చంద్రబాబును సవాల్ చేసిన సీఐ శంకరయ్య ఊస్టింగ్
x
CI J Sankaraiah and YS Viveka

చంద్రబాబును సవాల్ చేసిన సీఐ శంకరయ్య ఊస్టింగ్

వైఎస్ వివేకా హత్య కేసు కొలిక్కిరాలేదు గాని సీఐ శంకరయ్య ఉద్యోగం ఊడింది.


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుణ్ణి సవాల్ చేసిన పోలీసు సర్కిల్ ఇనస్పెక్టర్ (సీఐ) జె.శంకరయ్య ఉద్యోగం ఊడింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కేసుకు సంబంధించిన వ్యవహారం ఇది. పోలీసుశాఖకు మచ్చ తెచ్చేలా ఆనాడు పులివెందులలో సీఐగా ఉన్న శంకరయ్య వ్యవహరించారని అధికారులు భావించారు. ఉద్యోగం నుంచి తొలగించారు. కర్నూలు రేంజి డీఐజీ కోయ ప్రవీణ్‌ ఈ విషయాన్ని నిన్న చెప్పారు.

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య 2019 మార్చి 15న పులివెందులలో జరిగింది. అప్పుడు శంకరయ్య సీఐగా ఉన్నారు. ఆయన కేసును తారుమారు చేసి దర్యాప్తు సంస్థలకు సరైన సమాచారం ఇవ్వకుండా తప్పుదోవ పట్టించారన్న ఆరోపణలు వచ్చాయి. హత్య జరిగినపుడు తెలుగుదేశం ప్రభుత్వమే రాష్ట్రంలో ఉంది. మర్డర్ తర్వాత మూడు నెలలకు టీడీపీ ప్రభుత్వం పోయి వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చింది. శంకరయ్యకు ప్రమోషన్ వచ్చింది. మళ్లీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక శంకరయ్యను శంకరగిరి మాన్యాలు పట్టించారు. కర్నూలు రేంజీలో ఏ పోస్టు ఇవ్వకుండా వీఆర్ లో ఉంచారు.

ఈ నేపథ్యంలో శంకరయ్య ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబుకు లీగల్ నోటీసులు ఇచ్చారు. తన పరువుకు భంగం కలిగిందని, కోటిన్నర రూపాయల పరిహారం ఇవ్వాలని నోటీసులు పంపారు. దీనిపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నన్నే సవాల్ చేస్తావా అని ఓ అసెంబ్లీలోనే మాట్లాడారు.
2025 ప్టెంబర్ 23న శంకరయ్య సీఎం నాయుడికి ఈ నోటీసు జారీ అయింది. శంకరయ్య ఆరోపణల ప్రకారం, వివేకానంద రెడ్డి హత్య తర్వాత జరిగిన పరిణామాలపై చంద్రబాబు నాయుడు “తప్పుడు ప్రచారం చేసినట్లు” ఆరోపిస్తూ నోటీసును పంపారు.
ఆవేళ సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ఏమన్నారంటే..
“2019లో నేను సీఎంగా ఉన్నప్పుడు వైఎస్ వివేకా హత్య జరిగింది. ఈ శంకరయ్య సంఘటనా స్థలంలో ఉన్నాడు. అలాంటప్పుడు నాకు ఎలా నోటీసు ఇస్తాడు ఇతడు? ఇలాంటి విషయం నేను ఎప్పుడూ చూడలేదు” అని వ్యాఖ్యానించారు.
సీఐ శంకరయ్య నోటీసులో ఏముందంటే...
నాయుడు ప్రెస్ మీట్లు, అసెంబ్లీ ప్రసంగాలు, మీడియా ద్వారా తనపై అపవాదు చేశారనేది శంకరయ్య ఆరోపణ.
ఇంకా ఏమన్నారంటే...
సంఘటనా స్థలంలో తానేదో చేశానని చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు తప్పు.
దీంతో నా ప్రతిష్ఠ దెబ్బతింది. వివేకానంద రెడ్డి హత్య కేసులో CBI తనను సాక్షిగా మాత్రమే చూపిందని, ఎప్పుడూ నిందితుడిగా పేర్కొనలేదని
, కానీ చంద్రబాబు మాత్రం తనను నిందితుడు అంటున్నారని, YSRCP ప్రభుత్వం తనను లోబర్చుకుని CBIకి తప్పుడు నివేదిక ఇచ్చేలా చేశానని అంటున్నారని, ఇది అబద్ధం అని శంకరయ్య వాదన.
దీనికి చంద్రబాబు కౌంటర్ ఇస్తూ అసెంబ్లీలో ఏమన్నారంటే... “సంఘటనా స్థలాన్ని మొదటగా కాపాడాల్సిన అధికారి ఎవరు? సీఐ కదా? అప్పుడు ఎందుకు కాపాడలేదు? నేను అప్పుడూ సీఎం… ఇప్పుడూ సీఎం. చీఫ్ మినిస్టర్‌గా సమాధానం అడుగుతున్నాను” అని అన్నారు.
శంకరయ్య తన నోటీసులో నాయుడికి మూడు డిమాండ్లు పెట్టాడు:
పబ్లిక్‌గా క్షమాపణ చెప్పాలి
తనపై తప్పుడు వ్యాఖ్యలు నిలిపేయాలి
₹1.45 కోట్లు పరిహారం చెల్లించాలి
వీటితో పాటు సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీ నియమావళిని ఉల్లంఘించి తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. తాను 29 సంవత్సరాలుగా పోలీస్ శాఖలో నిజాయితీగా సేవ చేస్తున్నానని, ఈ వ్యాఖ్యల వల్ల తన కుటుంబం తీవ్ర మానసిక ఇబ్బందులు ఎదుర్కొందని చెప్పారు.
దీనికి నాయుడు స్పందిస్తూ... “నేరస్థులతో కుమ్మక్కై నాకు నోటీసు ఇచ్చాడు. ఇది చిన్న విషయం కాదు. విచారణ CBI వద్ద ఉంది, వారు ఈ విషయాలను గమనించాలి” అని అన్నారు.
తాను నోటీసు ఇచ్చిన 15 రోజుల్లో సీఎం స్పందించకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని శంకరయ్య హెచ్చరించారు. ఆ తర్వాత సరిగ్గా 60 రోజులకు ఆయన ఉద్యోగం ఊడింది.
వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో సీఐ జె.శంకరయ్య సుమారు నాలుగున్నరేళ్లపాటు విచారణకు ఏ విధంగానూ సహకరించలేదని పోలీసులు ఉన్నతాధికారులు నిర్ధారించారు. నిందితులతో లోపాయికారీగా కుమ్మక్కై పోలీసు అధికారిగా ఆయన నిర్వర్తించాల్సిన విధులను, బాధ్యతలను నిర్వర్తించలేదని అధికారులు తేల్చారు. వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో పోలీసుశాఖకే కళంకం తెచ్చేలా ఆయన వ్యవహరించిన తీరుకు సంబంధించిన ఉదంతాలన్నింటితో సమగ్ర నివేదికను తయారు చేశారు. వాటి ఆధారంగా కర్నూలు రేంజి డీఐజీ కోయ ప్రవీణ్‌ కర్నూలు జిల్లాలోని వీఆర్‌లో ఉన్న సీఐ శంకరయ్యను విధుల నుంచి తొలగించారు. ఈ మేరకు కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు. కాగా, వివేకానందరెడ్డి హత్య కేసులో పలు ఆరోపణలు చేసి తన పరువుకు భంగం కలిగించారంటూ ఏకంగా సీఎం చంద్రబాబుకు సీఐ శంకరయ్య లీగల్‌ నోటీసు పంపించారు. 15రోజుల్లో బహిరంగ క్షమాపణ చెప్పటం లేదా వివరణ ఇవ్వకపోతే రూ.1.45 కోట్లకు పరువు నష్టం దావా వేస్తానని నోటీసులో శంకరయ్య పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో విచారణ జరిపిన పోలీసు విభాగం అధికారులు శంకరయ్యది తప్పుందని తేల్చారు. కర్నూలు రేంజి డీఐజీ కోయ ప్రవీణ్‌ ఆయన్ని ఉద్యోగం నుంచి తీసేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Read More
Next Story