ఎన్టీఆర్ ఓ సైన్యం.. వారసులది.. సకుటుంబ ప్రచారం..
x

ఎన్టీఆర్ ఓ సైన్యం.. వారసులది.. సకుటుంబ ప్రచారం..

రాజకీయ చైతన్యానికి పునాది వేసిన టీడీపీ.. సంక్షోభాలను కూడా రుచి చూసింది. ఇప్పుడు సకుటుంబ సమేతంగా ప్రచారానికి దిగారు. దశాబ్దాల తరువాత అధికారం కోసం పాట్లుపడుతోంది.


(ఎస్.ఎస్.వి. భాస్కర్ రావ్)

తిరుపతి: ఒంటి చేత్తో పార్టీని నడిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత ఎన్టీఆర్‌కు దక్కిన ఖ్యాతి. కుటుంబ సభ్యులను బయటకు రానివ్వని ఘనత కూడా ఆయనదే. నాలుగు దశాబ్దాల కాల గమనంలో టిడిపి అనేక సంక్షోభాలను రుచి చూసింది. 2024 ఎన్నికలు టిడిపికి సవాల్‌గా మారాయి. అధికార వైయస్ఆర్సీపీని ఎదురుకోవడానికి మూడు పార్టీల కూటమి హోరా హోరీగా శ్రమిస్తోంది. ఎన్టీ రామారావు అనుసరించిన విధానాలకు పూర్తి భిన్నంగా టిడిపి అధ్యక్షుడు ఎన్ చంద్రబాబునాయుడు కుటుంబీకులంతా ఎన్నికల రణరంగంలోకి దిగారు.

"సమాజమే దేవాలయం. ప్రజలే నా దేవుళ్ళు" ఈ మాట ఆంధ్ర నాట ఉర్రూతలూగించింది. రాష్ట్రంలో రాజకీయ విప్లవానికి నాంది పలికిన టిడిపి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు నెలల వ్యవధిలోనే ఒంటి చేత్తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. "తెలుగువారి ఆత్మగౌరవ పోరాటం" అనే నినాదంతో ఆంధ్ర ఘన కీర్తిని చాటి చెప్పిన ఘనత కూడా ఎన్టీఆర్‌కే దక్కుతుంది. సమాజంలో పేదలు, బలహీన వర్గాల సంక్షేమం కోసం తపించిన స్వాప్నికుడు అనడంలో కూడా అతిశయోక్తి కాదు. బీసీలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తిగా కూడా ఆయన కీర్తి పతాక అందుకున్నారు. ఇది ఆనాటి పరిస్థితి.

రాజకీయ విప్లవ సారథి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ చైతన్యానికి పురుడు పోసిన వ్యక్తి టిడిపి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు. రాష్ట్రంలో కాంగ్రెస్‌యేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మొదటి వ్యక్తిగా కూడా రాజకీయ యవనికపై ఆయన చెరగని సంతకం చేశారు. 1982లో టిడిపికి ఊపిరి పోసిన ఎన్టీ రామారావు ప్రచారం కోసం మూడు నెలల కాలంలో నే 32 వేల కిలోమీటర్లు చైతన్య రథం పై తిరగడం కూడా ఆయన ప్రపంచ రికార్డుగా అప్పట్లో అభివర్ణించారు. అది కూడా పెద్ద కుమారుడు నందమూరి హరికృష్ణ రథసారథిగా ఆయన రాష్ట్రమంతా పర్యటించారు. ఆయన కుటుంబీకుల్లో మొదట చిన్న అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు జత కలిస్తే.. అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దలు ఎన్ చంద్రబాబు నాయుడు తోడయ్యారు. ఎన్టీఆర్ కుటుంబం నుంచి రాజకీయంగా ప్రజాక్షేత్రంలోకి వచ్చిన వారు లేరనే చెప్పాలి. ఎన్టీ రామారావు ఒక వ్యక్తిగా కాదు ఒక శక్తిగా ఒంటి చేత్తో తాను స్థాపించిన టిడిపిని నడిపించడమే కాకుండా ప్రభుత్వాలను కూడా అలాగే నిర్వహించారు.

ఆగస్టు సంక్షోభం..

ఇంతటి ఘన కీర్తిని సాధించుకున్న ఎన్టీ రామారావు రాజకీయ వారసత్వాన్ని అందుకోవడంలో కుటుంబీకులు తడబడ్డారు. జీవిత కథ రాయాలని వచ్చిన వీరగంధం లక్ష్మీపార్వతి కొద్ది రోజులకే ఎన్టీఆర్ భాగస్వామి అయ్యారు. ఈ వ్యవహారం ఎన్టీఆర్ కుటుంబంలోనే కాకుండా, టిడిపిలో కూడా సంక్షోభానికి బీటలు పడటానికి కారణమైంది. టిడిపిలో, ప్రభుత్వ వ్యవహారాల్లో లక్ష్మీపార్వతి ప్రమేయాన్ని జీర్ణించుకోలేని స్థితిలో పార్టీ వర్గాలు సతమతమయ్యాయి. ఇదే అదునుగా 1995 ఆగస్టులో ఏర్పడిన సంక్షోభం టిడిపిని కుదిపేసింది. ఈ అవకాశాన్ని నారా చంద్రబాబు నాయుడు అందిపుచ్చుకున్నారు. తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు సహకారం అందించారు. పార్టీ సీనియర్ నేతలు వెన్నంటి వచ్చారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల సహకారంతో ఎట్టకేలకు టిడిపినే కాకుండా, ప్రభుత్వ పగ్గాలను కూడా ఎన్ చంద్రబాబు నాయుడు చేపట్టి సీఎం అయ్యారు. ఇదంతా తెలుగు రాష్ట్రాల ప్రజలు మరిచిపోలేని గత చరిత్ర.

తిరగబడి మళ్లీ దరిచేరి...

సీఎంగా బాధ్యతలు చేపట్టడానికి ముందే ఎన్ చంద్రబాబు నాయుడుకు ఎన్టీఆర్ తనయుడు నందమూరి హరికృష్ణ వెంట నిలిచారు. 1999 జనవరిలో ఆయన తిరుగుబాటు చేసి అన్న టిడిపిని స్థాపించి, కమ్యూనిస్టులతో కలిసి ఎన్నికలకు వెళ్లారు. ఎక్కడ ఆ పార్టీ ప్రభావం చూపించలేకపోవడం పరిశీలకుల అంచనాలను తలకిందులు చేసింది. సుదీర్ఘ విరామం తర్వాత 2008లో ఎన్ చంద్రబాబు నాయుడు దరికి చేరిన హరికృష్ణ రాజ్యసభ సభ్యత్వం కూడా అందుకోగలిగారు. టిడిపి రాష్ట్ర విభజనకు లేక ఇవ్వడాన్ని నిరసిస్తూ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

కుటుంబీకుల తడబాటు..

రాష్ట్రంలో టిడిపి నేతలు ఎన్టీఆర్ కుటుంబీకులు అంటే గౌరప్రదంగా మెలుగుతున్నారు. పార్టీలో కీలక పాత్ర పోషించే స్థాయికి మాత్రం ఎన్టీఆర్ కుమారులు, కుమార్తెలు ఎదగలేకపోయారు. తండ్రి చాటు బిడ్డలు, బావ ఎన్ చంద్రబాబు నాయుడు విధేయులుగా నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యే పదవికి పరిమితమయ్యారు. ఎన్టీఆర్ కుటుంబం నుంచి దగ్గుబాటి పురందేశ్వరి మొదట కాంగ్రెస్‌లోకి వెళ్లి కేంద్ర మంత్రి అయ్యారు. ప్రస్తుతం బిజెపి రాష్ట్ర శాఖకు అధ్యక్షురాలుగా ఆమె ఎదగడం మినహా, మిగతా కుటుంబ సభ్యులు ఎవరు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకున్న సాహసం చేయలేకపోయారు. తాజా పరిస్థితిని పరిశీలిస్తే...

సకుటుంబ సమేత ప్రచారం..

2024 ఎన్నికలు కూటమికి భాగస్వామిగా ఉన్న టిడిపికి జీవన్మరణ సమస్యగా మారాయి. వైయస్సార్సీపిని నిలువరించడానికి కూటమిలోని టిడిపి, జనసేన, బిజెపి పార్టీల శ్రేణులు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. గత చరిత్రను పరిశీలిస్తే ఎక్కడా కనిపించని విధంగా ఈ ఎన్నికల్లో టిడిపి అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడు కుటుంబం మొత్తం ప్రచారంలోకి దిగింది. యువగళం పేరిట మొదట నారా లోకేష్ కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు పాదయాత్ర చేశారు. ఆ సమయంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎన్ చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేశారు. ఆయన బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత నిజం గెలవాలి పేరిట చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఒక రౌండ్ పూర్తి చేశారు.

తన భర్త ఎన్ చంద్రబాబు నాయుడును ఆదరిస్తున్న కుప్పం నియోజకవర్గంలో నారా భువనేశ్వరి నామినేషన్ దాఖలు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పటికే అనేక దఫాలుగా కుప్పంలో ఆమె పర్యటించారు. అదే క్రమంలో ఎన్ చంద్రబాబు నాయుడు కూడా తన సొంత నియోజకవర్గం పర్యటనకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి పోటీ చేస్తున్న నారా లోకేష్ కోసం ఆయన భార్య నారా బ్రాహ్మణి విస్తృతంగా పర్యటన చేస్తూ ప్రచారం చేస్తున్నారు. టిడిపి రాష్ట్ర అధ్యక్షుడుగా తన వంతు కర్తవ్యం కోసం ఎన్ చంద్రబాబు నాయుడు బస్సు యాత్ర, నియోజకవర్గాలకు ఆకాశమార్గాన క్షణం విశ్రాంతి లేని విధంగా పర్యటనలు సాగిస్తున్నారు.

హిందూపురంలో హ్యాట్రిక్ కొనడానికి మళ్లీ పోటీ చేస్తున్న నందమూరి బాలకృష్ణ తీవ్రంగా శ్రమిస్తున్నారు. స్టార్ క్యాంపైనర్‌గా ఆయన అనంతపురం జిల్లాలోని అనేక నియోజకవర్గాల్లో కూడా ప్రజానానికి దిగారు. ఈయన అల్లుడు, ఎన్ చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ కూడా స్టార్ క్యాంపైనర్ గాని మిగతా జిల్లాల పైన కూడా దృష్టి సారించారు. టిడిపి ఆవిర్భవించిన తర్వాత ఈ స్థాయిలో ప్రసార ఆరాటం ఎన్నికల్లో మాత్రమే కనిపిస్తోంది. నాయకులు, వారి కుటుంబ సభ్యుల ఆరాటం ఏ మేరకు ప్రతిఫలిస్తుంది అనేది వేచి చూడాలి.

Read More
Next Story