శంకరగిరి మాన్యాలు పట్టిన శంకరయ్య సీఎం చంద్రబాబుకు నోటీసులు
x

శంకరగిరి మాన్యాలు పట్టిన శంకరయ్య సీఎం చంద్రబాబుకు నోటీసులు

1.45 కోట్ల నష్టపరిహారం చెల్లించాలంటూ తాకీదులు


సర్వీసులో ఉన్న ఓ పోలీసు అధికారి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రికి లీగల్ నోటీసు పంపవచ్చా, అటువంటి నోటీసు పంపిన తర్వాత ఆ అధికారి సర్వీసులో ఉంటాడా లేదా అనేది వేరే విషయం. కానీ ఈ అధికారి తన పరువుకు ముఖ్యమంత్రి చంద్రబాబు భంగం కలిగించాడని నోటీసు ఇచ్చారు.

ఈయన పేరు జె.శంకరయ్య. సర్కిల్ ఇనస్పెక్టర్. ప్రస్తుతం పోస్టింగు కోసం నిరీక్షిస్తున్నాడు. మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు పులివెందుల సీఐగా ఉన్నాడు. వివేకా హత్య కేసులో తన వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు దురుద్దేశపూరితంగా తప్పుడు ప్రకటనలు చేశారని ఆరోపించారు. అసెంబ్లీలో కూడా చంద్రబాబు తన పేరు ప్రస్తావించి తన పరువు తీశారని వాపోతున్నారు. తానిక సహించలేనని చెబుతూ న్యాయవాది జి.ధరణేశ్వరరెడ్డి ద్వారా ఈ నెల 18న నోటీసులు పంపారు. అవి ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. అసెంబ్లీలో తనకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని, తన ప్రతిష్ఠకు నష్టం కలిగించినందుకు రూ.1.45 కోట్ల పరిహారం చెల్లించాలని శంకరయ్య ఆ నోటీసుల్లో డిమాండ్ చేశారు.
ఈ శంకరయ్య కథేంటంటే...
చంద్రబాబు 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జె.శంకరయ్య పులివెందుల సర్కిల్ ఇనస్పెక్టర్. పులివెందులలో 2019 మార్చిలో వివేకానందరెడ్డి హత్య జరిగింది. అప్పుడు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. శంకరయ్య సమక్షంలోనే నిందితులు ఆధారాలు ధ్వంసం చేశారని, రక్తపు మరకలు కడిగేశారని చంద్రబాబు చాలాసార్లు ఆరోపించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ 2019లోనే శంకరయ్యను ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది.
ఆ సమయంలో శంకరయ్య కూడా తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, ఆయన అనుచరుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిపై నెపాన్ని నెట్టేప్రయత్నం చేశారు. ఈ విషయాల్నే సీబీఐకి వాంగ్మూలమిచ్చారు. అయితే మేజిస్ట్రేట్‌ ఎదుట వాంగ్మూలం ఇవ్వడానికి వెనుకాడారు. దీన్ని అడ్డం పెట్టుకుని తెలుగుదేశం నాయకులు శంకరయ్యపై పలు ఆరోపణలు చేశారు.
ఆ తర్వాత ప్రభుత్వం మారింది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. 2021 అక్టోబరు 6న శంకరయ్యపై సస్పెన్షన్‌ను జగన్ ప్రభుత్వం ఎత్తివేసింది. నిందితులు ప్రభావితం చేయటం వల్లే శంకరయ్య మాట మార్చారని సీబీఐ- కోర్టు దృష్టికి తీసుకొచ్చింది.
2024లో మళ్లీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక మళ్లీ శంకరయ్యను శంకరగిరి మాన్యాలు పట్టించారు. శంకరయ్య ప్రస్తుతం కర్నూలు రేంజ్‌లో వీఆర్‌లో ఉన్నారు. దీంతో ఇప్పుడాయన ఏకంగా ముఖ్యమంత్రికే లీగల్‌ నోటీసులు ఇచ్చారు.
Read More
Next Story