అవనిగడ్డలో చంద్రశేర్ పోటీ చేసేందుకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చక్రం తిప్పారు. దీంతో ఆయనకు జగన్ వద్ద లైన్ క్లియరైంది.


ఆంధ్రప్రదేశ్ లోని అవనిగడ్డ నియోజకవర్గం రాజకీయ చర్చకు వేదికైంది. దేశంలో పేరుగాంచిన క్యాన్సర్ వైద్యనిపుణుడైన డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగనున్నారు. ఈ మేరకు వైసీపీ అవనిగడ్డ నియోజకవర్గ అభ్యర్థిగా సీఎం వైఎస్ జగన్ చంద్రశేఖర్ ను నియమించారు. అసలు ఈ చంద్రశేఖర్ ఎవరు? ఎందుకు ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు. ఈయన రాజకీయాల్లోకి రావడం వెనుక ఏమి జరిగిందనేది చర్చగా మారింది.

చంద్రశేఖర్ కోసం చక్రం తిప్పిన బొత్స

సింహాద్రి చంద్రశేఖర్ పేరుగాంచిన ఆంకాలజీ స్పెషలిస్ట్. హైదరాబాద్ లోని ప్రధానమైన వైద్యశాలల్లో కన్సల్టెంట్ గా వైద్య సేవలు అందిస్తున్నారు. హైదరాబాద్ లో ఈయనకు ప్రత్యేకించి సౌమ్య సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఉంది. మంచి వైద్యుడు కావడంతో రాజకీయ నాయకులకు పరిచయాలు కూడా ఉన్నాయి. బొత్స సత్యనారాయణకు సింహాద్రి సత్యనారాయణతో పరిచయం వుంది. సింహాద్రి సత్యనారాయణ మూడు సార్లు దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసి మంచి పేరు సంపాదించారు. చంద్రశేఖర్ ఆయన కుమారుడు కావడం వల్ల రాజకీయ నాయకులతో పరిచయాలు, సంబంధాలు ఉన్నాయి. మంత్రి బొత్స సత్యనారాయణ సీఎం జగన్ తో మాట్లాడి అవనిగడ్డ నియోజకవర్గానికి టిక్కెట్ ఇప్పించారు. బొత్స చక్రం తిప్పడం వల్లే చంద్రశేఖర్ కు టిక్కెట్ దక్కిందని పలువురు చెబుతున్నారు.

చంద్రశేఖర్ కోసం రమేశ్ ను ఎంపీగా పంపించారు

అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్ కు నియోజకవర్గంలో మంచిపేరు వుంది. పార్లమెంటు స్థానానికి పోటీ చేసినా తప్పకుండా గెలుస్తాడనే నమ్మకం వుంది. అందువల్లనే అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. చంద్రశేఖర్ ప్రస్తుతం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ తరపున స్టేట్ అబ్జర్వర్ గా ఉన్నారు. గత ఎన్నికల సమయంలోనూ టిక్కెట్ కోసం ప్రయత్నించారు. అప్పుడు జగన్ ఇటువంటి ప్రయోగాలు చేయదలుచుకోలేదు. అందువల్ల టిక్కెట్ ఇవ్వలేదు. ప్రస్తుతం నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పులు జరుగుతుండటం వల్ల టిక్కెట్ ఇవ్వాలని చంద్రశేఖర్ బొత్సతో చెప్పడంతో టిక్కట్ దక్కింది.

పార్లమెంట్ స్థానానికి ఇష్టపడని రమేశ్ బాబు

మచిలీపట్నం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసేందుకు సింహాద్రి రమేశ్ ఇష్టపడటం లేదు. అయితే సీఎం చెప్పారు కాబట్టి పోటీ చేస్తానని అర్ధంగీకారంగా చెప్పారు. తాను అసెంబ్లీ నుంచే పోటీ చేస్తానని చెబితే సీఎం నేను చూసుకుంటాను. నువ్వు పార్లమెంట్ కు పోటీ చేయాలన్నా అని కోరినట్లు సమాచారం. దీంతో రమేశ్ బాబు కూడా ఒప్పుకోక తప్పలేదు.

Next Story