యలు చేయడంతో ఈ వివాదంపై పెద్ద ఎత్తున దుమారం రేగింది. అయితే దీనిపై స్పందించిన సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
తొలిసారి చేపట్టిన విచారణలో సీఎం చంద్రబాబు వ్యవహరించిన తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దంటూ గడ్డి పెటింది. రెండో సారి విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు సీఎం చంద్రబాబు నియమించిన సిట్‌ను రద్దు చేసింది. స్వతంత్ర సంస్థ ద్వారా విచారణకు ఆదేశిస్తూ తీర్పును వెలువరించింది. సుప్రీం కోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌లు ఉవ్వెత్తున లేపిన దుమారం ఒట్టిదే అని తేలిపోయింది. అయితే ఈ వ్యవహారంలో పీఎం మోదీ, అమిషా వంటి ఢిల్లీ ప్రభుత్వ పెద్దలు ఎక్కడా కూడా జోక్యం చేసుకోలేదు. ఒకరిద్దరు కేంద్ర మంత్రులు మాట్లాడినా పెద్ద నాయకులు మాత్రం కాస్త దూరంగానే ఉన్నారు. దీంతో కేంద్రంలోని బీజేపీ పెద్దల నుంచి ఎలాంటి సపోర్టు సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌కు లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో సోమవారం సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన చేయనుండటంతో ఆసక్తి నెలకొంది.
మరో వైపు విజయవాడ వరదల విపత్తు తర్వాత సీఎం ఢిల్లీ వెళ్లి పీఎం మోదీని కలుస్తుండటం హాట్‌ టాపిక్‌గా మారింది. వరదల సాయంపైన, విశాఖ రైల్వే జోన్‌ ఏర్పాటు పైన, విశాఖ ఉక్కు పరిశ్రమ సెయిల్‌లో విలీనం చేయడంపైన, పోలవరం ప్రాజెక్టు నిధులు, అమరావతి నిర్మాణానికి వరల్ట్‌ బ్యాంకు నిధుల విడుదల వంటి అనేక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. మరో వైపు విజయవాడ వరదల విపత్తుకు కేంద్రం నుంచి పెద్ద సాయం ఏమీ అందలేదు. తూతూ మంత్రంగా నిధులిచ్చి చేతులు దులుపుకుంది. రూ. 7,600 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని కేంద్ర ప్రభుత్వానికి నివేదించారు. కానీ కేవలం రూ. వెయ్యి కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. విశాఖ రైల్వే జోన్‌ విషయంలో కూడా ఇంత వరకు మోదీ ప్రభుత్వం స్పష్టత ఇవ్వ లేదు. ఆంధ్రుల హక్కుగా భావించే విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను కూడా కాపాడుకునేందుకు సీఎం చంద్రబాబు కానీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ కానీ ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం వ్యవహార శైలిపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఏమని చర్చిస్తారు, ఎలాంటి ప్రకటన చేస్తారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Next Story