పవన్‌ కల్యాణ్‌ కార్పొరేటర్‌కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ అని జగన్‌ అన్నారు.


ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇంకెవరికి ఇస్తారని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్న వారిని అధికారంలో ఉన్న వారు గుర్తించకపోతే.. ఏమి సాధించడం కోసం అసెంబ్లీ నడపడం, ప్రధాన ప్రతిపక్షం తమకు కాకుండా ఎవరికి ఇస్తారని ప్రశ్నించారు. ఈ రోజు అంసెబ్లీలో కూటమి పార్టీలు, వైఎస్‌ఆర్‌సీపీనే ఉన్నాయి. కూటమి పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీలో అధికార పక్షంలో ఉన్నాయి. ఇక మిగిలింది వైఎస్‌ఆర్‌సీపీ. ఇక తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ఎవరికి ఇస్తారని జగన్‌ ప్రశ్నించారు.

అధికారంలో ఉన్న కూటమి పార్టీలే ప్రతి పక్ష పాత్ర ఎలా పోషిస్తారని నిలదీశారు. తాడేపల్లి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్‌ బుధవారం మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష హోదా మీద అసెంబ్లీ స్పీకర్‌ ఇచ్చిన రూలింగ్‌పైన కీలక వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీ మీదే.. ప్రతిపక్ష పార్టీ మీదే.. ఇదేమన్నా సినిమాల్లో మాదిరిగా డబుల్‌ యాక్షనా అని ప్రశ్నించారు. అసెంబ్లీలో రెండే పక్షాలు ఉన్నాయని, ఒకటి కూటమి అధికార పక్షమని, ప్రతిపక్షంలో వైఎస్‌ఆర్‌సీపీనే అని అన్నారు. అధికారంలో లేని పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని, ఆ పార్టీ నాయకుడుకి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని జగన్‌ డిమాండ్‌ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో లీడర్‌ ఆఫ్‌ద హౌస్‌కు ఎంత సమయం ఇస్తారో అంతే సమయం ప్రతిపక్ష నేతకు ఇవ్వాల్స ఉంటుందన్నారు. ప్రజా సమస్యలు అసెంబ్లీలో వినిపించాలంటే ప్రతిపక్ష నేతకు అంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.

ఇవేమీ లేకుండా, ప్రతిపక్షం లేకుండా ప్రజల సమస్యల గొంతు అసెంబ్లీలో ఎలా వినిపిస్తుందని ప్రశ్నించారు. ఎన్నికల్లో వచ్చిన సీట్ల ఆధారంగా హోదా ఏది అనేది నిర్ణయం జరుగుతుందని, ఓట్ల శాతం ఆధారంగా ఉండదని, ఒక వేళ ఓట్ల శాతం ఆధారంగా ప్రతిపక్ష హోదా కావాలంటే జర్మనీకి వెళ్లాలని ఇది వరకు జగన్‌ను ఉద్దేశించి పవన్‌ కల్యాణ్‌ మాట్లాడిన మాటలపై జగన్‌ స్పందిస్తూ.. పవన్‌ కల్యాణ్‌ అనే వ్యక్తి కార్పొరేటర్‌కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కవని, పవన్‌ కల్యాణ్‌ తన జీవిత కాలంలో ఒక్క సారి ఎమ్మెల్యే అయ్యారని వ్యాఖ్యానించారు.

బడ్జెట్‌ మీద, కేటాయింపుల మీద, సంక్షేమ పథకాల మీద, సూపర్‌ సిక్స్‌ పథకాల మీద జగన్‌ మాట్లాడారు. లెఫ్ట్‌ అండ్‌ రైట్‌ అప్పులు చేసే చంద్రబాబు ఏపీ అప్పులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, గత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. 2014–19 నాటికి రూ. 4లక్షల కోట్ల అప్పులు ఉంటే 2024 నాటికి రూ. 6లక్షల కోట్ల అప్పు ఉందన్నారు. కాగ్‌ లెక్కల ప్రకారం కూడా ఇదే లెక్కలను స్పష్టం చేసిందన్నారు. రూ. 10లక్షల కోట్లు అప్పులు ఉన్నాయని తప్పుడు ప్రచారం చేశారని సీఎం చంద్రబాబు మీద ధ్వజమెత్తారు. గవర్నర్‌ ప్రసంగంలో కూడా ఇదే రకమైన అబద్దాలు చెప్పించారని మండిపడ్డారు. చంద్రబాబు విచ్చల విడిగా అప్పులు చేస్తున్నారని, అలా అప్పులు చేస్తూనే ఎందుకింత అబద్దాలు, మోసాలు చేస్తారని నిలదీశారు. రాష్ట్రానికి ఆదాయం రావడం లేదు. అమరావతి పేరు మీద అప్పులు చేస్తున్నారు. ఆ అప్పులు చేసినవన్నీ చంద్రబాబు మనుషుల జోబుల్లోకి వెళ్తున్నాయని ఆరోపించారు.
Next Story