![వెంకన్న ‘తిరుపతి’లో ఈ అలజడి ఏమిటి? వెంకన్న ‘తిరుపతి’లో ఈ అలజడి ఏమిటి?](https://telangana.thefederal.com/h-upload/2025/02/12/512352-tiru3000.webp)
వెంకన్న ‘తిరుపతి’లో ఈ అలజడి ఏమిటి?
శతాబ్దాలుగా రూపొందిన తిరుపతి ప్రజాస్వామిక స్వభావం మసకబారుతున్నదా?
బుధవారం (ఫిబ్రవరి 12) ఉదయం తిరుపతిలో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఎడ్మినిష్ట్రేటివ్ బిల్డింగ్ దగ్గిర అనేక మంది సాధువులు నిరసన ఆమరణ దీక్షలో కూర్చున్నారు. వాళ్లంతా అక్కడి సమీపాన తిరుమల కొండ దిగువన ‘ముంతాజ్ హోటల్’ పేరుతో ఒక ఫైవ్ స్టార్ హోటల్ కు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ దీక్ష చేస్తున్నారు.
ఇలా కాషాయంబర ధారులు తిరుపతిలో ఒక హోటల్ కు వ్యతిరేకంగా ఆందోళన చేయడం ఎపుడూ జరగలేదు. తిరుపతిలో చాలా హోటళ్లను ముస్లింలు నిర్వహిస్తున్నారు. ఈ హోటళ్లకు నిరసన ఎదురవలేదు. ఇలా సాధువులు తిరుపతిలో ఆందోళన దిగడం ఇదే మొదటిసారి.
సరిగ్గా నాలుగు రోజుల కిందట తిరుపతిలో మరొక ఆశ్చర్యకరమయిన సంఘటన జరిగింది. పట్టణంలోని అలిపిరి (Alipiri) సమీపంలో భారతీయ విద్యాభవన్ ఏర్పాటుచేసిన బుక్ ఎగ్జిబిషన్ లో రెండు స్టాల్స్ మీద దాడి జరిగింది. ఈ దాడి వల్ల ఇస్లాంలో హిందువులు తెలుసుకోవలసిని విషయాలున్నాయని చెబుతూ రాసిన పుస్తకం విక్రయిస్తున్న షాపును మూసేయాల్సి వచ్చింది. మరొక స్టాల్ నుంచి పెరియార్ రామస్వామి నాయకర్ (Periyar EV Ramaswamy Naicker) రాసిన పుస్తకాలను తీసేయాల్సి వచ్చింది.
ఇలాంటి సంఘటనలు తిరుపతి వాసులకి కొత్త. ఈ రకం నిరసనలకు ఇంతవరకు తిరుపతిలో తావులేకుండా ఉండింది. అందుకే తిరుపతిలోని మేధావులను, రచయితలను ఈ రెండు సంఘటనలు కుదిపివేశాయి. పుస్తకాల మీద జరిగిన దాడికి నిరసనగా నగరంలో ప్రదర్శనలు జరిగాయి. రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. రచయితలు, కళాకారులు, మేధావులు పుస్తకాల మీద సాగించిన దాడిని నిరసించారు.
సుమారు 6,74,000 (Census Report 2025 Estimate) జనాభా ఉన్న తిరుపతి మెట్రో ఏరియాలో చాలా ప్రశాంతావరణం ఉంటుంది. తిరుపతి జనాభాలో 92 శాతం మంది హిందువులుంటారు. ముస్లిం జనాభా 6.05 శాతం. క్రైస్తవులు నామమాత్రంగా 0.74 శాతం ఉంటారు. బయటి ప్రాంతాలనుంచి తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు రోజు సుమారు 70 వేల మంది తిరుపతికి వస్తారు. ఇంత భారీగా యాత్రికుల ప్రవాహం ఉన్నా తిరుపతి ఎపుడూ ప్రశాంతంగానే ఉండింది. అక్కడ నమో వేంకటేశా (Namo Venkatesha), ఏడు కొండలవాడా, వెంకటరమణా, గోవిందా గోవిందా( Edu Kondalawada, Venkataraman, Govinda, Govinda) అనే పిలుపు తప్ప మత వైరుధ్యాలకు సంబంధించిన నినాదాలు అరుపులు వినిపించేవి కావు. ఇలాంటి చోట ఇపుడు ఒక మతానికి వ్యతిరేకంగా నినాదాలు వస్తున్నాయి. ఒక భిన్నాభిప్రాయం వ్యక్తం చేసే పుస్తకాలమీద దాడులుమొదలయ్యాయి. ఇది ఒక తాత్కాలిక వికృత చర్యనా లేక తిరుపతి కూడా భిన్నాభిప్రాయాలకు తావీయని పట్టణంగా మారిపోతున్నదా?
ముంతాజ్ హోటల్ ఏమిటి?
తిరుపతి కొండ దిగువన రిజర్వుడు అటవీ ప్రాంతంలో దేవలోకం (Devalokam) అనే ఒక ప్రాజక్టు కోసం గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఒక ప్రైవేటు వ్యక్తికి భారీగా భూమిని లీజుకు ఇచ్చింది. దీనికి పారెస్టు అధికారుల నుంచి వ్యతిరేకత వచ్చింది. ఇక్కడి ఫారెస్టు భూములను నిర్మాణాలకు మళ్ళించడానికి వీల్లేదు. అయితే, ఇక్కడి అడవి ధ్వంసం చేసి, ఆ భూములకు మినహాయింపు ఇచ్చి దేవలోకం ప్రాజక్టుకు అనుమతి ఇచ్చారు. దేవలోకం ప్రాజక్టు అంటే, దేశంలోని అన్ని ప్రముఖ హిందూదేవాలయాల నమూనాలను నిర్మించేందుకు ఏర్పాటు చేస్తున్న పార్క్. ఈ లీజు బాగా రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తికి వెళ్లింది. ఈ మినియేచర్ టెంపుల్ కాంప్లెక్స్ (Miniature temple complex) వల్ల తిరుపతిలో టూరిజం పెరుగుతుందన్న సాకుతో ఈ ప్రాజక్టుకు అనుమతిచ్చారు.
తిరుపతికి వచ్చే భక్తుల్లో ఎక్కువ బాలాజీ (Lord Balaji) ఆలయ సముదాయంకు సంబంధించిన గుళ్లను తప్పమరొక క్షేత్రం సందర్శించడం జరగదు. అలాంటి చోట టూరిజం పేరుతో అడవిని నరికి ‘దేవలోకం’ నిర్మించాలనుకుంటున్నారు. అయితే, చంద్రబాబునాయుడు 2019లో అధికారం కోల్పోవడంతో ఈ ప్రాజక్టు మూలన పడింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసిసి నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాజక్టుకు అడ్డుపుల్ల వేశారు. చంద్రబాబు నాయుడు లీజుకు ఇచ్చిన భూమి నుంచి కొంత భాగాన్ని ముంతాజ్ హోటల్ యాజమాన్యానికి 94 సంవ్సరాలకు లీజుకు ఇచ్చారు. 2022లో కుదిరిన ఈ అగ్రిమెంటు ప్రకారం ఇక్కడ 2026 నాటికి 100 రూములతో ఒక ఫైవ్ స్టార్ హోటెల్ కట్టాల్సి ఉంది. ఈ ముంతాజ్ హోటెల్ యజమాని ఎవరో ఎవరికి తెలియదు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో హోటల్ నిర్మాణం సాగలేదు. 2024లో చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్య మంత్రి అయ్యాక దేవలోకం ప్రమోటర్స్ ఈ భూమి తమదేనని, ముంతాజ్ హోటెల్ అగ్రిమెంటు రద్దు చేసి తమకే అప్పగించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ ముంతాజ్ హోటల్ తో చేసుకున్న అగ్రిమెంట్ కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన నిర్వహించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించాలని వారు డిమాండ్ చేశారు.
తిరుపతి మతసామరస్య స్వభావం కోల్పోతున్నదా?
ఇటీవలి కాలంలో తిరుపతి పట్టణానికి ఉన్న మత సామరస్య స్వభావం (Communal Harmony) దెబ్బతింటున్నదని చాలా మంది మేధావులు ఆందోళన చెందుతున్నారు. తిరుపతి దేశంలోనే విశిష్టమయిన నగరం. లక్షలాది మంది వేంకటేశ్వర స్వామి (Devotees of Lord Venkateswara) భక్తులు తిరుపతి గుండానే తిరుమల వెళ్తారు. తిరుపతిలో వేంకటేశ్వర స్వామి సోదరుడైన శీ గోవిందరాజస్వామి ఆలయం ఉంది. ఆలయం పక్కనే పెద్ద కోనేరు (Temple Tank) ఉంది. తిరుపతి పట్టణంలో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం (Sri Venkatewara University), శ్రీ వేంకటేశ్వర ఆర్ట్స్ కాలేజీ , శీ గోవిందరాజస్వామి డిగ్రీ కాలేజీ (SGS College), శ్రీ వేంకటేశ్వర ఓరియంటల్ కాలేజీ, ఒక శిల్పకళాశాల, ఒక సంగీత కళాశాల ఉన్నాయి. యూనివర్శిటీ తప్ప మిగతావన్నీ తిరుమల తిరుపతి దేవస్థానమ్స్ (TTD)బోర్డు ఆధీనంలో ఉంటాయి. ఈ సంస్థల్లో అన్ని మతాల వాళ్లు పనిచేసేవాళ్లు. చిత్రమేమిటంటే, ఈ సంస్థల్లో బాగా పేరుమోసిన అధ్యాపకుల్లో అభ్యుదయవాదులుండే వారు, నాస్తీకులుండేవారు, హేతువాదులు, కమ్యూనిస్టులు కూడా ఉండేవారు. ఒకపుడు తిరుపతి ఓరియంటల్ కళాశాలకు ప్రిన్సిపల్ గా ఉన్న నాగసిద్దారెడ్డి రాష్ట్ర నాస్తిక సంఘం, హేతువాద సంఘం అధ్యక్షుడు. అదే విధంగా శ్రీ గోవింద రాజస్వామి ఆర్ట్స్ కాలేజీ (SGS)లో పని చేసిన ఇద్దరు అధ్యాపకులు రాష్ట్రమంతా పేరున్నఉద్యమకారులు. అందులో ఒక మార్క్సిస్టు తత్వవేత్తగా పేరున్న త్రిపురనేని మధుసూదనరావు. మరొకరు ప్రఖ్యాత రచయిత భూమన్. తిరుపతి డిగ్రీ కాలేజీలో నరాల వీరయ్య అనే మరొక లెక్చరర్ హేతువాద ఉద్యమకారుడు. వీళ్లందరూ ఆరోజు విద్యార్థులను ఎంతగానో ఉత్తేజ పరిచిన అధ్యాపకులు. వీళ్ల ఉపన్యాసాలతో ఉత్తేజితులయి ఎందోరో నక్సలైట్లు గా మారిపోయారు. అయితే, వీళ్లకి టిటిడితో ఎపుడూ ఘర్షణ లేదు. దేశంలో ఉన్న హిందూ ధార్మిక సంస్థల్లోకెల్లా ఉన్నతమయినది టిటిడి అని ఒక సారి త్రిపురనేని మధుసూదనరావు ఒక సభలో అన్నారు. టిటిడి ఉద్యోగుల్లో క్రైస్తవులుండే వారు, ముస్లింలు ఉండేవారు. వాళ్ల నియామకాలకు ఎపుడు ఆక్షేపణ రాలేదు. టిటిడికి అంతటి ప్రజాస్వామిక విలువలకోసం నిలబడిన చరిత్ర ఉందని ఒక ఉద్యోగి వ్యాఖ్యానించారు.
ఈ కోనేటి కట్ట మెట్లమీదే నాస్తిక, హేతవాద, కమ్యూనిస్టు సభలు జరిగేవి
కోనేటి కట్ట మీద కమ్యూనిస్టు సమావేశాలు
తిరుపతిలోని గోవింద రాజస్వామి కోనేటి కట్ట ఎన్నో రాజకీయ, ప్రజ్వామిక నిరసనలకు, సభలకే కాదు, కమ్యూనిస్టు ఉద్యమాలకు సాక్షి. తిరుపతిలో ఏ రాజకీయ సభ జరిగినా నగరం మధ్యన ఉన్న ఈ కోనేటి కట్టయే వేదిక. ప్రముఖ కమ్యూనిస్టు నేతలంతా ఈ వేదిక మీది నుంచే ప్రభుత్వాలను వ్యతిరేకించారు. హిందూమతంలోని అంధవిశ్వాసాలను ఎండగట్టారు. విప్లవ రాజకీయాలను బోధించారు. బూటకపు ఎన్ కౌంటర్లను (Fake enounters)ను ఖండించారు. తిరుపతి పట్టణంలోని టిటిటి జాగాల్లోనే నాస్తిక, హేతువాద సమావేశాలు జరిగేవి. నగరంలో గోవింద నామస్మరణ , ఇంక్విలాబ్ జిందాబాద్ లు పక్కపక్కనే వినిపించేవి. 1969కి ముందు ఈ ప్రాంతంలో కమ్యూనిస్టు ప్రాబల్యం ఉండింది. నక్సల్బరీ ఉద్యమం తర్వాత అంటే 1969 తర్వాత ఇక్కడ విప్లవ కమ్యూనిస్టు పార్టీలు వేళ్లూనాయి.
ఎమర్జన్సీలో జైలుకి వెళ్లిన టీచర్లు
1975లో ప్రధాని ఇందిరాగాంధీ ఏమర్జన్సీ విధించే నాటికి తిరుపతిలో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ (Radical Students Union) బలంగా ఉండింది. ఆ సంస్థ పుట్టింది కూడా తిరుపతిలోనే అని కొందరు చెప్పారు. మొదట రెవల్యూషనరీ స్టూండెంట్స్ యూనియన్ అని అనుకున్నారని, తర్వాత రెవల్యూషన్ పేరు స్థానంలో రాడికల్ అనే మాటని చేర్చాలని ప్రముఖ రచయిత భూమన్ చెప్పారు.
ఎమర్జన్సీ ప్రకటించాక త్రిపురేనేని మధుసూదన్ రావు, భూమన్ లతో పాటు రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ కు చెందిన భూమన కరుణాకరరెడ్డి, శైలకుమార్ వంటి వారిని అరెస్టు చేశారు. ఎమర్జన్సీ ఎత్తేశాక, జైలు నుంచి విడుదలయిన త్రిపురనేని, భూమన్ లను టిటిడి ఉద్యోగాల్లోకి తీసుకుంది. 1977 తర్వాత అన్ని విద్యాకేంద్రాల్లో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ బలపడింది. తిరుపతిలో విరసం సభలు జరిగాయి. కమ్యూనిస్టు కార్యకలాపాలు ఎపుడూ కొనసాగుతూనే ఉన్నాయి. ఇతర వామపక్ష విద్యార్థి సంస్థలు (AISF, SFI, PDSU)లు కూడా ఒకపుడు బలంగా ఉండేవి. “కృష్ణా జిల్లా నుంచి లెక్చరర్ గా తిరుపతికి వస్తూ మార్క్సిస్టు మేధావి త్రిపురనేని మధూసూదన రావు మరొక రెండు అంశాలను తీసుకువచ్చారు. అందులో ఒకటి నాస్తికమయితే, రెండోది హేతువాదం. హిందూత్వ భావజలానికి వ్యతిరేకమయిన భావజాలంతో ఉన్నా తిరుపతి, టిటిడి త్రిపురేనేనికి స్వాగతం పలికాయి. ఆయన్ని ఒక మహోపధ్యాయుడిగా ఎదిగేందుకు దోహపడింది తిరుపతియే ,” అని ప్రముఖ రచయిత ఆలూరు రాఘవశర్మ (రాఘవ) అన్నారు. “కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గుంటూరు ఏ.సీ. కాలేజీలో పనిచేసేటప్పుడు బైబిల్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యానించారు.అంతే, ఆ కాలేజీ నుంచి ఆయనను తరిమేశారు. విప్లవరాజకీయాలు బోధిస్తున్న త్రిపురనేనిని మధుసూదనరావును ఉద్యోగం నుంచి తీసెయ్యకపోతే ఫండ్స్ ఆపేస్తామని ప్రభుత్వం నుంచి టీటీడీకి హెచ్చరిక వచ్చింది. ప్రభుత్వ బెదిరింపును టీటీడీ లెక్కచేయలేదు. అదీ నాటి టిటిడి స్వయం ప్రతిపత్తి,” రాఘవ అన్నారు.
తిరుపతిలో ఒక విధమయిన అసహన( Intolerance) వాతావరణం నెలకొంటున్నదని మరొక మేధావి భూమన్ అన్నారు. భూమన్ గొప్పరచయితగా, వక్త గాపేరున్నవాడు. ఎస్ జిఎస్ కాలేజీలో పొలిటికల్ సైన్స్ లెక్చ రర్ గాపని చేసి రిటైరయ్యారు. రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ సంస్థాపకుల్లో ఒకరని చెబుతారు. ఎమర్జీన్సీ కాలమంతా జైలులో ఉన్నారు. “తిరుపతి నుంచి అనేక మంది కమ్యూనిస్టు మేధావులు, న్యాయవాదులు, రచయితలు అరెస్టు అయ్యారు. జైలులో మాతో పాటి సూర్య ప్రకాశ్ రెడ్డి, జూపూడి యజ్ఞనారాయణ, వెంకయ్యనాయుడు, వి రామరావు వంటి ఆర్ ఎస్ ఎస్ (Rashtriya Swayam Sevak: RSS) వాదులు కూడా ఉన్నారు. సైద్ధాంతికంగా ఎక్కడా రాజీలేకపోయినా మా మధ్య స్నేహం ఉండేది. పరస్పర గౌరవం ఉండేది. జైలు నుంచి వచ్చాక అది కొనసాగింది,”భూమన్ అన్నారు.
తిరుపతికి, టిటిడి కి సెక్యులర్ స్వభావం గురించి సిఐటియు నాయకుడు, టిటిడి ఉద్యోగుల సంఘం నాయకుడు కందారపు మురళి ప్రశంసించారు. “వందేళ్లుగా టిటిడిలోఅన్ని మతాల ఉద్యోగులున్నారు. ఎపుడూ ఆక్షేపణ లేదు. అదే విధంగా తిరుపతి నుంచి హిందూత్వ భావజాలానికి వ్యతిరేకంగా కత్తి పద్మారావు వంటి దళిత మేధావులు నాస్తికోపన్యాసాలు చేశారు. కమ్యూనిస్టు నేతలు నంబూద్రిపాద్, ఇకె నయనార్, పి సుందరయ్య వంటి నేతలు ఆలయాల ముందున్న ప్రదేశాలనుంచే బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఎపుడూ వ్యతిరేకత లేదు. ఈ వందేళ్ల నుంచి కొనసాగుతున్న తిరుపతి సారమస్య వాతావరణంఇపుడు క్షీణిస్తున్నది,” అని కందారపు మురళి పేర్కొన్నారు.
తిరుపతి సెక్యులర్ స్వభావం పోవడం వెనక రెడ్డి, కమ్మ కుల తగాదా ఉందని దళిత, బుద్ధిస్ట్ స్కాలర్ అయిన కత్తి పద్మరావు పేర్కొన్నారు. దేవుడులేడని మూఢనమ్మకాలను విస్మరించాలని చెబుతూ కత్తి పద్మారావు తిరుపతి కోనేటి కట్టమీది నుంచి కనీసం 20 బహిరంగ సభల్లో మాట్లాడారు. దళిత వాదం వచ్చిన నుంచి గొప్ప ఉపన్యాసకుడు కత్తి పద్మారావు. ఆయన ఉపన్యాసాలకు ఆ రోజుల్లో మంచి పేరుండేది. తిరుపతి విద్యార్థులు విరగబడి వచ్చేవారు. “తిరుపతిలో పుస్తకాల షాపుల మీద హిందూత్వ పేరుచెప్పుకుంటున్న కొందరు దాడులు జరపడం విచారకరం. తిరుపతిలో అసహన రాజకీయాలకు గుర్తింపులేదు. ఇది తాత్కాలి కమే కావచ్చు,”అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
తిరుపతిలో కాషాయ వాతావరణం ముసురుకునేందుకు రెడ్డి కమ్మల మధ్యగొడవ లే కారణం అని ఆయన అన్నారు. “ఈ ప్రాంతంలో రెడ్ల ప్రాబల్యం ఎక్కువ. ఈ ప్రాబల్యాన్ని ఎదుర్కొనేందుకు చిత్తూరు ప్రాంతంలో కమ్మ జనాభా లేదు. అందుకని రెడ్లకు వ్యతిరేకంగా హిందూజనాభాను మొబిలైజ్ చేసేందుకు, తాను తిరుమల తిరుపతి సంస్కర్త అని చెప్పుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నట్లుంది. అందువల్లే తిరుపతి కాషాయీకరణ అవుతున్నట్లుకనిపిస్తున్నది,” అని డాక్టర్ పద్మారావు(సీనియర్ ఫెలో, ఐసిఎస్ ఎస్ ఆర్) అన్నారు.
అంతేకాదు, తిరుపతి సంపదను, టిటిడి సంపదను దోచుకునే విషయం కనబడుకుండా ఉండేందుకు ఈ కాషాయీకరణను ప్రమోట్ చేస్తున్నారని కూడా డా. పద్మారావు అనుమానం వ్యక్తం చేశారు.
గత శనివారం నాడు విశాలాంధ్ర బుక్ కౌంటర్ నుంచి బలవంతంగా పెరియార్ పుస్తకాలను తీసేయించడం మీద కూడా మేధావుల్లో తీవ్రవ్యతిరేకత వచ్చింది. పలువురు రచయితలు, మేధావులు, న్యాయవాదులు, పౌరసంఘాలు కార్యకర్తలు మరుసటి రోజు జరిగిన ప్రదర్శనలో, రౌండ్ టేబుల్ లో ఖండించారు.
బుక్ ఎగ్జిబిషన్ లో ఏం జరిగింది.
భారతీయ విద్యాభవన్ తిరుపతిలో ఏర్పాటు చేసిన బుక్ ఎగ్జిబిషన్ లో ఏం జరిగిందో ప్రత్యక్ష సాక్షి, తిరుపతి పౌర చైతన్య వేదిక అధ్యక్షుడు వాకా ప్రసాద్ వివరించారు. “కొంతమంది వ్యక్తులు ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేసిన మనుజ్యోతి బుక్ షాపు దగ్గిరకు వెళ్లి అక్కడ ఇస్లాం ఫర్ హిందూస్ (Islam For Hinuds) పుస్తకాన్ని చూశారు. దాన్ని అర్వింద్ శర్మ రాశారు. ఇస్లామ్ లో ఉన్న హిందువులు తెలుసుకోవలసిన విషయాలున్నాయని ఆయన ఈ పుస్తకంలో ఉదహరించారు. ఈ పుస్తకం విక్రయించరాదని దుండగులు గొడవచేశారు. తర్వాత అక్కడే ఉన్న పిల్లల బైబిల్ (Children’s Bible)పుస్తకాన్ని చించేశారు. నిర్వహాకుడితో గొడవపడ్డారు. కొందరు బూతులు తిడుతూ గొడవచేస్తుంటే మరికొందరు వీడియో తీయడం మొదలుపెట్టారు. ఈ గొడవ జరుగుతున్నపుడు ఎగ్జిబిషన్ అధికారి ఒకరు వచ్చి బుక్ షాపు మూసేయించారు. తర్వాత ఈ మూక విశాలాంధ్ర (Visalandhra Publishing House) కౌంటర్ దగ్గరి వెళ్లి పెరియార్ పుస్తకాన్ని ఎలా విక్రయిస్తారని దబాయించింది. పెరియార్ హిందూ వ్యతిరేకి అని ఆయన పుస్తకాలను విక్రయించడానిక వీల్లేదని వాళ్లు వాదించారు. వెంటనే విశాలాంధ్ర వారు పెరియార్ పుస్తకాలను తొలగించి వేశారు. అదే విధంగా ఎపుడో 50 యేళ్ల కిందట రచయిత్రి రంగనాయకమ్మ (Ranganayakamma) రాసిన ‘రామాయణ విష వృక్షం’ (Ramayana Visha Vruksham) అచ్చేసారని షాపు నిర్వాహకులను నిందించారు. తర్వాత జైశ్రీరాం నినాదాలు చేసుకుంటూ వెళ్లిపోయారు,”అని వాకా ప్రసాద్ వివరించారు. అవేవి నిషేధమయిన పుస్తకాలు కావని తాను వారించబోతే తనని కొట్టేందుకు వచ్చారని కూడా వాకా ప్రసాద్ చెప్పారు.
తిరుపతిలో కాషాయీకరణ బలంగా అలుముకుంది. ఈ విషయాన్ని సాక్ష్యం ఒక చిన్న సంఘటన. బుక్ ఎగ్జిబిషన్ లో డా. జమనాదాస్ (Dr Jamanadas) రాసిన పుస్తకం ‘తిరుపతి బాలాజీ ఒకపుడు బౌద్ధాలయం’ (Tirupati Balaji was a Buddhist Shrine) అనే పుస్తకాన్ని విడుదల చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం. ఈ పుస్తకాన్ని మొదట ఎగ్జిబిషన్ లో ఉన్న వేదిక మీది నుంచి విడుదల చేయాలన్న ప్రతిపాదనవచ్చింది. దీనికి ఎవరు సుముఖంగా లేరు. చివరకు ఆపుస్తకాన్ని అంబేడ్కర్ భవన్ లో జరిగిన ఒక కార్యక్రమంలో విడుదలు చేశారు.ఈ పుస్తకాన్ని తెలుగు లోకి ఎ. ఎన్ నాగేశ్వరరావు అనే కవి అనువాదం చేశాడు. జమనాదాస్ వాదన ప్రకారం తిరుమల ఆలయం పుట్టుక బుద్ధిజం నుంచి జరిగింది. తిరుమల ఆలయం మహాయాన బుద్ధిజంలో బుద్ధుడికి ప్రతిరూపమయిన అవలోకితేశ్వర (Avalokisteswara)కు సంబంధించినది. ఇదే తర్వాత హిందువుల చేతిలో పడి బాలాజీ మందిరమయిందని జమనదాస్ చెప్పారు.
ఈ పుస్తకం విక్రయిస్తున్నందుకు కొంతమంది దండుగులు 2024 డిసెంబర్ లో జరిగిన హైదరాబాద్ బుక్ ఎగ్జిబిషన్ లో అభ్యంతరం చెప్పిరభస చేశారు. బుక్ స్టాల్ వద్ద ఉన్న ప్రముఖరచయిత ఎన్ వేణుగోపాల్ తో ఘర్షణకు దిగారు. దీని పర్యవసానంగా తిరుపతిలో ఈ పుస్తకాన్ని టిటిడి జాగాలో బహిరంగంగా విడుదలచేసేందుకు ఎవరూ ముందుకు రాక పోయిఉండవచ్చని ఒక రచయిత వ్యాఖ్యానించారు. మొత్తానికి తిరుపతిలో ఒకపుడు విలసిల్లిన విభిన్న సిద్ధాంతాల సామరస్య జీవనం ఇక అంతరించినట్లేనని పేరు రాసేందుకు ఇష్టపడని ఈ రచయిత అన్నారు.
ఈ పరిణామం పట్ల మరొక ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత మధురాంతకం నరేంద్ర ఆందోళన వ్యక్తం చేశారు. “తిరుపతి సంఘటనలు తీవ్రంగా కలచివేశాయి. సత్యాన్వేషణ అనేది విరుద్ధ భావాలను అర్థం చేసుకున్నపుడే సాధ్యం. సత్యం మాట్లాడేందుకే భయపడాల్సిన వాతావరణం నెలకొంటూఉంది. దీనికి వ్యతిరేకంగా గళమెత్తాలి,” అని డాక్టర్ నరేంద్ర ఆదివారం నాడు జరిగిన రౌండ్ టేబుల్ లో ప్రసంగిస్తూ చెప్పారు. మరొక రచయిత, అభ్యుదయ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి వల్లూరి శివప్రసాద్ కూడా పుస్తకాల మీద సాగుతున్న దాడిని ఖండించారు. “నిషేధం లేని పుస్తకాన్ని ఎక్కడైనా విక్రయించవచ్చు. కొనవచ్చు. చదవవచ్చు. ఒకరికి ఇష్టం లేనంత మాత్రం నిషేధం లేని పుస్తకాన్ని విక్రయించరాదని గొడవ చేయడం రాజ్యాంగ వ్యతిరేక చర్య,” అని అన్నారు.