జనసేన టిక్కెట్ సాధించుకోవడంలోనే కాదు.. ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థులకు డబ్బులు ఇచ్చేది లేదని ఆయన శౌర్యం చూపిస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..
జి విజయ కుమార్
వైఎస్సార్‌సీపీ నుంచి ఎంపీ హోదాలో జనసేనకు జైకొట్టిన బందరు లోక్‌సభ సభ్యుడు వల్లభనేని బాలశౌరి ఇప్పుడు సంచలనాలకు కేంద్ర బిందువు అయ్యారు. దివంగత వైఎస్సార్‌కు సన్నిహితుడిగా బాలశౌరి అటుతర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోను సన్నిహితంగానే మెలిగారు. గుంటూరు జిల్లాకు చెందిన బాలశౌరి 2019 సార్వత్రిక ఎన్నికల్లో కృష్ణా జిల్లా మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గానికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అంతవరకు బాగానే ఉన్నప్పటికీ బందరు ఎమ్మెల్యే పేర్నీ వెంకట్రామయ్య(నాని) మంత్రి కావడంతో సొంత పార్టీలోనే ఆధిపత్య పోరు మొదలైంది. ఎంపీ బాలశౌరి, మంత్రి నాని మధ్య మొదలైన ఆధిపత్య తుపాను చినికి చినికి గాలి వానగా మారడానికి అనేక పరిణామాలు దోహదం చేశాయి.
బందరు పోర్టుతో వైరానికి లంగరు
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన బందరు పోర్టు నిర్మాణం కోసం కాంట్రాక్టర్‌ను తీసుకొచ్చి నేరుగా సీఎం వైఎస్ జగన్ సమక్షంలో బాలశౌరి మాట్లాడించారు. బందరు పోర్టు నిర్మాణం చేపడితే ఆ క్రెడిట్ ఎమ్మెల్యేగా తన ఖాతాలో పడాలనుకునే నానికి ఈ పరిణామం మింగుడు పడలేదు. వారి మధ్య రాజకీయ వైరానికి అక్కడే బీజం పడిందని పలువురు చర్చించుకుంటున్నారు. బందరులోని హిందూ కాలేజీ అభివృద్ధి పనుల కార్యక్రమానికి అప్పటి రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి, టీడీపీ మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణలతో మంత్రి నాని పాల్గొనడం కూడా బాలశౌరి అనుయాయులకు మింగుడు పడలేదు. సొంతపార్టీ ఎంపీని పట్టించుకోకుండా ప్రతిపక్ష పార్టీ నేతలను పిలిచి కార్యక్రమాలు నిర్వహించడంపైన బాలశౌరి అనుకూలురు పార్టీ ముఖ్య నేతలకు అప్పట్లో ఫిర్యాదులు చేశారు. అప్పటి నుంచి ఎంపీ స్థానికంగా అందుబాటులో ఉండటంలేదని కొందరు వ్యతిరేక ప్రచారానికి ఊతమిచ్చారు. దీంతో ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగింది.
సొంత కుంపట్లు..
బాలశౌరి, నాని ఇద్దరూ కూడా వేర్వేరుగానే కార్యక్రమాలు నిర్వహించడానికి తెరతీసారు. బందరు అసెంబ్లీ నియోజకవర్గంలో పరిధిలో బాలశౌరి పర్యటనకు స్థానికంగా ఉండే పార్టీ శ్రేణుల నుంచే వ్యతిరేకత వ్యక్తమవడం వంటి అనేక పరిణామాలను బాలశౌరి తీవ్రంగా పరిగణించారు. ఈ విషయాలను బాలశౌరి పలుమార్లు పార్టీ ముఖ్య నేతలకు ఫిర్యాదు చేసినా ఎటువంటి స్పందన లేకపోవడంపై కూడా ఆయన కినుక వహించినట్టు సమాచారం. చివరకు పార్టీ టిక్కెట్ల కేటాయింపు విషయంలోను బాలశౌరికి వ్యతిరేకంగా నాని ద్వయం చక్రం తిప్పినట్టు సమాచారం. బందరు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏకంగా నాలుగు నియోజకవర్గాలైన బందరు, అవనిగడ్డ, గుడివాడ, గన్నవరం ఎమ్మెల్యేలు పేర్నీ నాని, సింహాద్రి రమేష్, కొడాలి నాని, వల్లభనేని వంశీమోహన్‌లు బాలశౌరి ఎంపీ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు. దీంతో ఆయన్ను గుంటూరు ఎంపీ, రేపల్లే ఎమ్మెల్యే, అవనిగడ్డ ఎమ్మెల్యే స్థానాల్లో ఏదో ఒకటి చూసుకోవాలని వైఎస్సార్‌సీపీ ముఖ్యనేతలు సూచించినట్టు సమాచారం.
జనసేనకు జైకొట్టారు..
వైఎస్సార్‌కు విధేయుడిగా ఉండే బాలశౌరి సొంత పార్టీలో పొమ్మనకుండా పొగపెట్టడంతో ముందుగానే జనసేనకు జైకొట్టారు. అప్పుడు కూడా బందరు ఎంపీ టిక్కెట్‌పై హామీ తీసుకుని పవన్ వద్ద పార్టీ తీర్థం పుచ్చుకున్నట్టు సమాచారం. జనసేనలోను సీటు కేటాయింపు ఒక దశలో పీట ముడి పడటంతో ఆయన కినుక వహించారు. బందరు ఎంపీ సీటు కొణిదల నాగవాబు, వంగవీటి రాధ పేర్లను పరిశీలించారు. రాధా డబ్బులు ఖర్చు పెట్టేందుకు సుముఖుంగా లేనని చెప్పడం, నాగబాబు అభ్యర్థిత్వంపై వ్యతిరేకత రావడం, బాలశౌరి తనదైనశైలిలో వత్తిడి పెంచడంతో చివరకు ఆయనకే పవన్ కల్యాణ్ జై కొట్టాల్సి వచ్చింది. బందరు ఎంపీ సీటు బాలశౌరికే దక్కిది.
మా పార్టీ వాళ్లు కాదు.. డబ్బులిచ్చేది లేదు..
టిక్కెట్ ఇచ్చాక... డబ్బు ఖర్చు విషయంలో బాలశౌరితో మరో పంచాయితీ మొదలైంది. టిక్కెట్ ఇచ్చే సమయంలో దాదాపు రూ. వంద నుంచి రూ. 150 కోట్లు డిపాజిట్ చేయాలని జనసేన నేతలు చెప్పడంతో ఖర్చు విషయం మీకెందుకు టిక్కెట్ ఇవ్వడి.. డబ్బులు నేను చూసుకుంటానని బాలశౌరి ఖరాఖండిగా చెప్పినట్టు వినికిడి. అయితే సరే.. అని టిక్కెట్ ఇచ్చారు. ఇప్పుడు అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గంలో తప్పా మిగిలిన నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులు లేరు. కాబట్టి నేనెందుకు డబ్బులివ్వాలని బాలశౌరి మెలిక పెట్టినట్టు సమాచారం. గుడివాడ, గన్నవరం, పెనమలూరు, బందరు అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్ధులకు ఖర్చులకు డబ్బులివ్వకపోయినా పర్వాలేదు.. కనీసం పామర్రు, అవనిగడ్డ, పెడన అభ్యర్థులకైనా డబ్బులివ్వాలని బాలశౌరిపై వత్తిడి పెంచినట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. సీటు దక్కించుకుని.. ఇప్పుడు డబ్బులు ఇచ్చే విషయంలో బాలశౌరి భీష్మించుకుని కూర్చోవడం ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.
Next Story