అసెంబ్లీ సమావేశాలు జరుగుతన్న సమయంలోనే జగన్‌ మోహన్‌రెడ్డి స్పందించారు. చంద్రబాబు ప్రభుత్వానికి తనదైన శైలిలో కౌంటర్‌ ఇచ్చారు. వాస్తవాలివే అని సుదీర్ఘ వివరణ ఇచ్చారు.


మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన కౌంటర్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇరుకున పడిందని సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. 2024 ఎన్నికల్లో అధికారంలో వచ్చిన నాటి నుంచి జగన్‌మోహన్‌రెడ్డిని, ఆయన ప్రభుత్వ పాలనను టార్గెట్‌ చేసుకొని విమర్శలు గుప్పిస్తూ వస్తోంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైన జనసేన, బీజేపీ పక్షాలు కూడా గత జగన్‌ ప్రభుత్వంపైన విమర్శలు ఎక్కుపెట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు ఇలా అందరూ అదే పనిలో ముందుకు వెళ్తున్నారు. ఎన్నికల ముందు నుంచే ఈ రకమైన విమర్శలు ఎక్కువపెట్టినా ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉదృతిని పెంచారు.

అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వమై తాను అమలు చేయదలుచుకున్న కార్యక్రమాలపైన దృష్టి సారిస్తుంది. వాటిని ఎలా అమలు చేయాలి, కావలసిన నిధులు ఉన్నాయా, లేక పోతే వాటిని ఎలా సమీకరించుకోవాలి, రూపొందించాల్సిన నిబంధనలు తదితర అంశాలపైన దృష్టి సారిస్తుంది. ఎన్నికల్లో ఇష్టానుసారంగా హామీలు ఇచ్చారు. వాటిని అమలు చేయాలంటే ఆశామాషా కాదు. రూ. 1.30లక్షల కోట్లు అవసరమవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముందుగానే ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉంది. ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ, ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చే పనిపై దృష్టి పెట్టాలి. కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దానిని పక్కన పెట్టి యు టర్న్‌ తీసుకుంది. ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలు, వాటి అమలు ఆలోచనల నుంచి ప్రజలను మరల్చేందుకు గత జగన్‌ ప్రభుత్వాన్ని విమర్శించడం మొదలు పెట్టిందనే టాక్‌ రాజకీయ వర్గాల్లో ఉంది.
అందులో భాగంగా శ్వేత పత్రాలకు తెర తీసింది. పోలవరం, అమరావతి, మైన్స్, విద్యుత్‌ రంగాలకు సంబంధించి నాలుగు శ్వేత పత్రాలను బయట విడుదల చేయగా, మూడు శ్వేత పత్రాల విడుదలకు అసెంబ్లీ సమావేశాలను వేదికగా చేసుకున్నారు. ఎక్సైజ్, శాంతి భద్రతలు, ఆర్థిక రంగాల శ్వేత పత్రాలను సీఎం చంద్రబాబు నాయుడు విడుదల చేసి, దానిపైన చర్చ పెట్టించి, అందరి చేత విమర్శలు గుప్పించారు.
వీటిపైన వైఎస్‌ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగానే స్పందించారు. శుక్రవారం తాడేపల్లి తన నివాసంలో మీడియా సమావేవం ఏర్పాటు చేసి, సీఎం చంద్రబాబు మాదిరిగా పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా బదులిచ్చారు. ప్రభుత్వం విడుదల చేసిన ఏడు శ్వేత పత్రాలకు ఆయన వివరణ ఇచ్చారు. పెద్ద స్క్రీన్‌పైన పీపీటీల ద్వారా సుదీర్ఘమైన వివరణ ఇచ్చారు. ప్రభుత్వం అబద్దాలు చెబుతోందని, వాస్తవాలు ఇవే అని వెల్లడించారు. పోలవరం, అమరావతి, విద్యుత్, మైన్స్, ఎక్సైజ్‌ ఇలా అన్ని రంగాలకు సంబంధించిన శ్వేత పత్రాలపై ప్రజలకు వివరించారు. చంద్రబాబు నాయుడు వంచనకు మారు పేరని, గోబెల్‌ ప్రచారంలో సిద్దహస్తుడని విమర్శలు గుప్పించారు. అలివిగాని హామీలను ఎన్నికల్లో ఇచ్చారని, వాటిని అమలు చేయడానికి నానా తంటాలు పడుతున్నారని, ఈ అంశాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు శ్వేత పత్రాల నాటకాలాడుతున్నారని ధ్వజమెత్తారు. సాధారణ బడ్జెట్‌ను కూడా ప్రవేశపెట్టలేని పరిస్థితుల్లో చంద్రబాబు ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. ఇప్పుడు ప్రజల్లో జగన్‌ చేసిన విమర్శలు తాజాగా హాట్‌ టాపిక్‌గా మారాయి. దీంతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం డిఫెన్స్‌లో పడింది. దీనిపై ఎలా స్పందిస్తుందో అనేది వేచి చూడాలి.
Next Story