త్రిభాషా విధానం మీద సీఎం చంద్రబాబు మాట్లాడుతున్న సయమంలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ నవ్వుతూ కనిపించారు.


తమిళనాడు వంటి దక్షిణాది రాష్ట్రాలు త్రిభాషా విధానాన్ని వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ వేదికగా త్రిభాషా విధానంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చెబుతున్న త్రి భాషా విధానం మంచిదే అన్నట్లుగా సపోర్టు చేస్తూ మాట్లాడారు. త్రి భాషా విధానంపై తమిళనాడు అనవసర రాజకీయాలు చేస్తోందనే అర్థం వచ్చే విధంగా.. భాషల మీద అనవసర రాజకీయాలు వద్దంటూ పరోక్షంగా తమిళనాడు ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ సీఎం చంద్రబాబు మాట్లాడారు.

హిందీ నేర్చుకుంటే తప్పేముందని, ఢిల్లీ వంటి ఇతర రాష్ట్రాలకు వెళ్లినప్పుడు అక్కడ మాట్లాడేందుకు హిందీ దోహదపడుతుందని మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో హిందీ గురించి మాట్లాడుతున్న సమయంలో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ నవ్వుతూ కనిపించారు. ఇదే సందర్భంలో ఇంగ్లీషు గురించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. గత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఇంగ్లీషు నేర్చుకుంటేనే నాలెడ్జి వస్తుంది అన్నట్లుగా మాట్లాడారని, అది మంచిది కాదన్నట్లుగా వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు ఏమని మాట్లాడారంటే..
ఇంగ్లీషు మాట్లాడితేనే, ఇంగ్లీషు నేర్చుకుంటేనే నాలెడ్జి వస్తుందని ఇదే అసెంబ్లీలో గత ప్రభుత్వ హయాంలో మాట్లాడారు. భాష అనేది కమ్యూనికేషన్‌ మాత్రమే. భాషలతో నాలెడ్జి రాదు. లాంగ్వేజీలు నేర్చుకున్నంత మాత్రానా, మాట్లాడినంత మాత్రానా నాలెడ్జి రాదు. మాతృ భాషలో చదువుకుంటేనే నాలెడ్జి వస్తుంది. అలా మాతృ భాషలో చదువుకున్న వాళ్లే ప్రపంచంలో గొప్ప గొప్ప స్థాయిలో ఉన్నారు. మాతృ భాషలో చదువుకున్న వాళ్లే ప్రపంచలో రాణిస్తున్నారు. లాంగ్వేజీ అనేది ద్వేషించడానికి కాదు. ఆంధ్రప్రదేశ్‌లో మాతృ భాష తెలుగు. హిందీ జాతీయ భాష. అంతర్జాతీయ భాష ఇంగ్లీషు. మన వాళ్లు ఇప్పుడు జపాన్, జర్మనీలకు వెళ్తున్నారు. ఆ భాషలు కూడా ఇక్కడే నేర్చుకుంటే అక్కడకు పోయినప్పుడు చాలా సులువు అవుతుంది. లైవ్లీహుడ్‌కు ఎన్ని భాషలు నేర్చుకుంటే అంత మంచిది. అయినంత మాత్రానా మాతృ భాషను మరిపోకూడదు. జాతీయ భాష హిందీ నేర్చుకుంటే ఇతర రాష్ట్రాలకు వెళ్లినప్పుడు అక్కడ మాట్లాడేందుకు ఉపయోగపడుతుంది. భాషల మీద లేని పోని రాజకీయాలు చేయొద్దు. ఎన్ని భాషలు నేర్చుకుంటే అంత మంచిది.. అంటూ సీఎం చంద్రబాబు మాట్లాడారు.
ఈ వ్యాఖ్యల మీద తమిళనాడు ప్రభుత్వం, తమిళనాడు ప్రజలు ఏ విధంగా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇటీవల పిఠాపురం వేదికగా జనసేన ఆవిర్భావ సభలో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ హిందీ మీద, హిందీని వ్యతిరేకిస్తున్న తమిళనాడు ప్రభుత్వం మీద చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. తమిళనాడులో దుమారం రేపాయి. తమిళ నటుడు, వీటీకే పార్టీ అధ్యక్షుడు విజయ్‌ సైతం పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తాజాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భాషల మీద లేని పోని రాజకీయాలు చేయొద్దు అంటూ పరోక్షంగా తమిళనాడు ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యల మీద ఆ ప్రభుత్వం, అక్కడి నేతలు ఏ విధంగా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
Next Story