క్రిమినల్ చట్టాల మార్పు వరం కాదు... శాపమే !
x

క్రిమినల్ చట్టాల మార్పు వరం కాదు... శాపమే !

దేశంలో చట్టాల మార్పుపై ఏపీ బార్ కౌన్సిల్ ఘాటుగా స్పందించింది. దీని వల్ల మేలు ఏమీ ఉండదని అన్నారు.


దేశంలో చట్టాల మార్పు... వరం కాదని శాపమేనంటూ ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులు, ప్రముఖ న్యాయవాది, సుంకర రాజేంద్రప్రసాద్, రిటైర్డ్ జడ్జి గుర్రప్పతో పాటు సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నర్సింగరావు, వివిధ కార్మిక ప్రజాసంఘాల నేతలు ముక్తకంఠంతో ఉద్ధాటించారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి అధ్యక్షతన తిరుపతిలోని వేమన విజ్ఞాన కేంద్రంలో శనివారం ఉదయం నిర్వహించిన "దేశంలో చట్టాల మార్పు వరమా, శాపమా?' అనే అంశంపై సదస్సును నిర్వహించారు.

దీనికి ముఖ్య అతిథులుగా హాజరైన ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులు, ప్రముఖ న్యాయవాది, సుంకర రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. ప్రజలకు సత్వర న్యాయం అందించడం కోసమేనంటూ కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన చట్టాలన్నీ 'కొత్త జాడీలో పాత పచ్చడి' చందంగానే ఉందంటూ విమర్శించారు. ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసిడ్యూర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌ల పేర్లు స్థానంలో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అదీనియం లను తీసుకొచ్చారని, వాటిని జూలై 1 నుంచి అమలు పరుస్తున్నారని తెలిపారు. వీటికి పేర్లు, సెక్షన్లు మార్చారే తప్ప ప్రజలకు సత్వర న్యాయాన్ని అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలు ఏ మాత్రం తీసుకోలేదని దుయ్యబట్టారు. భారత లా కమిషన్ చేసిన ప్రతిపాదనలు మార్పులను ఏమాత్రం పట్టించుకోకుండా, పార్లమెంటులో ప్రతిపక్ష సభ్యుల ఆమోదం లేకుండానే, ఏకపక్షంగా నియంతృత్వ ధోరణితో బిజెపి ప్రభుత్వం బిల్లులను చట్టాలుగా ఆమోదించిందని వాపోయారు. కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజింగ్ క్రైమ్ పేరుతో ప్రశ్నించే గొంతుకులను అణగదొక్కేలా, న్యాయవ్యవస్థకు తూట్లు పొడిచేలా పోలీసు వ్యవస్థకు అధికారాలను కట్టబెట్టిందని ఆవేదన చెందారు.

దీనివల్ల ప్రజా, కార్మిక, దళిత ఉద్యమాలకు తీవ్ర నిర్బంధం తప్పదు అన్నారు. ఐపీసీ 123 ఏ లో రాజ ద్రోహం గా ఉన్న పేరును దేశద్రోహంగా మార్చి బిఎన్ఎస్ 152 మార్పు చేసిందనీ, దీనివల్ల సామూహిక నిరసనలు, ఆందోళనలు, సభలు చేపట్టి చేసే ప్రసంగాలు, ఉపన్యాసాలు, సైగలనూ దేశద్రోహంగా చిత్రీకరించే కుట్రకు తెర తీయడం బాధాకరమన్నారు. ఒకటి రెండు కేసులు ఉన్న సామాన్యులను సైతం కంటిన్యూ ఆర్గనైజ్డ్ క్రైమ్ పేరుతో వారి కుటుంబ సభ్యులను సైతం నేరస్తులుగా చిత్రీకరించడం దుర్మార్గమన్నారు. ఓవైపు న్యాయ వ్యవస్థకు ఉన్న హక్కులు , అధికారాలు రెవెన్యూ అధికారుల కే ఉండకూడదని ఆందోళనలు చేస్తుంటే వీటికి పూర్తి భిన్నంగా పోలీసు అధికారులకు సైతం స్పెషల్ మెజిస్ట్రేట్గా మార్చడం అత్యంత దుర్మార్గమన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎమర్జెన్సీ ని తలపించే పోలీసు రాజ్యంగా ఈ చట్టాలు చేయడం శోచనీయమని పేర్కొన్నారు. బి.ఎన్.ఎస్ 195 ద్వారా 14 రోజుల పోలీసు కస్టడీని 40 నుంచి 60 రోజులకు పెంచుతూ చట్టం చేయడం ఎవరిని రక్షించడానికి? ఎవర్ని శిక్షించడానికో న్యాయ నిపుణులను సైతం అర్థం కావడం లేదన్నారు. వలస వాదం కాదు సొంతవాదము అంటూ చెబుతూ ఇండియా పేరును తొలగించడం కోసమే చేసిన కుట్ర తప్ప ఈ చట్టాల వల్ల పౌర సమాజానికి ఒరిగిందేమీ లేదని ఉద్ఘాటించారు.

రిటైర్డ్ జడ్జి గుర్రప్ప మాట్లాడుతూ... ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 26 ప్రకారం ఏదైనా ఒక దస్త్రం పోలీసుల ముందు ఇస్తే అలాంటి సందర్భంలో చెల్లుబాటు కాదని సాక్షాత్తు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని, అలాంటిది నేటి ప్రభుత్వం పూర్తిగా పోలీసులకు సర్వాధికారాలను కట్టబెడుతూ చట్టం చేయడం దారుణం అన్నారు. న్యాయ నిపుణుల దిశా నిర్దేశం లేకుండానే ఈ కొత్త చట్టాలు పూర్తిగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో తయారుచేసిందని విమర్శించారు.

సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నర్సింగరావు మాట్లాడుతూ... బిజెపి ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తూ భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రజా, కార్మిక ,కర్షక, రైతాంగ చట్టాలను చేయడం పరిపాటిగా మారిందన్నారు. స్వాతంత్రానికి పూర్వం నుంచి ఉన్న 4 కార్మిక చట్టాలను కాల రాసిన ఘనత బిజెపి దేని అన్నారు. కార్మికులకు భారత రాజ్యాంగం కల్పించిన మూడు ప్రధానమైన హక్కులు (సంగం పెట్టుకోవడం, సమస్యల పరిష్కారం కోసం యాజ

మాన్యాలతో బేరసారాలు ఆడటం, ఆందోళనలు సమ్మెలు చేయడం) హరించే విధంగా నల్ల చట్టాలను తీసుకొచ్చిందని వాపోయారు. ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలను నిరసిస్తూ ఢిల్లీలో రైతుల పోరాటం స్ఫూర్తితో ఈ నూతన క్రిమినల్ చట్టాలకు వ్యతిరేకంగా ఐక్యంగా ఎత్తున పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. 11 లక్షల కోట్ల రూపాయలను కార్పొరేట్ పెద్దలకు రుణమాఫీ చేసిన ఈ ప్రభుత్వం ఆ భారాలన్నింటినీ పేదలు, ఉద్యోగులు కార్మికులపై మోపుతోందని ధ్వజమెత్తారు. శిక్షలు పెంచితే ప్రమాదాలు తగ్గుతాయన్న కుంటి సాకుతో ట్రాన్స్పోర్ట్ రంగంలోని కార్మికులు డ్రైవర్లపై తీవ్ర నిర్బంధాలు ఆంక్షలు కేసులను మోపుతోందని తెలిపారు. పోరాటం చేస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయని ఆ దిశగా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి మాట్లాడుతూ.... నూతన క్రిమినల్ చట్టాల పేరుతో గత ఏడాది ఆగస్టులో ఈ మూడు చట్టాలను ప్రతిపాదించడం, పార్లమెంటులో ప్రతిపక్ష సభ్యుల ఆమోదం లేకుండానే డిసెంబర్లో చట్టం చేయడం, జూలై నెల 1 నుంచి అమలులోకి తీసుకురావడం చూస్తుంటే " న్యాయం జరగడం కాదు ..తమకు శిక్ష వేయడమే ముఖ్యం" అన్నట్లు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు స్పష్టం అవుతుందని పేర్కొన్నారు. ఈ నూతన చట్టాలు ప్రశ్నించే గొంతుకులకు తీవ్ర ఆటంకంగా మారిందని, హక్కుల గురించి నోరు ఎత్తితే దేశద్రోహం కేసులు బనాయించడమంటే ఇది పూర్తిగా రాజ్యాంగ హననమేనని అన్నారు. కష్టజీవుల పక్షాన నిలబడటమే పాపమన్నట్లు వారి కుటుంబ సభ్యులపైనా తీవ్ర నిర్బంధం, కేసులు బనాయించడం, అరెస్టులు చేసేలా చట్టాలు చేయడం దుర్మార్గమన్నారు. ఈ చట్టాలకు వ్యతిరేకంగా సమైక్యంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు.

అనంతరం ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ (ఐలు) రాష్ట్ర అధ్యక్షులు కుమార్, జిల్లా అధ్యక్షులు హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ...1975 ఎమర్జెన్సీ ని విధించిన జూలై 25న రాజ్యాంగ హత్య దినోత్సవం అని బిజెపి చెబుతోందని... వాస్తవంగా దుర్మార్గమైన మూడు క్రిమినల్ చట్టాలను అమలు చేస్తున్న జూలై 1న రాజ్యాంగ హత్య దినోత్సవం గా ప్రకటించాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. ఈ సదస్సులో ఏఐటిసి జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ, ఐ ఎన్ టి యు సి రాష్ట్ర నాయకులే బూరి రత్నకుమార్, టిఎన్టియుసి రాష్ట్ర కార్యదర్శి అంబురి సింధుజ లు మాట్లాడుతూ పౌర సమాజానికి తీవ్ర విఘాతం కల్పించే ఈ చట్టాలను రద్దు చేయాలని, దానికోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ సదస్సులో సిపిఎం తిరుపతి జిల్లా కార్యదర్శి వంద వాసి నాగరాజు, సిఐటియు జిల్లా అధ్యక్షులు జీబిఎస్ మన్యం, సీనియర్ న్యాయవాదులు చల్లా వెంకటయ్య, పత్తికొండ మురళి, వేమన విజ్ఞాన కేంద్రం కార్యదర్శి ఎం నాగార్జున తో పాటు పలువురు న్యాయవాదులు, విద్యావేత్తలు, కార్మిక ప్రజా సఘాల,నాయకులు పాల్గొన్నారు.

Read More
Next Story