కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైన సందర్భంగా ఎన్డీఏ సమావేశం జరిగింది. సీఎం, అధికారుల్లో మందగొండి తనం వచ్చేసిందని, అంకుశం పెట్టి గుచ్చాలని పవన్‌ కళ్యాణ్‌ అన్నారు.


కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైన సందర్భంగా మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌ సెంటర్‌లో ఎన్డీఏ శాసన సభాపక్షం సమావేశం నిర్వహించారు. దీనికి మూడు పార్టీల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ను, పవన్‌ కళ్యాణ్‌ చంద్రబాబును పరస్పరం పొగడ్తలతో ముంచెత్తుకున్నారు. ఈ సందర్భంగా ఇది మంచి ప్రభుత్వమనే క్యాంపెయినింగ్‌ను ప్రారంభించారు. అటు కేంద్రంలో కానీ, ఇటు రాష్ట్రంలో కానీ ప్రజా ప్రభుత్వాలు ఉన్నాయి, ప్రజల కోసం పని చేస్తున్నయి, ఒక గుడ్‌ గవర్నెన్స్‌ ఇస్తుందనే టైటిల్‌ పెట్టి రెండు ప్రభుత్వాలు చేస్తున్న పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు.

సీఎం చంద్రబాబు మాట్లాడుతూ తనను అరెస్టు చేసిన రోజున పవన్‌ కళ్యాణ్‌ ఫ్లైట్‌ను క్యాన్సిల్‌ చేశారు. ఎంత పట్టుదల ఉంటుందంటే ఫ్లై క్యాన్సిల్‌ చేస్తే నేరుగా బై రోడ్డు వచ్చారు. రోడ్డు మార్గంలో వస్తుంటే నందిగామ వద్ద పవన్‌ కళ్యాణ్‌ను అడ్డగించారు. రోడ్డును బ్లాక్‌ చేశారు. పక్కన రోడ్డులో వచ్చేందుకు ప్రత్నించారు. కానీ దానిని గత ప్రభుత్వం అడ్డుకుంది. కానీ పవన్‌ కళ్యాణ్‌ అంతటితో ఆగ లేదు. రోడ్డుపైన ధర్నా చేశారు. సహజంగా సినిమా వాళ్లు అలా చేయరు. సినిమా వాళ్లు ఇలా చేయాల్సి వస్తే సినిమా షూటింగ్‌లో చేస్తారు తప్ప నిజ జీవితం చేయరు అని సీఎం చంద్రబాబు మాట్లాడుతుంటే డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. అలాంటి నిజ జీవితంలో పోరాట యోధుడిగా నిలబడిన మిత్రుడు పవన్‌ కళ్యాణ్‌ అని చంద్రబాబు అంటుండగా ఎమ్మెల్యేలు, మంత్రులంతా చప్పట్లు కొట్టారు.
రాజకీయాల్లో ఒక ఆశయం కోసం పవన్‌ కళ్యాణ్‌ వచ్చారన్నారు. 2014లో టీడీపీ, బీజేపీ పొత్తు పెట్టుకుంది. ఆ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎన్డీఏ గెలవాలి అని, పోటే చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుంది కాబట్టి, అది చీల కూడదలని నిర్ణయం తీసుకొని పోటీ చేయకుండా ఎన్డీఏను గెలిపించేందుకు పవన్‌ కళ్యాణ్‌ కృషి చేశారని, దీనిని ఎన్నటికీ మరచిపోనన్నారు. తాను జైల్లో ఉన్నప్పుడు పవన్‌ కళ్యాణ్‌ జైలుకు వచ్చారన్నారు. రాజకీయ పరిణామాలన్నీ మాట్లాడుకున్న తర్వాత బయటకెళ్లి వాటి గురించి ధైర్యంగా పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడరని అన్నారు. కష్ట కాలంలో ఉన్నప్పుడు ఏ మాత్రం ఆలోచించకుండా జనసేన, టీడీపీలు కలిసి పోటీ చేస్తాయని చెప్పిన వ్యక్తి పవన్‌ కళ్యాణ్‌ అని అన్నారు. వాస్తవంగా అప్పటికీ ఇంకా బీజేపీతో పొత్తు ఖరారు కాలేదన్నారు. మళ్లా అక్కడ ఒక మాట చెప్పారని, బీజేపీతో పొత్తు ఉంది, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడానికి వీల్లేదు, జనసేన మాత్రం టీడీపీతో ఉంటుంది, బీజేపీని కూడా ఒప్పించి అలయన్స్‌లోకి తెస్తామని చెప్పిన వ్యక్తి పవన్‌ కళ్యాణ్‌ అని పొగడ్తలతో ముంచెత్తారు. ఎన్నికల్లో గెలవాలి, రాష్ట్రాన్ని పునర్‌నిర్మాణం చేయాలని కలిసి ఆలోచేశామన్నారు. సీట్ల విషయంలో కానీ, మీటింగ్‌ల విషయంలో కానీ ఎక్కడా చిన్న కమ్యునికేషన్‌ గ్యాప్‌ లేకుండా పని చేశామన్నారు. ఈ సందర్భంగా బీజేపీని, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిని కూడా అభినందిస్తున్నట్లు చెప్పారు. టీడీపీ, జనసేన, బీజేపీ అలయన్స్‌ రావడానికి పురందేశ్వరి కూడా కృషి చేశారని అన్నారు. వేరే వాళ్లు బీజేపీకి అధ్యక్షులుగా ఉండి ఉంటే ఏమయ్యేదో తెలియదు కానీ పురందేశ్వరి మాత్రం పొత్తుల కోసం కృషి చేశారని అన్నారు. కేంద్ర నాయకత్వం కూడా తాను, పవన్‌ కళ్యాణ్‌ ఒక అగ్రిమెంట్‌కు వచ్చామన్నారు. సీట్ల సర్థుబాట్లపై ప్రెస్‌ మీట్‌లో చెప్పామన్నారు. పొత్తుల గురించి కేంద్రం వద్దకు వెళ్లామన్నారు. అందరు కలిసి పోటీ చేస్తే బాగుంటుందని అమిత్‌ షా, నడ్డాలు చెప్పారన్నారు.
ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ ఇన్సి సంవత్సరాలైన చంద్రబాబు ఓపిక తనను ఆశ్చర్య పరుస్తుందన్నారు. ఆయన మనసు, మైండ్‌ నిరంతరం పని చేస్తూనే ఉంటుందన్నారు. అంత ఓపిక ఎక్కడ నుంచి వస్తుందని ఆశ్చర్యం వేస్తుందన్నారు. శారీరకంగా ఈ వయసులో ఆయన పడుతున్న కష్టం పాతికేళ్ల యువకుడు కూడా కష్టపడలేడన్నారు. మంచి మేధస్సుతో నలుగుతూ, శరీరాన్ని కూడా అంత కష్టపెట్టడం అంటే నిజంగా హాట్సాఫ్‌ అన్నారు. బాధ్యత కలిగిన వ్యక్తి ఎలా ఉంటారో వరదల్లో చంద్రబాబు చూపించారని పొగడ్తల వర్షం కురిపించారు. అధికార యంత్రాంగంలో మందగొండి తనం వచ్చేసిందని, దీంతో ముఖ్యమంత్రే స్వయంగా రంగంలోకి దిగాల్సి వచ్చిందన్నారు. అధికార యంత్రాంగాన్ని అంకుశంతో గుచ్చాలన్నారు. అలా గుచ్చడానికే వరదల్లో ఆయనే స్వయంగా రంగంలోకి దిగారన్నారు. వరదల సహాయక చర్యల్లో వైసీపీకి బాధ్యత లేదా అన్నారు. కష్టాల్లో కలిసికట్టుగా పని చేయాలన్నారు. వరదల్లో చంద్రబాబు పడిన కష్టం తన గుండెను చెమర్చిందన్నారు. ప్రభుత్వాన్ని నడిపే అధినేత ఎలా ఉండాలో వరదల సయమంలో చూపించారని, దీని వల్ల తాను ఎంతో స్పూర్తి పొందానన్నారు. రాష్ట్రం బాగుండాలన్నదే తమ ఇద్దరి ముఖ్య లక్ష్యమని, దాని కోసం ఎన్నో అవరోధాలను, ఆటు పోటులను ఎదుర్కొన్నామని, మూడు పార్టీల సమిష్టి కృష్టితో అద్బుత విజయం సాధించామన్నారు.
Next Story