గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమల పాలసీ మారనుంది. నూతన ప్రభుత్వం తీసుకురానున్న పాలసీ ఏమిటి?


ఆంధ్రప్రదేశ్‌లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఇండస్ట్రీస్‌ పాసీ మారనుంది. పాలసీ మార్చడం ద్వారా గతంలో ఎలాగైతే కొనసాగిందో అదే పాలసీని తీసుకొస్తే బాగుంటుందనే ఆలోచనలో టీడీపీ ప్రభుత్వం ఉంది. ప్రస్తుత పాలసీ ద్వారా పుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు కొత్తగా ఏమైనా ఆంధ్రప్రదేశ్‌లో వచ్చాయా? అంటే అదేమీ జరగలేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆలోచన మంచిదైనా ఆచరణలో సాధ్యం కాలేదు. ఇందుకు నిధుల లేమి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. నిధులు అనుకున్నన్ని లేనప్పుడు ఉన్నపాలసీని కొనసాగించకుండా కొత్తపాలసీలు తీసుకు రావడం ఏమిటనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఒకవేళ తీసుకొచ్చినా నిధులతో ముడిపడని ఆలోచనలు చేస్తే బాగుండేదనే అభిప్రాయం పలువురు ఐఏఎస్‌ల్లో ఉంది.

గత ప్రభుత్వ పాలసీ ఏమిటి?
గత ప్రభుత్వం ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ప్రతి జిల్లాకు ఒకటి ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. మల్టీ ఫుడ్‌ ప్రాసెస్‌ (కోర్‌ ఫుడ్‌ ప్రాసెస్‌ సౌకర్యాలు) అంటే అన్నిరకాల ఉత్పత్తులకు ఈ ప్రాసెసింగ్‌ యూనిట్లలో ప్రాసెసింగ్‌ చేసి విక్రయించేందుకు చర్యలు తీసుకుంటారు. ఇదంతా ప్రభుత్వం ద్వారానే చేయించాలనే ఆలోచనకు వచ్చింది. దీంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రభుత్వం తరపున జిల్లాకు ఒక మల్టీ ప్రాసెసింగ్‌ యూనిట్లు నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నారు. కనీసం వంద ఎకరాలకు తక్కువ కాకుండా స్థలాన్ని సేకరించి కోర్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ను నిర్మిస్తారు. డీటెయిల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టులు తయారైన తరువాత నిధులు సమస్య వచ్చింది. ఎక్కడి నుంచైనా అప్పు తెచ్చుకునేందుకు ప్రభుత్వం ఫుడ్‌ ప్రాసెసింగ్‌ వారికి అనుమతి ఇచ్చింది. దీంతో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఉన్నతాధికారులు ఢిల్లీలోని సిబ్బీని ఆశ్రయించారు. వారు పది వేల కోట్లు రుణంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. అయితే రుణం తీసుకునే ముందు షూరిటీ ఇవ్వాల్సి ఉంటుంది. దాని దగ్గర పెండింగ్‌ పడింది. ఈలోపు ప్రభుత్వం మారిపోయింది.
ఐదేళ్లలో ప్రభుత్వం ఏపనీ చేయలేకపోయింది..
గడచిన ప్రభుత్వ హయాంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌కు సంబంధించి ఏపనీ చేయలేకపోయిందనేది వాస్తవం. రైతులకు మంచి ధర వచ్చేలా చేయాలనుకున్న ప్రభుత్వ ఆశలు నెరవేరలేదు. జిల్లాకు ఒక మల్టీపర్పస్‌ పుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ను నెలకొల్పాలనేది మంచి ఆలోచనే కావొచ్చు. యూనిట్ల నిర్మాణాలకు కొన్ని చోట్ల స్థల సేకరణ కూడా జరిగింది. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ప్రైవేట్‌ వారికి పెద్దగా అవకాశం లేకుండా పోయింది.
ప్రైవేట్‌ వారిని ఎలా రంగంలోకి దించాలనుకుంది
ప్రైవేట్‌ వారిని రంగంలోకి దించేందుకు గత ప్రభుత్వం కూడా ఆలోచనలు చేసింది. అయితే కోర్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు నిర్మించిన తరువాత ఆ భవనాల్లో కావాల్సిన పరికరాలన్నీ అమర్చి నిర్వహణ బాధ్యతలు ప్రైవేట్‌ వారికి ఇవ్వాలనే ఆలోచన చేశారు. టెండర్లు పిలవడం ద్వారా ఎవరు ఎక్కువ టెండరు వేస్తారో వారికి నిర్వవహణ బాధ్యతలు ఇవ్వాలనే ఆలోచన చేసింది. ఇది ఎంతవరకు సక్సెస్‌ అవుతుందనే దానిపై కూడా చర్చ జరిగింది. టెండర్లు దక్కించుకున్న వారు టెండరు వేసిన కాలం వరకు ఉత్పత్తులను ప్రాసెసింగ్‌కు వాడుకుని ఆ తరువాత వెల్లిపోతారు. మిషనరీలో వచ్చిన సమస్యలు వారు చెప్పరు. ప్రభుత్వం ఆ పరికరాలు సరిగా ఉన్నాయో లేవో చెక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. పరికరాలు దెబ్బతింటే తిరిగి కొనుగోలు చేసే బాధ్యత కూడా నిర్వహణ దారులదే అనే కండీషన్‌ ఉంటే బాగుండేది అలాంటిదేమీ లేదు. దీని వల్ల యూనిట్లు ఎక్కువ కాలం రన్‌ అయ్యే అవకాశాలు ఉండవనేది పలువురు పారిశ్రామిక వేత్తల వాదన.
ప్రస్తుతం ప్రభుత్వం ఏమి చేయాలనుకుంటున్నది..
నూతన ప్రభుత్వం ప్రైవేట్‌ వ్యక్తులకు ప్రోత్సాహకాలు ఇచ్చి వారి ద్వారా ఫుడ్‌ ప్రాసెస్‌ యూనిట్లు నెలకొల్పాలనే ఆలోచనలో ఉంది. ఈ ఆలోచన కొత్తదేమీ కాదు. గత ప్రభుత్వాల హయాంలోనూ ఈ విధంగానే ఫుడ్‌ ప్రాసెస్‌ యూనిట్లు ఏర్పాటయి రన్నింగ్‌ జరిగాయి. ఎవరైనా ఫుడ్‌ ప్రాసెస్‌ యూనిట్‌ పెట్టేందుకు ముందకు వస్తే వారి నుంచి షేర్‌ క్యాపిటల్‌ కట్టిస్తారు. ఆ తరువాత ప్రభుత్వం ఇవ్వాల్సిన సబ్సిడీ కూడా ఇస్తుంది. అన్నీ కలుపుకుని ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ రన్నింగ్‌లోకి రావాల్సి ఉంటుంది.
త్వరలోనే కొత్త పాలసీ
పరిశ్రమల శాఖ మంత్రిగా టీజీ భరత్‌ బాధ్యతలు స్వీకరించగానే పరిశ్రమలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల రన్నింగ్‌పై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అధికారులు వివరించారు. పారిశ్రామిక రంగంలో అనుభవం ఉన్న భరత్‌ ప్రభుత్వం చేపట్టాలంటే సాధ్యమయ్యే పనికాదని తేల్చి చెప్పారు. ప్రైవేట్‌ వ్యక్తుల నిర్వహణకే వదిలేద్దామన్నారు. ఇందుకు సంబంధించిన నూతన పాలసీని వెంటనే రూపొందించాలని ఆదేశాలు జారీ చేశారు.
రాయలసీమలో ఫ్రూట్స్, కూరగాయలు
రాయలసీమ ప్రాంతంలో ఫ్రూట్స్, కూరగాయల ప్రాసెసింగ్‌ ఎక్కువగా జరుగుతోంది. మొగిలి, బంగారు పాళ్యం, చిత్తూరుల్లో ఇప్పటికే పలు ప్రాసెసింగ్‌ యూనిట్లు పనిచేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిధులతో 140 ఎకరాల్లో రాయలసీమలో ఏర్పాటు చేసిన కోర్‌ యూనిట్‌ బాగా జరుగుతోంది. చిత్తూరు జిల్లాలో 100 ఎకరాల్లో కోర్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ను ఏపీఐఐసీ వారు ఏర్పాటు చేశారు. కడప, విజయనగరం, నెల్లూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో ప్రస్తుతం ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఐదేళ్ల కాలానికి అంటే 2025 వరకు ఫ్రైమ్‌ మినిస్టర్‌ ఫార్మలేషన్‌ ఆఫ్‌ మైక్రో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ పథకం ద్వారా ఇప్పటికే 10,035 చిన్న తరహా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు రాష్ట్రంలో నెలకొల్పారు. మొత్తంగా 6,000 ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏపీలో ఉన్నాయి. 74,289 మందికి ఉద్యోగావకాశాలు ఈ ప్రాసెసింగ్‌ యూనిట్లలో లభించాయి.
రొయ్యలు, చేపల ప్రాసెసింగ్‌ యూనిట్లు పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, నెల్లూరు జిల్లాలో ఎక్కువగా ఉన్నాయి. చిత్తూరు, తిరుపతి, కడప, విజయనగరం, పార్వతీపురం మన్యం, వంటి జిల్లాలో ఫ్రూట్స్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఎక్కువగా ఉన్నాయి.
Next Story