
జనసైనికుల కోలాహలం ..
చిత్రాడ సభా ప్రాంగణం.. జనసైనికుల కోలాహలం
జనసైనికులు కదం తొక్కుతున్నారు. పవన్ కల్యాణ్ జిందాబాద్ నినాదాలతో చిత్రాడ మార్మోగుతోంది. ప్రసంగాలు హోరెత్తుతున్నాయి. ఇప్పటికే నాగబాబు జగన్ కు హెచ్చరికలు చేశారు.
జనసేన పార్టీ 12వ ఆవిర్భావ/విజయోత్సవ సభను కాకినాడకు సమీపంలోని చిత్రాడలో ఘనంగా ప్రారంభం అయ్యింది. ఈ కార్యక్రమానికి జనసేన కార్యకర్తలు, నేతలు, అభిమానులు పెద్దఎత్తున హాజరయ్యారు. లక్షలాదిమందితో సభా ప్రాంగణం కిటకిటలాడుతోంది. కార్యకర్తలను అదుపు చేయడం క్లిష్టతరం కావడంతో జనసేన నేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. సభికులను సైలెంట్ గా ఉండమని కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు.
లక్షలాదిగా తరలివచ్చిన కార్యకర్తల కోసం ప్రత్యేక గ్యాలరీలను పార్టీ వర్గాలు ఏర్పాటు చేశాయి. ఒక్కో గ్యాలరీలో సుమారు 2,500 మంది కూర్చొనేలా సిద్ధం చేశారు. అయినా భారీగా కార్యకర్తలు తరలిరావడంతో సభా ప్రాంగణం బయటే పెద్దఎత్తున అభిమానులు, కార్యకర్తలు నిలిచిపోయారు. కాగా, మరికొద్దిసేపట్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చిత్రాడ సభా ప్రాంగణం వద్దకు చేరుకోనున్నట్టు నాగబాబు ప్రకటించి కార్యకర్తలను బుజ్జగించే ప్రయత్నం చేశారు.
ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.."జనసేన నేతలు, కార్యకర్తలు, వీర మహిళలకు జనసేన 12వ ఆవిర్భావ శుభాకాంక్షలు. అధికారం వచ్చింది కదా అని నేతలెవరూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు. అందరూ ఒళ్లు దగ్గరపెట్టుకుని ఉండాలి. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఏం జరుగుతుందో చూశాం. నోటి దురుసు ఉన్న నేతకు ప్రతిపక్ష హోదా దక్కలేదు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లాంటి హాస్యనటుడు కలలు కంటూనే ఉంటారు. మరో 20 ఏళ్ల వరకూ కలలు కంటూనే ఉండాలని సలహా ఇస్తున్నా. రాజకీయాల్లో జాగ్రత్తగా మాట్లాడాలని పవన్ చెప్పారు. పవన్ కల్యాణ్ క్రమశిక్షణ కలిగిన నేత. 12 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు ఆయన ఎదుర్కొన్నారు. పిఠాపురంలో ఘన విజయం సాధిస్తామని పవన్‌కు ముందే తెలుసు. రాబోయే 20 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ స్వర్ణయుగం చూడబోతోంది. పదవులు వచ్చినా, రాకపోయినా ఆయనకు సేవలు చేస్తాం. ప్రజలు బాగోగులు చూసే వ్యక్తి పవన్. అడగకుండానే వరాలు ఇచ్చేది వ్యక్తి పవన్. జనసేనకు ప్రాణవాయువు కార్యకర్తలు, వీర మహిళలు. పవన్‌లా గొప్ప వ్యక్తి కావాలి.. లేకుంటే ఆయనకు అనుచరుడిగా ఉండాలని" చెప్పారు.
జన‘సేవా’ నిబద్ధత, విలువలతో కూడిన రాజకీయాలకు ప్రతీకగా కొనసాగుతోన్న జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan), పార్టీ ముఖ్య నాయకులకు, జనసైనికులకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా పవన్‌తో కలిసి ఉన్న ఫొటోను చంద్రబాబు షేర్ చేశారు.
‘‘జనసేన 12వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పవన్ కల్యాణ్ అన్నకు అభినందనలు. జనసేన నాయకులు, కార్యకర్తలకు హృదయపూర్వక శుభాకాంక్షలు. ఏపీ ఆర్థిక, సామాజిక వృద్ధికి జనసేన నిబద్ధత ప్రశంసనీయం. రాష్ట్ర పురోగతి, శ్రేయస్సులో జనసేనపాత్ర అందరికీ ఉజ్వల భవిష్యత్తును ప్రేరేపిస్తుంది’’ అని ఐటీ, విద్య, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు.
కాకినాడ జిల్లా పిఠాపురం మండలంలోని చిత్రాడలో ఏర్పాటు చేసిన జనసేన ఆవిర్భావ సభకు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ, విదేశాల నుంచి జనసైనికులు తరలి వచ్చారు. దీంతో పిఠాపురం పరిసర ప్రాంతాలు జనసంద్రంగా మారాయి.
Next Story