అంబేద్కర్ జయంతి సందర్భంగా నేడు రాజధాని అమరావతి ప్రాంతపు అసెంబ్లీ నియోజక వర్గం తాడికొండలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు.
నాలుగో సారి ముఖ్యమంత్రి అయిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు తన శైలిని మార్చారు. అధికారిక కార్యక్రమాలను ఒకే చోట నుంచి కాకుండా ఒక్కో ప్రోగ్రామ్‌ను ఒక్కో ప్రాంతంలో నిర్వహిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలను కవర్ చేసే విధంగా ప్రణాళికలను రూపొందించుకుంటున్నారు. అందులో భాగంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాన్ని మంగళగిరిలోను, దీపం–2 కింద ఉచిత గ్యాస్ సిలీండర్ పథకాన్ని శ్రీకాకుళం జిల్లాలోను, బాబు జగ్జీవన్‌రామ్ జయంతిని ఎన్టీఆర్ జిల్లాలోను, మహాత్మా జ్యోతిరావ ఫూలే జయంతిని ఏలూరు జిల్లాలను ఎంచుకున్న సీఎం చంద్రబాబు తాజాగా అంబేద్కర్ జయంతి కార్యక్రమానికి గుంటూరు జిల్లా తాడికొండ నియోజక వర్గాన్ని ఎంపిక చేసుకున్నారు.
అమరావతి రాజధాని ప్రాంతపు అసెంబ్లీ నియోజక వర్గమైన తాడికొండలో సోమవారం ఉదయం 11 గంటలకు అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం నిర్వహించనుంది. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. తాడికొండ మండలం పొన్నెకల్లులో అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించనున్నారు. సాంఘిక సంక్షేమ వసతి గృహానికి శంకుస్థాపన చేయనున్నారు. అంబేద్కర్ విద్యా పథకం కింద రుణాలు తీసుకొని ఉన్నత చదువులు చదివిన పూర్వపు విద్యార్థులతో వర్చువల్ సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం తాడికొండ అసెంబ్లీ నియోజక వర్గం టీడీపీ శ్రేణులతో సమావేశం నిర్వహించనున్నారు.
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమల్లోకి తెచ్చిన పెన్షన్ పథకాన్ని అమరావతి రాజధానికి ఆనుకొని ఉన్న మంగళగిరి అసెంబ్లీ నియోజక వర్గంలో ప్రారంభించారు. తన కుమారుడు, మంత్రి నారా లోకేష్ మంగళగిరికి ప్రాతినిధ్యం వహిస్తుండటం, మంగళగిరి నుంచే పెన్షన్ పథకానికి శ్రీకారం చుట్టాలనే సెంటుమెంటు వల్ల కూడా ఇక్కడ నుంచి పెన్షన్ పథకాన్ని ప్రారంభించారు. మంగళగిరి అసెంబ్లీ సెగ్మెంట్‌లోని పెనుమాక గ్రామంలో 2024 జూలై 1న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకానికి శ్రీకారం చుట్టూరు. గతంలో ఇచ్చిన దానికి అదనంగా మరో రూ. 1000 చేర్చి మొత్తం రూ. 4వేలు అందించారు. పెనుమాకలోని ఎస్సీ కాలనీలో నివాసం ఉండే బానావత్ పాములు నాయక్ అనే వృద్ధుడికి తొలి పెన్షన్‌ను అందజేశారు. తర్వాత వారి కుటుంబ సభ్యులతో ముచ్చటించారు.
అలాగే దీపం–2 కింద ఉచిత సిలిండర్ పథకం ప్రారంభ కార్యక్రమాన్ని శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం ఈదుపురంలో దీనికి శ్రీకారం చుట్టూరు. లబ్దిదారు శాంతమ్మ ఇంటికెళ్లి ఉచిత గ్యాస్ సిలిండర్‌ను అందజేశారు. అనంతరం సీఎం చంద్రబాబే స్వయంగా స్టౌవ్ ఆన్ చేసి, వెలిగించి, పాలు మరిగించి, టీ తయారు చేసి, లబ్ధిదారు కుటుంబ సభ్యులకు అందజేసి, తాను కూడా సేవించారు.
తర్వాత మంత్రి నారా లోకేష్ విద్యా శాఖ ఆధ్వర్యంలో మెగాపేరెంట్స్ కమిటీ సమావేశాన్ని బాపట్లలో నిర్వహించారు. 2024 డిసెంబరు 7న నిర్వహించిన ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. విద్యార్థులతో, విద్యార్థుల తల్లిండ్రులతో ముచ్చటించారు. సరదాగా ఆటలు ఆడారు. స్కూలు పిల్లలు, తల్లిదండ్రులు, మంత్రి నారా లోకేష్‌తో కలిసి సహపంక్తి భోజనం చేశారు. అనంతరం తాను తన్ని ప్లేట్లతో పాటు తన తండ్రి, సీఎం చంద్రబాబు తిన్న ప్లేట్లను కూడా మంత్రి స్థాయిలో ఉన్న కుమారుడు నారా లోకేష్ స్వయంగా తీసి అందరి దృష్టిని ఆకర్షించారు.
ఇటీవల ఏప్రిల్ 5న నిర్వహించిన బాబు జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకలకు ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం ముప్పాళ్లలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. స్థానిక అంబేద్కర్ గురుకుల పాఠశాలను సందర్శించారు. విద్యార్థులతో ముచ్చటించారు. వసతి గృహంలో వారు ఉంటున్న గదులను స్వయంగా పరిశీలించారు. తర్వాత ఏప్రిల్ 11న మహాత్మ జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలకు ఏలూరు జిల్లాను ఎంచుకున్నారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం వడ్లమానులో ఫూలే జయంతి వేడుకలు నిర్వహించారు. అక్కడ స్థానిక బీసీ వర్గాల ప్రజలతో ముచ్చటించారు. ఇలా ఒక్కో కార్యక్రమానికి ఒక్కో ప్రాంతాన్నిఎంచుకొని అన్ని ప్రాంతాలను కలియతిరిగుతూ సీఎం చంద్రబాబు తన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు.
Next Story