అమరావతి బ్రాండ్ అంబాసిడర్ గా మెడికో వైష్ణవి
అమరావతి, పోలవరం నిర్మాణం కోసం మెడికో విద్యార్థి అంబుల వైష్ణవి భారీ విరాళం అందించారు. ఆమెను అమరావతి అంబాసిడర్‌గా నియమించినట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన నూతన ప్రభుత్వం.. అమరావతి, రాష్ట్ర జీవనాడి లాంటి ప్రాజెక్ట్ పోలవరంపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఇప్పటికే సంబంధిత శాఖ మంత్రులు కూడా ఆ అంశాలకు సంబంధించి ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేశారు. కేంద్రం నుంచి నిధులు సేకరించడానికి కూడా ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఓ మెడికో విద్యార్థిని భారీ విరాళం అందించి శభాష్ అనిపించుకున్నారు.
ఏలూరు జిల్లా ముదినేపల్లికి చెందిన అంబుల వైష్ణవి అనే వైద్య విద్యార్థిని శనివారం ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నాయుడు నివాసానికి తండ్రితో కలిసి వెళ్లి స్వయంగా సీఎంకు తన తరపున భారీ మొత్తంలో విరాళం అందించారు. అమరావతి కోసం రూ.25 లక్షల, పోలవరం ప్రాజెక్ట్ రూ.1 లక్ష చొప్పున విరాళం అందించింది. ఆమె అందించిన ఈ విరాళాన్ని స్వీకరించిన చంద్రబాబు.. ఆమెపై ప్రశంసలు కురిపించారు. వైష్ణవి స్ఫూర్తిని కొనియాడారు.
పొలం అమ్మి విరాళం
తమకు ఉన్న మూడు ఎకరాల్లో ఒక ఎకరం పొలాన్ని అమ్మగా వచ్చిన రూ.25 లక్షలను అమరావతికి, తన బంగారు గాజులను అమ్మగా వచ్చిన లక్ష రూపాయలను పోలవరం ప్రాజెక్ట్ విరాళంగా ఇచ్చినట్లు వైష్ణవి తెలిపారు. ఈ మేరకు మొత్తం రూ.26 లక్షల చెక్‌ను వైష్ణవి.. సీఎం చంద్రబాబుకు అందించారు. ‘‘రాజధానిని నిర్మిద్దాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం అనే ఆలోచనతో ముందుకు సాగుతున్న ప్రభుత్వానికి నావంతుగా ఈ విరాళం అందిస్తున్నాను’’ అని వివరించారు వైష్ణవి.
బ్రాండ్ అంబాసిడర్‌గా వైష్ణవి
తండ్రి సహకారంతో రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కల కోసం వైష్ణవి విరాళం ఇవ్వడం ఎంతో గొప్ప విషయం అని సీఎం చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. ‘‘వైష్ణవి లాంటి యువత కలలను మా ప్రభుత్వం నెరవేరుస్తుంది. ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఇంత చిన్న వయసులో ఇంత గొప్ప మనసు చాటిన వైష్ణవిని అమరావతి అంబాసిడర్‌గా నియమిస్తున్నాం’’అని వెల్లడించారు బాబు. అంతేకాకుండా వైష్ణవిని శాలువా కప్పి సత్కరించారు. వైష్ణవి విజయవాడలోని ఓ మెడికల్ కాలేజ్ లో ప్రస్తుతం ఎంబిబిఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. ఈ సందర్భంగా వైష్ణవితో పాటు, ఆమె తండ్రి అంబుల మనోజ్‌ను సిఎం చంద్రబాబు అభినందించారు.