చిత్తూరు: మేయర్ దంపతుల హత్య కేసులో అంతిమతీర్పు..
x
చిత్తూరులో పదేళ్ల కింట హత్యకు గురైన కఠారి అనూరాధ, మోహన్.

చిత్తూరు: మేయర్ దంపతుల హత్య కేసులో అంతిమతీర్పు..

ఐదుగురికి ఉరిశిక్ష.. 70 లక్షల జరిమానా విధించిన జిల్లా అదనపు జడ్జి తీర్పు.


చిత్తూరు నగరంలో పదేళ్ల కిందట మేయర్ కఠారి అనూరాధ, ఆమె భర్త మోహన్ హత్య కేసులో శుక్రవారం దాదాపు పది సంవత్సరాల తరువాత తుది తీర్పు వెలువడింది. ఈ కేసులో ఐదుగురు నిందితులకు ఉరిశిక్ష విధిస్తూ, చిత్తూరు ఆరో అదనపు జిల్లా సెషన్స్ జడ్జి ఎన్. శ్రీనివాసరావు తీర్పు చెప్పారు. మృతులు కూతురు లావణ్య, కోడలు కఠారి అనూరాథ కుటుంబానికి 50 లక్షలు, గాయపడిన సతీష్ కుమార్ నాయుడుకు 20 లక్షల రూపాయాలు పరిహారంగా ఇవ్వాలని ప్రధాన నిందితుడు చింటూను న్యాయస్థానం ఆదేశించింది.


ఈ కేసును ప్రత్యేక ప్రాసిక్యూటర్ శైలజ బాధితుల పక్షాన వాదనలు వినిపించగా, డిఫెన్స్ తరఫున హైకోర్టు న్యాయవాది విజయచందర్ రెడ్డి తన వాదనలు వినిపించారు. తీర్పుపై హైకోర్టులో అప్పీల్ చేయనున్నట్లు హైకోర్టు న్యాయవాది విజయచందర్ రెడ్డి తెలిపారు.

పదేళ్ల పాటు సాగిన ఈ కేసు విచారణలో 80 కి పైగానే వాయిదా పడింది. 132 మంది సాక్షులు కాగా, న్యాయస్థానం 57 మందిని విచారణ చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు శ్రీరాం చంద్రశేఖర్ అలియాస్ చింటూ మేయర్ హత్యకు గురైన మేయర్ దంపతులకు స్వయానా మేనల్లుడు. హత్యకు గురైన కఠారి మోహన్ కు స్వయాన అక్క కొడుకు.
న్యాయం దక్కింది..


మేయర్ దంపతులు కఠారి అనూరాధ, మోహన్ హత్య కేసులో తుది తీర్పు వెలువడే సమయంలో వారి కూతురు లావణ్య, కోడలు హేమలత కోర్టు హాలులోనే ఉన్నారు. తీర్పు అనంతరం కోర్టు వెలుపల లావణ్య, హేమలత మాట్లాడారు.

"అంతిమంగా న్యాయం గెలిచింది. మాకు న్యాయం జరిగింది" అని వారిద్దరూ భావోద్వేగానికి లోనయ్యారు. అయినా చనిపోయిన తమ తల్లిదండ్రులను ఎవరూ తీసుకురాలేరని కఠారి లావణ్య కన్నీటి పర్యంతం అయ్యారు. కోడలు కఠారి హేమలత కూడా అత్తామామలను తలుచుకుని మీడియా ఎదుట భావోద్వేగానికి లోనయ్యారు.
ఉరిశిక్ష పడిన నిందితులు
చిత్తూరు మేయర్ అనూరాధ, ఆమె భర్త కఠారి మోహన్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వారి మేనల్లుడు చంద్రశేఖర్ అలియాస్ చింటూ, ఏ2, వెంకటా చలపవి, ఏ3 జయప్రకాష్ రెడ్డి, ఏ4 మంజూనాథ్, ఏ5 వెంకటేష్ కు ఉరిశిక్ష విధిస్తున్న జడ్జి డాక్టర్ ఎన్. శ్రీనివాసరావు తీర్పు చెప్పారు. వారిలో మూడో నిందితుడు జయప్రకాష్ రెడ్డి, నాల్గవ నిందితుడు మంజూనాథ్ పదేళ్లుగా జైల్లోనే ఉన్నారు.
వారం నుంచి భద్రత
గత నెల 24వ తేదీ తీర్పు వెలువడే సమయంలో చిత్తూరులోని ప్రత్యేక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని పోలీసులు అప్రమత్తం అయ్యారు. నగరంలో శాంతిభద్రతల సమస్య రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకునే వ్యవహారం చిత్తూరు ఎస్పీ తుషార్ డూడీ స్వయంగా పర్యవేక్షించారు.
చిత్తూరు నగర మేయర్ అనూరాథ, మోహన్ దంపతుల హత్య కేసులో శుక్రవారం ( అక్టోబర్ 31 ) తీర్పు వెలువరించిన నేపథ్యంలో పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎక్కడా పరిస్థితి అదుపు తప్పకుండా నిఘా కూడా ఏర్పాటు చేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న మరణించిన వారి ఇళ్లతో పాటు చిత్తూరు అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (CHUDA) చైర్‌పర్సన్ K. హేమలత, మాజీ ఎమ్మెల్యే CK. బాబు (సీకే జయచంద్రారెడ్డి) ఇళ్ల వద్ద ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. గత శుక్రవారం నుంచి న్యాయమూర్తి, ప్రభుత్వ న్యాయవాది తోపాటు ఫిర్యాదుదారు వేల్కూరి సతీస్ నాయుడు ఇంటి వద్ద కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
కేసు ఏమిటి?
2015 నవంబర్ 17 : చిత్తూరు నగర మేయర్ కటారి అనూరాధ ఛాంబర్ లోని సీటులో కూర్చుని ఉన్నారు. ఆమె భర్త మోహన్ కూడా అక్కడే ఉన్నారు. వారితో పాటు కొందరు టీడీపీ నేతలు కూడా ఉన్నారు. అదే సమయంలో ముసుగు ధరించిన కొందరు తుపాకులు, కత్తులతో మేయర్ చాంబర్ లోకి దూసుకుని వచ్చారు. మేయర్ అనూరాధను తుపాకీతో కాల్చడంతో ఆమె అక్కడికక్కడే మరణించారు. ఆమె భర్తను కత్తులతో వేటాడి చంపారు. దీంతో నగర పాలక సంస్థ కార్యాలయం రక్తంతో తడిసింది. ఈ ఘటన రాష్ట్రంలో సంచలనం రేకెత్తించింది. ఈ ఘటనకు పాల్పడిన వారిలో ప్రధాన నిందితుడిగా మేయర్ కఠారి అనూరాధ, మోహన్ మేనల్లుడు చింటూ అలియాస్ శ్రీరాం చంద్రశేఖర్ తోపాటు ఈ కుట్ర వెనుక 23 మందిని చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. చింటూ అలియాస్ శ్రీరాం చంద్రశేఖర్ ముంబైలోని ఇండియన్ నేవీ షిప్ (నావల్ డెక్) మెరైన్ ఇంజినీర్ గా పనిచేస్తూ, మానేశాడు.
కేసు నమోదు.. చార్జిషీట్
చిత్తూరు నగరంలో మేయర్ కటారి అనూరాధ, మోహన్ దంపతుల హత్య నేపథ్యంలో చిత్తూరు-1 పోలీస్ స్టేషన్ లో Cr.No.130/2015 కేసు నమోదు చేశారు.
2016 ఫిబ్రవరి 18వ తేదీ చార్జిషీట్ దాఖలు చేశారు. ఇందులో ఏమని పేర్కొన్నారంటే..
"2015 నవంబర్ 17వ తేదీ ఉదయం 11.45 గంటలకు నిందితులు S. చంద్రశేఖర్ (చింటూ) (A1), వెంకటచలపతి (మూలబగల్ వెంకటేష్) (A2) తుపాకులు, ప్రాణాంతకమైన ఆయుధాలతో బుర్కాలు ధరించి, మరో ముగ్గురు సహ నిందితులతో కలిసి వచ్చారు. మేయర్ కార్యాలయంలోనే అనురాధ, ఆమె భర్త కఠారి మోహన్‌ పై దాడి చేసి హత్య చేశారు. ఈ దాడి ఆస్తి, ఆర్థిక వివాదాల కారణంగా జరిగింది. ఈ కేసులో మొత్తం A1 నుంచి A23 వరకు నిందితులు వివిధ పాత్రలతో నేరానికి కుట్ర పన్నడం, నేరంలో పాల్గొనడం, ప్రధాన నిందితుడికి ఆశ్రయం ఇవ్వడం, ఆయుధాలు సరఫరా చేయడం వంటి కుట్రలో భాగస్వాములయ్యారు." అని చార్జ్ షీట్‌లో ఆరోపించారు. మేయర్ దంపతులుపై దాడి జరిగిన సమయంలో అక్కడే ఉన్న వారి ప్రధాన అనుచరుడు వేలూరి సతీష్ కుమార్ నాయుడుపై కూడా దాడి చేశారు.
రాజకీయంగా సంచలనం
చిత్తూరులో రాజకీయంగా ఎదుగుతున్న కఠారి అనూరాథ, మోహన్ దంపతులుపై వ్యక్తిగత కక్ష, ఆర్థిక విబేధాలతో దాడికి పాల్పడినట్లు పోలీసులు తేల్చారు. కేసులో దర్యాప్తు చేసిన పోలీసులు 23 మందిని నిందితులుగా చేర్చి కోర్టుకు వివరాలు సమర్పించారు. ఈ హత్య ఘటన సంచలనం రేకెత్తింది. పోలీసుల దర్యాప్తు, చార్జిషీట్ దాఖలు చేసిన నేపథ్యంలో దీర్ఘకాలం విచారణ సాగింది. హత్య వెనుక కుటుంబ, ఆర్థిక వ్యవహారాలు ఉన్నా, రాజకీయంగా ప్రాధాన్యత కలిగిన అంశం కావడం వల్ల పోలీసులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారు.
జంటహత్యల కేసు స్థితి..
చిత్తూరు నగరంలో పదేళ్ల కిందట జరిగిన మేయర్ అనూరాధ, మోహన్ దంపతలు హత్య కేసు దర్యాప్తు సుదీర్ఘకాలం సాగింది. అందులో కొందరు జైలులో ఉన్నారు. ఇంకొందరు మరణించారు. ఈ వివరాలు ఇవి.
చిత్తూరు-1 పోలీస్ స్టేషన్ లో Cr.No.130/2015 కేసులో నిందితుడిగా ఉన్న A22 కాసారం రమేష్ కేసు నుంచి విడుదలయ్యాడు. A21 శ్రీనివాస ఆచారి (ఆయుధాలు సరఫరా చేసిన వ్యక్తి) మరణించాడు. A3, A4గా ఉన్న నిందితులు చిత్తూరు జిల్లా జైలులో ఉన్నారు. హత్య కేసులో ప్రధాన నిందితులు చంద్రశేఖర్ (చింటూ) (A1), వెంకటచలపతి (ముళబాగల్ వెంకటేష్) (A2), A5, A20, A23 నిందితులు బెయిల్ పై బయట ఉన్నారని పోలీసులు వెల్లడించారు.
తుది తీర్పు..
చిత్తూరు మేయర్ కఠారి అనూరాధ, మోహన్ దంపతుల హత్య కేసు ఆరో అదనపు జిల్లా సెషన్స్ కోర్టులో విచారణ సాగింది. 23 మంది నిందితుల్లో 22వ నిందితుడు కాసారం రమేశ్ నిరపరాధిగా రుజువు చేసుకుని బయటపడ్డారు. 21వ నిందితుడు శ్రీనివాసాచారి కేసు దర్యాప్తులో ఉండగానే మరణించారు. ఈ కేసులో హత్యకు గురైన దంపతులకు మేనల్లుడు అయిన శ్రీరాం చంద్రశేఖర్ అలియాస్ చింటూ ఏ-1 నిందితుడు. హత్యకు అవసరమైన ఆయుధాలు సిద్ధం చేయడం, నిందితులకు ఆశ్రయం కల్పించడం, ధనసాయం చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. అయితే, ఆరోపణలను పోలీసులు నిరూపించలేకపోవడంతో 16 మందిని నిర్దోషులుగా ఈ నెల 24వ తేదీ ప్రకటించింది. మిగతా ఐదుగురికి జడ్జి ఎన్. శ్రీనివాసరావు ఉరి శిక్ష ఖరారు చేయడంతోపాటు కఠారి కుటుంబానికి 50 లక్షలు, గాయపడిన సతీష్ కుమార్ నాయుడుకు 20 లక్షల రూపాయాలు పరిహారంగా ఇవ్వాలని ప్రధాన నిందితుడు చింటూను న్యాయస్థానం ఆదేశించింది.
Read More
Next Story