తిరుపతిలో తాళ పత్ర గ్రంథాలయం సందర్శించిన చీఫ్ జస్టిస్ చంద్రచూడ్
x
తాళపత్రాలను సందర్శిస్తున్న సీజేఐ చంద్రచూడ్

తిరుపతిలో తాళ పత్ర గ్రంథాలయం సందర్శించిన చీఫ్ జస్టిస్ చంద్రచూడ్

రాతప్రతులను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సీజేఐ డీవై చంద్రచూడ్ అన్నారు. ఎస్వీ వేద విశ్వవిద్యాలయం సందర్శన నేపథ్యంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


పురాతన తాళపత్ర గ్రంథాల రక్షణను దేశవ్యాప్తంగా చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ కోరారు. రాతప్రతుల్లో(తాళపత్ర గ్రంథాలు) విజ్ఞానాన్ని భవిష్యత్ తరాలకు అందించాలని అన్నారు ఆయన. వీటిలోని విజ్ఞానం కేవలం భారతదేశ ప్రజలకే కాకుండా యావత్ మానవాళికి ఎంతో మేలు చేస్తుందని ఆయన వెల్లడించారు. డీవై చంద్రచూడ్ బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఎస్వీ వేద విశ్వవిద్యాలయంలో సందర్శన కోసం ఏర్పాటు చేసిన తాళపత్ర గ్రంథాలను ఆయన వీక్షించారు. ఈ రాత ప్రతులను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైనా ఉందని చెప్పారాయన.


ఈ తాళపత్ర గ్రంథాలను డిజిటలైజేషన్ చేయడానికి టీడీపీ, వేద విశ్వవిద్యాలయం చేస్తున్న శ్రమ అద్భుతమైనదని వారిని కొనియాడారు. ఆ రాతప్రతుల్లో.. వేల సంవత్సరాల క్రితమే ఋషులు, మహర్షులు, జ్ఞానులు ఎంతో మంది తాము సంపాదించిన విజ్ఞానాన్ని, శాస్త్ర సాంకేతిక అంశాలను నిక్షిప్త పరిచారని, ఈ జ్ఞానాన్ని భవిష్యత్ తరాలకు చేరువ చేయడం మనందరిపై ఉండే బాధ్యతని తెలిపారు. వేదవేదాంగ, ఆగమ, పురాణ, ఇతిహాస, న్యాయ, దర్శనాలకు సంబంధించిన తాళపత్రాల రక్షణ కోసం విశ్వవిద్యాలయం చేస్తున్న కృషిని ఎంత మెచ్చుకున్నా తక్కువేనన్నారు.


రాత ప్రతులను సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఈరోజు ఈ తాళపత్రాలను సందర్శించడం చాలా సంతోషంగా ఉంది పురాతనమైన రాత ప్రతులను ఇక్కడ ఎంతో జాగ్రత్తగా రక్షిస్తున్నారు. తాళపత్రాల గురించి ఈరోజు నేను ఎంతో తెలుసుకున్నాను. ఆనాటి నాగరికతలో న్యాయం ఎలా ఉండేది. న్యాయ విద్యను ఎలా అభ్యసించేవారు. ఎలా నేర్పించేవారు. ఆనాటి న్యాయశాస్త్రం లక్ష్యం ఏంటి అనే అనేక విషయాలను ఆచార్యులు వివరించగా తెలుసుకున్నాను. ఈరోజు నాకు చాలా ప్రత్యేకంగా నిలిచిపోతుంది’’ అని సంతోషం వ్యక్తం చేశారు డీవై చంద్రచూడ్.


తాళపత్రాల్లోని విజ్ఞానం ప్రపంచ శ్రేయస్సుకు దోహదపడుతుందని తాను గట్టిగా నమ్ముతున్నానని వెల్లడించారు. టీటీడీ ఇలాంటి వేద విశ్వవిద్యాలయాన్ని నడపడం, అందులో మన పురాతన సనాతన తాళపత్ర సంపదను సంరక్షించడం చాలా ఆనందం కలిగించిందని, వేదమంత్ర పఠనం వింటుంటే మనస్సు చాలా ప్రశాంతంగా, ఆనందంగా ఉంద‌ని తెలిపారు.
Read More
Next Story