‘ఇక సహించేది లేదు’.. అధికారులకు సీఎం స్ట్రాంగ్ వార్నింగ్
x

‘ఇక సహించేది లేదు’.. అధికారులకు సీఎం స్ట్రాంగ్ వార్నింగ్

విజయవాడ సహాయక చర్యల్లో జరుగుతున్న జాప్యంపై సీఎం చంద్రబాబు మరోసారి ఫోకస్ చేశారు. ఇప్పటికే బాధితుల అన్ని సమస్యలను పరిష్కరించడానికి అన్ని విధాలుగా చర్యలు చేపడుతున్నామన్నారు.


విజయవాడ సహాయక చర్యల్లో జరుగుతున్న జాప్యంపై సీఎం చంద్రబాబు మరోసారి ఫోకస్ చేశారు. ఇప్పటికే బాధితుల అన్ని సమస్యలను పరిష్కరించడానికి అన్ని విధాలుగా చర్యలు చేపడుతున్నామన్నారు. బాధితులకు ఎటువంటి కష్టం రాకుండా చూసుకోవడానికి అహర్నిశలు శ్రమిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఆహారం, తాగునీరు, ఔషధాలు అందడంలేదని ఫిర్యాదులు అందుతున్నాయని, మరికొన్ని ప్రాంతాల్లో ఆహారం వంటి నిత్యావసరాలు అందడం తీవ్రంగా ఆలస్యం అవుతున్నట్లు కూడా సమాచారం అందుతున్నట్లు గుర్తు చేశారు. ఈ విషయంపై ఇప్పటికే అధికారులకు రెండుసార్లు హెచ్చరించామని, ఇక సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ఇంకోసారి ఇలాంటి ఫిర్యాదులు అందినా, తమ వద్దకు సమాచారం వచ్చినా సదరు అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని, చర్యల విషయంలో ఏమాత్రం వెనకడుగు వేసేది లేదంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే ఈ ఫిర్యాదులు, జాప్యం చేస్తున్న అధికారులకు సంబంధించిన సమాచారం సేకరిస్తున్నట్లు వెల్లడించారు. చిట్టచివరి బాధితుడికి సైతం సాయం అందాలని అధికారులకు స్పష్టం చేశారు. నగరంలోని ప్రతి డివిజన్‌కు ఒకరి చొప్పున మొత్తం 32 మంది ఐఏఎస్ అధికారులు సహాయక చర్యల్లో ఉన్నారని వెల్లడించారు.

బాధలు వర్ణణాతీతం..

‘‘వరదలతో పేదలు తీవ్ర బాధలు ఎదుర్కొంటున్నారు. వారి బాధలు వర్ణణాతీతం. ఇళ్లలోకి పాములు, తేళ్లు కూడా వచ్చాయి. వారి పరిస్థితులు తలచుకుంటే బాధగా ఉంది. అధికారులంతా ఏదో విధులు నిర్వర్తిస్తున్నట్లు కాకుండా మానవతా దృక్పథంతో పనిచేయాలి. అందుతున్న సహాయంపై ఐవీఆర్ఎస్‌ నిర్వహిస్తున్నాం. కొన్ని ప్రాంతాలకు ఇంకా ఆహారం అందలేదన్న ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. ఆహారం అందని బాధితులకు సంబంధించిన నెంబర్లను అధికారులకు అందిస్తున్నాం. ఇబ్బందులపై ప్రజలు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలి. నేను కూడా ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నా. అధికారులకు రెండు రోజులుగా చెప్పాం. ఇప్పటికి కూడా ఫిర్యాదులు అందితే కఠిన చర్యలు తప్పవు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు అందినంత సాయం అందించాలి. శక్తివంచన లేకుండా సేవలు అందించాలి’’ అని ఆయన వివరించారు.

కుట్రలు, రాజకీయాలు వద్దు

‘‘ఇటువంటి విపత్కర సమయంలో కూడా కొందరు కుట్రలు, రాజకీయాలకే పెద్దపీట వేస్తున్నారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారిని ఆదుకోవడమే పరమావధిగా పనిచేయాలి. ఇలాంటి సమయంలో చెత్త రాజకీయాలు వద్దు. ఈ పరిస్థితుల్లో గుడ్లవల్లేరు ఘటనపై ఫోకస్ చేస్తారా? ప్రకాశం బ్యారేజీలో బోట్ల ఘటనపై విచారణ చేపడతాం. ఇటీవల కొన్ని ఘటనలు అనుమానాస్పదంగా ఉన్నాయి. బాబాయ్‌నే చంపిన వారు ఉన్నప్పుడు అునమానాలు వస్తాయి కదా! విపక్ష నేత ఏదో ఐదు నిమిషాలు వచ్చి షో చేసి వెళ్లిపోయారు. ఒక్కరికైనా ఆహార పొట్లం ఇచ్చారా? వారి కష్టాలనైనా తెలుసుకున్నారా. కొందరిని మాత్రమే సెలక్ట్ చేసుకుని కలిశారు’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రతి ఒక్కరూ వీలైనంత సాయం చేయండి..

విజయవాడలో నిర్వహిస్తున్న సహాయక చర్యలను మరింత ముమ్మరం చేసే దిశగా సీఎం చంద్రబాబు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందులో ప్రతి ఒక్కరూ భాగం కావాలని, వరద బాధితులను ఆదుకోవడానికి మంచి మనసుతో ముందుకు రావాలని, సీఎం రిలీఫ్ ఫండ్‌కు తోచినంత సహాయం అందించాలని పిలుపునిచ్చారు. సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందించే ప్రతి రూపాయిని పూర్తి బాధ్యతతో ఖర్చు చేస్తామని చెప్పారు. అదే విధంగా వరద బాధితులకు సాయం చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలని, కేవలం డబ్బు రూపానే కాకుండా తోచిన విధంగా సహాయం అందించాలని కోరారు. స్వచ్ఛంద ఆహారం ఇవ్వదలచిన దాతల కోసం ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రత్యేక పాయింట్‌ను ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఆహార దాతలను కో-ఆర్డినేట్ చేసుకునే బాధ్యతను ఐఏఎస్ అధికారి మనజీవర్‌కు అప్పగించామని, దాతలు మరింత సమాచారం కోసం 7906796105 నెంబర్‌ను సంప్రదించగలరని ప్రకటించారు.

Read More
Next Story