Chandrababu

టీడీపీ అభ్యర్థును మారుస్తున్నారు. మార్పులు అనివార్యమైనందునే తప్పటం లేదని చంద్రబాబు అంటున్నారు. బీజేపీ వారి నుంచి వచ్చిన ప్రతిపాదన కూడా దీనికి కారణమంటున్నారు.


ఆదివారం మార్పులు జరిగిన నియోకజవర్గాల్లోని వారికి బీఫారాలు

పార్టీ కార్యాలయానికి రావాల్సిందిగా ఇప్పటికే సమాచారం
మార్పులపై భగ్గుమంటున్న నాయకులు
తెలుగుదేశం పార్టీలో అభ్యర్థుల మార్పులు కొనసాగుతున్నాయి. ఆదివారం మరికొందరి సీట్లు మారుస్తున్నారు. ఈ మేరకు బీ ఫారాలు తీసుకునేందుకు కొత్తవారికి చంద్రబాబు సమాచారం అందించారు. బి ఫారాలు అందుకున్న తరువాత వారితో మాట్లాడతారు. ప్రదానంగా ఐదు నియోకవర్గాల్లో ఈ మార్పులు చేస్తున్నారు.
మూడు సార్లు ఇప్పటి వరకు అభ్యర్థులను చంద్రబాబు నాయుడు ప్రకటించారు. నాలుగో సారి నేరుగా మార్పులు చేస్తున్న అభ్యర్థులకు బీఫారాలు ఇచ్చేందుకు పార్టీ కార్యాలయానికి పిలవడం నాయకులను అయోమయంలో పడేసింది. ఉండి, పాడేరు, దెందులూరు, వెంకటగిరి, మడకసిర, మాడుగుల అనపర్తి నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు మార్పులు జరుగుతున్నాయి.
ఉండి నియోజకవర్గంలో అభ్యర్థి ఎంపికపై హైడ్రామా నడిచిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఈ నియోజకర్గంపై క్లారిటీ ఇవ్వలేదు. అయితే రఘురామకృష్ణంరాజుకు ఆదివారం సాయంత్రం బిఫారం ఇవ్వనున్నారు. ఈ మేరకు ఆయనకు కబురందింది. మొదట ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మంతెన రామరాజును ప్రకటించారు. పాడేరు నుంచి ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న కె వెంకటరమేష్‌నాయుడును తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. అయితే ఎందుకు మనసు మార్చుకున్నారో తెలియదు కానీ గిడ్డి ఈశ్వరికి సీటు ఇవ్వనున్నట్లు సమాచారం. గిడ్డి ఈశ్వరి వైఎస్సార్‌సీపీలో గెలిచి తెలుగుదేశం పార్టీలో చేరారు. గత ఎన్నికల్లో ఓటమిపాలైంది. తిరిగి ఆమెకు సీటు ఇవ్వకుండా ఆపారు. ఎందుకో మనసు మార్చుకున్న నేతలు తిరిగి ఆమెన రంగంలోకి దించుతున్నారు.
దెందులూరు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు మొదట టీడీపీ టిక్కెట్‌ కేటాయించారు. పార్టీకి ప్రభాకర్‌ వీరాభిమాని. అయితే ఆయన పార్టీ అండ చూసుకొని కొన్ని తప్పులు చేసినందున తిరిగి అవే పరిస్థితులు కొనసాగే అవకాశం ఉంటే పార్టీకి చెడ్డపేరు వస్తుందని మార్చాలని భావించినట్లు సమాచారం. చింతమనేనిని పార్టీ ఆఫీసుకు బీ ఫారం కోసం రావొద్దని స్పష్టంగా చెప్పారు. ఇక్కడ ఎవరికి సీటు ఇవ్వాలనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అభ్యర్థి మార్పు మాత్రం అనివార్యమని చెప్పారు. వెంకటగిరి నియోజకవర్గం నుంచి కురుగొండ్ల లక్ష్మిప్రియను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మొదట ప్రకటించారు. ఇప్పుడు ఆమెను మార్చి ఆమె తండ్రి రామకృష్ణకు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చారు. దీనిపై సందిగ్ధం వీడాల్సి ఉంది.
మడకసిర నియోజకవర్గం అభ్యర్థిగా మొదట ఎం ఇ సునీల్‌ కుమార్‌ను తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. ఈయనను కూడా మార్చాలనే ఆలోచనకు పార్టీ పెద్దలు వచ్చారు. ఈయన స్తానంలో ఎంఎస్‌ రాజు అనే వ్యక్తిని ప్రకటించారు. ఆయనకు ఆదివారం సాయంత్రం బి ఫారం అందజేస్తున్నారు. మాడుగుల నియోజకవర్గం నుంచి మొదట పైలా ప్రసాదరావును ప్రకటించారు. అయితే ఇక్కడ అభ్యర్థిని మార్చేందుకు నిర్ణయించారు. బండారు సత్యనారాయణమూర్తికి టిక్కెట్‌ ఇవ్వటానికి నిర్ణయించారు. అనపర్తి బీజేపీకి టిక్కెట్‌ కేటాయించారు. ములగపాటి శివరామకృష్ణంరాజుకు కేటాయించారు. అయితే తిరిగి ఇక్కడి నుంచి టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని పోటీలోకి దింపనున్నారు. బీజేపీకి టిక్కెట్‌ కేటాయించినందున రామకృష్ణారెడ్డిని టీడీపీలోకి పంపించి పోటీ చేయించాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు. దాదాపు ఇక్కడ కూడా అభ్యర్థి మార్పు ఖాయమైంది.
Next Story