ఈరోజూ కొనసాగుతున్న వర్గ పోర్లు.. టీడీపీ అభ్యర్థిపై దాడి
పోలింగ్ పూర్తయినా టీడీపీ, వైసీపీ మధ్య వర్గ పోర్లు మాత్రం పూర్తి కాలేదు. ఈరోజు కూడా పలు ప్రాంతాల్లో అల్లర్లు, ఘర్షణలు జరిగాయి.
ఎన్నికల్లో అత్యంత కీలక ఘట్టమైన పోలింగ్ దశను ఆంధ్రప్రదేశ్ నిన్న(సోమవారం) ముగించుకుంది. తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్లు కూడా భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలను తరలివచ్చారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వైసీపీ, టీడీపీ కూటమి వర్గాల మధ్య తీవ్ర ఘర్షణలు జరిగాయి. ఇరు వర్గాల అభ్యర్థులు ఎదురుపడినా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అల్లర్లు, ఘర్షణలు జరుగుతున్నట్లు సమాచారం అందిన వెంటనే అక్కడకు చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టంలో నిన్న ఆంధ్ర పోలీసులు ఫుల్ బిజీ అయిపోయారు. దానికి తగ్గట్టుగానే పోలింగ్ కూడా పేరు ఆరుగంటలకే సమయం ముగిసినా పోలింగ్ మాత్రం అర్ధరాత్రి వరకు కొనసాగాయి.
అసలు ఎంత శాతం పోలయిందంటే!
ఆరు గంటలకే పోలింగ్ సమయం ముగిసిందని కేంద్రాల గేట్లు మూసేశారు అధికారులు. కాగా అప్పటికే క్యూలో ఉన్న వారికి ఓటు వేసే వెసులుబాటు కాల్పించారు. దాంతో పలు కేంద్రాల్లో అర్ధరాత్రి ఒంటిగంట వరకు కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ఆంధ్రలో 80.05 శాతం వరకు పోలింగ్ నమోదయింది. ఇక పోస్టర్ బ్యాలెట్‌లో నమోదైన 1.25 శాతాన్ని కూడా కలుపుకుంటే ఆంధ్రలో మొత్తం 81.30శాతం పోలింగ్ నమోదయింది.
ఈరోజు కొనసాగుతున్న ఘర్షణలు
పోలింగ్ సందర్భంగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో తీవ్ర ఘర్షణలు జరిగాయి. తలలు పగిలాయి, రాళ్లు పడ్డాయి. ఆఖరికి కొన్ని చోట్ల బాంబులు కూడా పేలాయి. అయితే అవి నిన్నటితో ముగిశాయి అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. ఈరోజు కూడా వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య భీకర పోరు జరుగుతోంది. ఇవి ఎన్నికల ఫలితాలు వచ్చి, విజేత ఎవరో తేలేవరకు కొనసాగొచ్చని విశ్లేషకులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.
జమ్మలమడుగులో రాళ్లదాడి
జమ్మలమడుగులో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య నిన్న మొదలైన ఘర్షణలు ఈరోజు కూడా కొనసాగుతున్నాయి. నిన్న ఒకరిపై ఒకరు రాళ్లు కూడా రువ్వుకున్నారు. ఈరోజు కూడా వారు తీవ్ర కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. కొన్ని ప్రాంతాల్లో ఈ వర్గాల మధ్య కొట్లాటలు కూడా జరిగాయని సమాచారం. ఈ నేపథ్యంలో ఉదయం నుంచే పోలీసులు కూడా జమ్మలమడుగు అంతటా గస్తీ కాస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తన స్వగ్రామమైన నిడిజివ్వి గ్రామం నుంచి దాదాపు 30 వాహనాలలో తన శ్రేణులతో కలిసి జమ్మలమడుగు వైపు రావడానికి ప్రయత్నించారు. దీంతో ముద్దనూరులో వైసీపీ నేత ముని రాజా రెడ్డి ఇంట్లో సుధీర్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మరోవైపు మాజీ మంత్రి ఆది నారాయణ రెడ్డి కూడా తన శ్రేణులతో కలిసి ముద్దనూరుకు వెళ్లడానికి ప్రయత్నించారు. దీంతో అక్కడ పరిస్థితులు హీటెక్కాయి.
తిరుపతిలో టీడీపీ నేతపై దాడి
తిరుపతిలో టీడీపీ అభ్యర్థి పులిపర్తి నానిపై వైసీపీ శ్రేణులు రాళ్ల దాడికి పాల్పడ్డాయి. ఈ దాడుల్లో నాని గన్‌మన్ తలకు గాయమైంది. దీంతో వారికి చెదరగొట్టడానికి గన్‌మన్.. పద్మావతి యూనివర్సిటీ దగ్గర గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నాని సొమ్మసిల్లి పడిపోయారు. పద్మావలి మహిళా యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్‌లను పరిశీలించడానికిి వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే దాదాపు 150 మందికి పైగా రాడ్లు, కత్తులతో దాడికి పాల్పడ్డారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు సమచారం అందిన వెంటనే టీడీపీ శ్రేణులు వర్సిటీ ప్రాంగణానికి చేరుకున్నాయి. ప్రస్తుతం నాని స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు, అభ్యర్థులకు పోలీసులు భద్రత కల్పించాలని పార్టీ వర్గాలు కోరుతున్నాయి. ఓటమి భయంతో వైసీపీ శ్రేణులు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నాయని, వారిని పోలీసులు నియంత్రించాలని టీడీపీ శ్రేణులు కోరుతున్నాయి. ఇలా మరిన్ని ఇతర ప్రాంతాల్లో కూడా ఇరు వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. వాదంపల్లిలో నీళ్లు పట్టుకునే విషక్ష్ంలో కూడా ఇరు వర్గాల మధ్య గొడవలు చెలరేగాయి. వాదంపల్లి గ్రామానికి వైసీపీ నేతలు నీటి ట్యాంకర్ల సరఫరా చేస్తున్నారు. వాటిని టీడీపీ వర్గాలు అడ్డుకున్నాయి. దీంతో గ్రామంలో ఇరువర్గాలు పరస్పరం రాళ్ల దాడులకు పాల్పడుతున్నాయి. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.