చంద్రబాబుది కిచిడీ మ్యానిఫెస్టో. కొద్దిగ కర్నాటక నుంచి, మరికొద్దిగ తెలంగాణ నుంచి కలుపుకుని తెచ్చుకున్నారు. బీజేపీని కూడా జేబులో పెట్టుకున్నారని ఏపీ సీఎం సిద్దం సభలో విమర్శలు చేశారు.


ప్రకాశం జిల్లా మేదరమెట్ల వద్ద జరిగిన సిద్ధం సభకు జనాన్ని భారీగా తరలించారు. ఆదివారం సాయంత్రం జరిగిన సభలో ముఖ్యమంత్రి జగన్‌ ప్రసంగం ప్రత్యేకంగా అయితే కనిపించలేదు కానీ ప్రతిపక్షాలు ఒక్కటై కూటమి గట్టుకుని తనను ఓడించేందుకు చేతులు కలిపాయని చెప్పడం ఒక ప్రత్యేకత. ఒక జాతీయ పార్టీని చంద్రబాబు జేబులో పెట్టుకుని వచ్చాడని పరోక్షంగా బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు కేంద్రంలోని బీజేపీని పరోక్షంగా బలపరుస్తూ వచ్చిన జగన్‌ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. సభకు వచ్చిన జనాన్ని ఉద్దేశించి మీరే నాసైన్యం, నేను అర్జునుడిని, మీరు వంద మంది శ్రీకృష్ణులతో సమానం అంటూ వ్యాఖ్యానించారు.

చంద్రబాబు మ్యానిఫెస్టో కిచిడీ మ్యానిఫెస్టో. దానికి అంత సీన్‌లేదు. నాకు బలం లేకపోతే అందరూ ఒకటయ్యారెందుకని ప్రశ్నించారు. నిజానికి చంద్రబాబు ఇప్పటికే చాలా సార్లు పొత్తులతో అధికారంలోకి వచ్చారు. అందుకే జగన్‌ పొత్తులను హేళన చేస్తూ మాట్లాడారు.


మీటింగ్‌ ఆద్యంతం వచ్చిన పార్టీ క్యాడర్‌ను ఉత్తేజపరుస్తూ ఎన్నికల్లో ఎలా పనిచేయాలో ఉద్బోధించారు. భారీగా వచ్చిన జనం జగన్‌ ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులు ఖరారు తర్వాత మొదటిసారిగా చిలకలూరిపేటలో భారీ సభ జరపాలని నిర్ణయించారు. ఈ సభకు సుమారు 15 లక్షల మంది జనాన్ని సమీకరించాలని సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ మేదరమెట్ల వద్ద నిర్వహించిన సిద్ధం సభకు ఇంత భారీగా జనాన్ని తరలించి తన బలాన్ని నిరూపించుకోవడంలో సక్సెస్‌ అయ్యారని చెప్పొచ్చు.
మ్యానిఫెస్టో ప్రకటనపై నిరాశ..
మేదరమెట్ల సిద్ధం సభలో మ్యానిఫెస్టో ప్రకటిస్తారని వైఎస్సార్‌సీపీ శ్రేణులు భావించాయి. త్వరలోనే వైఎస్సార్‌సీపీ మ్యానిఫెస్టో ప్రకటిస్తుందని వేదికపై సీఎం జగన్‌ చెప్పారు. వైఎస్సార్‌సీపీ ప్రత్యేకించి మేనిఫెస్టోను ప్రకటించే అవకాశం కనిపించడం లేదు. ఇప్పటికే అమలు చేస్తున్న నవరత్న పథకాలను అలాగే ఉంచుతూ మరో ఒకటీ రెండు హామీలు ఇచ్చే అవకాశం మాత్రమే ఉంటుంది. ఎందుకంటే మేదరమెట్ల సభలో జగన్‌ మాట్లాడుతున్నప్పుడు చెబుతున్న మాటలు ఈ విషయాన్ని స్పష్టం చేశాయి.
సిద్ధం సభల ద్వారా మూడు ప్రాంతాల్లోని ప్రజలను ఎన్నికలకు సిద్ధం చేశారని చెప్పొచ్చు. తెలుగుదేశం పార్టీ పెడుతున్న రా కదిలిరా సభల కంటే భిన్నంగా వేదికను ఏర్పాటు చేసి జనానికి దగ్గరగా కనిపించే ఏర్పాట్లు సిద్ధం సభల్లో జరిగాయి. లక్షల మందిని సిద్ధం సభలకు తరలించి సక్సెస్‌ అయ్యాయని చెప్పుకునే పరిస్థితి వచ్చింది. పార్టీలు పెడుతున్న సభలకు స్వచ్ఛందంగా ఏ ఒక్కరూ రావడం లేదు. ఉచిత రవాణాతో పాటు ఆ రోజు ఖర్చులకు ఓటర్లను తరలించిన వారు డబ్బులు ఇస్తేనే ఇది సాధ్యమవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సభకు వచ్చిన వారిని ఎన్నికలకు సిద్ధం చేయించే కార్యక్రమంలో జగన్‌ సక్సెస్‌ అయ్యారు.
Next Story