ఎస్సీ వర్గీకరణపై తన ఆలోచన మార్చుకున్నారు. రిజర్వేషన్ అమలుకు ఏక సభ్య కమిషన్‌ను ప్రభుత్వం నియమించింది.
ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఒక కమిషన్‌ను నియమించింది. ఆ కమిషన్ సిపార్స్‌ల ప్రకారం రిజర్వేషన్ వర్గీకరణ జరుగుతుంది. అదే విధానాన్ని ఆంధ్రప్రదేశ్ కూడా అనుసరించేందుకు నిర్ణయించింది. ఏకసభ్య కమిషన్‌ను నియమిస్తూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.
దామాషా విధానాన్ని ఆపేసిన సీఎం..
జనాభా దామాషా విధానంలో ఎస్సీ వర్గీకరణ చేయాలని ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితీ నాయకుడు మంద కృష్ణ మాదిగ ఇటీవల ముఖ్యమంత్రిని క్యాంపు కార్యాలయంలో కలిసి రిజర్వేషన్ అమలుపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. ఆయన కోరిక మేరకు రిజర్వేషన్‌ల అమలు ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కావాల్సిన సమాచారం తీసుకుని ముందుకు వెళ్లాలనుకున్నారు. జనాభా దామాషా పద్ధతిన రిజర్వేషన్‌ల అమలు అంటే ఎక్కడ ఏ కులం వారు ఎక్కువ మంది ఉంటే అందుకు అనుగుణంగా రిజర్వేషన్ అమలు చేయాల్సి ఉంటుంది. ఆ విధానాన్ని వద్దనుకున్న సీఎం కమిషన్ వేశారు.
రెండు నెలల్లో నివేదిక
ఎస్సీ వర్గీకరణపై సమగ్రమైన నివేదిక ఇచ్చేందుకు ఏక సభ్య కమిషన్‌ను ప్రభుత్వం నియమించింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రాను కమిషన్ చైర్మన్‌గా నియమించారు. 60 రోజుల్లో నిర్థిష్ట సిపార్స్‌లు చేయాలని కమిషన్‌కు ప్రభుత్వం సూచించింది. బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి 60 రోజుల్లో సిఫార్స్‌లు చేయాలని, అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలని, కావాల్సిన ఏర్పట్లు సాంఘిక సంక్షేమ శాఖ చూడాల్సిందిగా ఆదేశాల్లో పేర్కొన్నారు. రాష్ట్ర, జిల్లా, జోన్ స్థాయిలో పరిశీలన చేయాలని, సమకాలీన సమాచారం ప్రకారం జనాభా గణనను పరిగణలోకి తీసుకుని సిఫార్స్‌లు చేయాల్సి ఉంటుంది. విద్యా, వైద్యానికి దూరంగా ఉంటున్న వారి వివరాలు కూడా సేకరించాల్సి ఉంటుంది. ఆర్థికంగా వెనుకబడిన వారిని కూడా గుర్తించి వారికోసం ప్రత్యేక చర్యలు తీసుకునే విధంగా సిపార్స్‌లు చేయాల్సి ఉంటుంది. ఎస్సీల్లోని ముఖ్యమైన కులాలే కాకుండా ఉప కులాలను కూడా పూర్తిగా గుర్తించి హేతుబద్దంగా వారికి రిజర్వేషన్ వర్తించేలా కమిషన్ సిఫార్స్‌లు ఉండాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.
జనవరి నాటికి కమిషన్ సిఫార్స్‌లు
ఎస్సీ వర్గీకరణ జరిగి రిజర్వేషన్ అమలు జరిగేందుకు జనవరి నెలాఖరు వరకు సమయం తీసుకునే అవకాశం ఉంది. ఏక సభ్య కమిషన్ తన పనిని ఎప్పటి నుంచి ప్రారంభిస్తుందో అప్పటి నుంచి రెండు నెలల వ్యవధిలో సిఫార్స్‌లు అందాల్సి ఉంది. అంటే జనవరి నెలాఖరు నాటికి నివేదిక అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి వర్గీకరణ తరువాత వచ్చే రిజర్వేషన్ ఫలాలను ఎస్సీలు అందుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎస్సీలకు ఆంధ్రప్రదేశ్‌లో రిజర్వేషన్ 15 శాతంగా ఉంది. ఇందులో ఎక్కువ రిజర్వేషన్ ఫలాలను మాలలు అనుభవిస్తున్నారంటూ మాదిగలు పోరాటం చేశారు. వర్గీకరణ ద్వారా ఎస్సీల్లోని అన్ని కులాలకు న్యాయం జరుగుతుందనే ఆలోచనలో ఎస్సీలు ఉన్నారు.
Next Story