
Prattipati Pullarao
వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు చిలకలూరిపేట సవాలే
రచ్చకెక్కిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ రాజకీయాలు. నేతల మధ్య పెరిగిన గ్యాప్. అభ్యర్థి ఖరారులో అసమ్మతి గళం. తాడేపల్లికి చేరిన పంచాయతీ.
జి. విజయ కుమార్
పల్నాడు జిల్లా చిలకలూరిపేట రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అధికార పార్టీ అయిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు ఒక్క సారిగా గుప్పుమనడంతో పాటు అవి కాస్తా రచకెక్కడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇది సంచలనంగా మారింది. మంత్రి విడుదల రజనీ వీటికి కేంద్ర బిందువుగా మారింది. 2019 ఎన్నికల్లో అక్కడ నుంచి గెలిచిన విడుదల రజనికి మంత్రి పదవి దక్కడం, అప్పటి వరకు అణగిమణిగి ఉండటం, మంత్రి పదవి చేతికి రాగానే రెచ్చి పోవడం,సీనియర్లను ఖాతరు చేయకుండా వారికి వ్యతిరేకంగా గ్రూపు ఏర్పాటు చేసి రాజకీయాలు చేయడంతో ఆ పార్టీలో విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకుంటున్న ఇలాంటి సంఘటలను టీడీపీ ఎప్పటికప్పుడు తమకు అనుకూలంగా మలచుకుంటూ ప్రజల్లో మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తోంది.
నాటు డీటీపీ అడ్డాగా చిలకలూరిపేట
ఒకప్పుడు ఇది తెలుగుదేశం పార్టీకి అడ్డాగా ఉండేది. ఆ తర్వాత వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారుతూ వచ్చింది. ఇప్పటి వరకు జరిగి ఎన్నికల్లో ఐదు పర్యాయాలు టీడీపీ గెలిచింది. మూడు సార్లు ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ప్రత్తిపాటి పుల్లారావు గెలుపొందారు. ఒక సారి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ గెలిచింది. గత ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన విడుదల రజనీ గెలుపొందారు. ఈ సారి కూడా వీళ్లద్దరే పోటీ పడుతారని, మంత్రుల మధ్య పోరు రసవత్తరంగా ఉంటుందని అందరూ భావించారు. అయితే ప్రత్తిపాటి పుల్లారావుకు టీడీపీ సీటు ఖరారు చేయగా, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం అభ్యర్థిని మార్చింది. విడుదల రజనీని గుంటూరుకు మార్చింది. ఇక్కడ మల్లెల రాజేష్ నాయుడుని సమన్వయకర్తగా నియమించారు. తర్వాత అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. చివరకు గుంటూరు మేయర్ కావాటి శివమనోహర్‌నాయుడుని అభ్యర్థిగా ఖరారు చేసింది.
ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలు
అయితే ఈ నియోజక వర్గాన్ని ఇరు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గెలుపే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. అయితే ప్రత్తిపాటి పుల్లారావు ఎప్పటి నుంచో ఈ ప్రాంతాన్ని అంటి పెట్టుకొని ఉండటంతో ఆయనకు అన్ని వర్గాల్లో అనుచరులు, కార్యకర్తలు, నేతలు ఉన్నారు. ఆయన కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు. అందరినీ కలుపుకొని ముందుకెళ్తున్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో నెలకొన్న రచ్చ రాజకీయాలు ఆ పార్టీకి నష్టం చేకూర్చేవిగా ఉన్నాయని స్థానిక నేతలు చెబుతున్నారు. గుంటూరుకు చెందిన నేతను అభ్యర్థిగా ఖరారు చేయడంతో స్థానిక నేతలు అసంతృప్తిలో ఉన్నారు. సీనియర్ నేతలైన మర్రి రాజశేఖర్‌తో పాటు ఇతర నాయకులు కూడా వ్యతిరేకంగానే ఉన్నారు. వారికి సీటు ఖరారు చేయక పోవడంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. మరో నేత మల్లెల రాజేష్ నాయుడు ఇప్పటికే ఆ పార్టీపై అసమ్మతి గళం విప్పారు. ఇన్ని సమస్యలను చక్కబెట్టుకొని ముందుకెళ్లడం మనోహర్‌నాయుడుకి సవాల్‌గానే మారిందని స్థానిక నేతలు చెబుతున్నారు.
నియోజక వర్గంలో సామాజిక వర్గాలు
చిలకలూరిపేట అసెంబ్లీ నియోజక వర్గంలో కమ్మ, కాపులదే హవా. రాజకీయాలను వీరే శాసిస్తుంటారు. ఈ నియోజక వర్గంలో ఎస్సీలు 21 శాతం, కమ్మ 11శాతం, ముస్లిం 14శాతం, కాపులు 11 శాతం, రెడ్డి 9శాతం, యాదవులు 8 శాతం వరకు ఉంటారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారిలో అధిక శాతం టీడీపీకే మద్దతు పలుకుతున్నారు. కాపుల్లో కూడా కాస్తా మెజారిటీ ఓటర్లు టీడీపీ వైపు, అంత కంటే తక్కువ సంఖ్యలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఎస్సీల్లో ఎక్కువ శాతం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకే మద్దతు పలికే అవకాశం ఉంది. ఇక రెడ్డి వర్గం, ముస్లిం, యాదవుల్లో అధిక శాతం వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు మద్దతు పలికే చాన్స్ ఉందని స్థానిక నేతలు చెబుతున్నారు.
మల్లెల రాజేష్ నాయుడు అసమ్మతి గళం
చిలకలూరిపేట వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు మల్లెల రాజేష్ నాయుడు అసమ్మతి గళం బహిరంగంగానే వినిపించారు. మంత్రి విడుదల రజనీ తన వద్ద రూ. 6కోట్లు తీసుకున్నారని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి చెబితే రూ. 3కోట్లు ఇప్పించారని, తక్కిన రూ. 3 కోట్లు ఇంకా ఇవ్వ లేదని ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపాయి. అంతేకాకుండా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మర్రి రాజశేఖర్‌కు చిలకలూరిపేట సీటు కేటాయిస్తే ఆయన గెలుపు కోసం కష్టపడి పనిచేస్తామని, తన డబ్బులు రూ. 3కోట్లు మర్రి రాజశేఖర్ గెలుపు కోసం ఖర్చు పెట్టుకుంటానని ఆయన చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో గందరగోళం సృష్టించాయి. అది జరిగిన మరుసటి రోజే చిలకలూరిపేట సమన్వయ కర్తగా మల్లెల రాజేష్ నాయుడుని తప్పించి ఆయన స్థానంలో గుంటూరు మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ కావటి శివనాగమనోహర్ నాయుడుని చిలకలూరిపేట అసెంబ్లీ నియోజక వర్గ అభ్యర్థిగా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఖరారు చేశారు. ఒక పక్క మల్లెల రాజేష్ నాయుడు చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిచండం, సమన్వయకర్తగా తనను పక్కన పెట్టడం, మరో పక్క మర్రి రాజశేఖర్‌కు ఆ స్థానం కేటాయించక పోడం, నాన్‌లోకల్ అయిన మనోహరనాయుడు పేరును ఖరారుచేయడంతో నెలకొన్న పరిణామల నేపథ్యంలో మల్లెల రాజేష్‌నాయుడు పంచాయతీ కాస్తా తాడేపల్లికి చేరింది. ఈ గొడవలు ఎన్నికలపై పడుతాయని భావించిన ఆ పార్టీ పెద్దలు ముఖ్యఖ్యమంత్రి కార్యాలయానికి మంగళవారం పిలిపించారు. మంత్రి విడుదల రజనీపై సీఎంకు రాజేష్ ఫిర్యాదు చేశారు. 2024 ఎన్నికల్లో చిలకలూరిపేట టికెట్ ఇప్పిసానని చెప్పి రూ. 6 కోట్లు మంత్రి విడుదల రజనీ తీసుకుందని వివరించారు. దీనికి సంబంధించిన సాక్షాలు కూడా సీఎంకు చూపించినట్లు సమాచారం. ఈ పంచాయతీలో భాగంగా నర్సరావుపేట ఎంపి అభ్యర్థి అనిల్‌కుమార్ యాదవ్ కూడా సీఎం కార్యాలయానికి వెళ్లారు. ఇలా చేస్తే ఎన్నికల్లో పార్టీకి ఇబ్బందులు తలెత్తుతాయని ఇలాంటివి చేయొద్దని పార్టీ గెలుపుకోసం పని చేయాలని రాజేష్‌నాయుడుకి చివాట్లు పెట్టినట్లు తెలిసింది.
విడుదల రజనీ హడావుడి
2019 ముందు వరకు విడుదల రజనీ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. 2019ఎన్నికల ముందు ఆమె వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో చేరారు. సీఎం జగన్ తన మంత్రివర్గంలో రెండో సారి చేపట్టిన మార్పులు చేర్పుల్లో విడుదల రజనీకి చోటు దక్కింది. అప్పటి వరకు నియోజక వర్గంలో ఆ పార్టీ సీనియర్ నేతలను కలుపుకొని పోవడం గౌరవించడం అణిగిమణిగి ఉండే వారు. మంత్రి పదవి చేతికి రావడంతో ఇక ఆమె రెచ్చి పోయారు. సీనియర్ నేతలైన మర్రి రాజశేఖర్, జాన్ సైదాలను కేర్ చేయడం మానేశారు. అంతేకాకుండా గ్రూపు రాజకీయాలకు తెర తీసారు. వాళ్లకు వ్యతిరేకంగా తనకంటూ ఒక గ్రూపు ఏర్పాటు చేసుకొని రాజకీయాలు చేయడం స్టార్ట్ చేశారు. మంత్రి విడుదల రజనీ చేస్తున్న గ్రూపు రాజకీయాలు, ఆమె వ్యవహార శైలిపై ఆ పార్టీ పెద్దలకు కూడా ఫిర్యాదులు చేశారు. రీజినల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి విచారణ చేపట్టారు. దీంతో పాటుగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి సర్వేలకు సహకరిస్తున్న ఐప్యాక్ కూడా ప్రత్యేక నివేదిక రూపొందించింది. రెండింటిలోను మంత్రి విడుదల రజనీ వ్యవహారం సరిగా లేదని తేలింది. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి మంత్రి విడుదల రజనీకి గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది. నియోజక వర్గంలోని కీలక, సీనియర్ నేతలను కలుపుకొని పోవాలని లేకుండా కఠిన, క్రమ శిక్షణ చర్యలు ఉంటాయని హెచరించడంతో ఆమె ఆదిపత్య పోరు కాస్తా సర్ధుమణిగినట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
Next Story