ఉన్నతాధికారులతో సీఎం భేటీ.. ఆరాలు తీస్తున్న డిప్యూటీ సీఎం
సీఎం, డిప్యూటీ సీఎంలు వరుస సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. అన్ని శాఖల స్థితిగతులపై ఆరా తీస్తున్నారు. రాష్ట్రంలో జరిగిన దారుణాలపై సంబంధిత అధికారులను నిలదీస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌ను తిరిగి గాడిలో పెట్టడానికి సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్ కృషి చేస్తున్నారు. ప్రతి రోజు పలు శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈరోజు సీఎం చంద్రబాబు.. వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహిస్తున్నారు. పలు కీలక అంశాలపై రివ్యూలు చేపడుతున్నారు. ఈ సమావేశాల్లో మంత్రులు నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఇసుక, రోడ్లు, నిత్యావసరాల ధరల నియంత్రణ వంటి అంశాలపై చంద్రబాబు తన తొలి సమీక్ష సమావేశంలో చర్చించారు.
కొత్త ఇసుక విధానం దిశగా బాబు ఆలోచనలు
ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఇసుక విధానంలో చేపట్టాల్సిన మార్పులపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. ఈమార్పులపై అధికారుల అభిప్రాయాలు సేకరించారు. గత ప్రభుత్వంలో ఇసుక మాఫియా విచ్చలవిడిగా ఉందని, పెద్దిరెద్ద ఆధ్వర్యంలో ఈ ఇసుక దందా జోరుగా సాగిందని గతంలో టీడీపీ ఆరోపణలు చేసింది. ఇప్పుడు అవే అంశాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇసుక విధానంలో కీలక మార్పులు తీసుకురావాలని చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం యోచిస్తోంది. ఎటువంటి మార్పులు తీసుకురావాలని, ధరలు ఎలా ఉన్నాయి? ఇసుక చెల్లింపులు ఎలా చేపట్టాలి? అన్న పలు అంశాలపై చంద్రబాబు చర్చించారు. దీంతో ఆయన రాష్ట్రంలో కొత్త ఇసుక విధానం తీసుకొచ్చేలా చంద్రబాబు యోచిస్తున్నారు.
గందరగోళంగా రోడ్లు
వర్షాకాలం వస్తున్న నేపథ్యంలో అధికారులు రాష్ట్రంలోని రోడ్లపై కూడా దృష్టి సారించాలని సీఎం చంద్రబాబు సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని రోడ్లు గందరగోళంగా, అస్తవ్యస్తంగా ఉన్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేక ప్రాంతాల్లో రోడ్లను తవ్వి వదేలేశారని, వాటికి మోక్షం ఎప్పుడు వస్తుందో కూడా తెలిదని ప్రజలు వాపోతున్నారన్న అంశాన్ని కూడా చంద్రబాబు లేవనెత్తారు. వర్షాకాలం ప్రారంభానికి మరెన్నో రోజుల సమయం లేనందున అధికారులు అంతా కూడా ప్రస్తుతం ఉన్న రోడ్ల మరమ్మతులపై దృష్టి సారించాలని చంద్రబాబు ఆదేశించారు.
దేన్నీ వదలని పవన్
ఈ క్రమంలోనే కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఈరోజు అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పంచాయతీరాజ్ అధికారులతో చర్చించిన పవన్.. గత ఐదేళ్లలో ప్రభుత్వ ప్రోత్సహాకాలు ఏంటని అడిగి తెలుసుకున్నారు. మహిళా సమాఖ్యలు, స్వయం సహాయక సంఘాలకు అందిన ప్రోత్సాహకాలు ఏంటని అధికారులను అడిని అన్ని వివరాలు తీసుకున్నారు. అంతేకాకుండా పెట్టుబడి నిధి, వడ్డీ రాయితీల నిష్పత్తి ఎలా ఉందని ప్రశ్నించారు. గ్రామాల్లో ఖర్చు పెడుతున్న నిధులకు సంబంధించి కూడా ప్రశ్నించి అధికారులకు ముచ్చెమటలు పట్టించారు డిప్యూటీ సీఎం. ఏ చిన్న అంశాన్ని కూడా వదలకుండా సమగ్ర సమాచారం ఇవ్వాలని ఆదేశించారు.
తాగునీటి పరిస్థితి ఏంటి
ఇందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా తాగునీటి సరఫరా కోసం గత ఐదేళ్లలో ఎంత ఖర్చు చేశారని కూడా పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. అన్ని గ్రామాలకు తాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని, వీటిని యుద్దప్రాతిపదికిన పూర్తి చేసి తాగునీటి కష్టాలను తీర్చాలని ఆదేశించారు. దానికి కావాల్సిన కార్యాచరణను వెంటనే సిద్ధం చేసి అమలు చేయాలని కూడా ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా తాగునీటి సౌకర్యం ఎలా ఉందన్న అంశంపై ఆర్ డబ్ల్యూఎస్ శాఖ అధికారులతో చర్చించారు. దాంతో పాటుగా వారితో పీడబ్ల్యూఎస్ పథకాల అమలు, గ్రామీణ స్థాయిలో మంచినీటి పరీక్షలు, మంచినీటి ట్యాంకుల కో-ఆర్డినేషన్, జలజీవన్ మిషన్ పనులు వంటి అంశాలపై క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకుని నివేదిక సిద్ధం చేయాలని చెప్పారు.
అటవీ శాఖతోనూ చర్చ
ఇందులో భాగంగానే అటవీ శాఖ అధికారులతో కూడా పవన్ కల్యాణ్ చర్చ నిర్వహించారు. కాకినాడలో మడ అడవులను ధ్వంసం చేస్తున్న అధికారులు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని నిలదీశారు. 90 ఎకరాల్లో ఉండాల్సిన మడ అడవుల్లో 58 ఎకరాలు కబ్జా చేసి లేఅవుట్‌గా మర్చేస్తే మీకు సంబంధం లేదా? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను కూడా పట్టించుకోరా? అంటూ మండిపడ్డారు. అధికారులు ప్రభుత్వం మెచ్చుకోలుతనం, ప్రభుత్వ నాయకుల కోసం పని చేయకూడదని, ప్రజల శ్రేయస్సు కోసం పనిచేయాలని హితవు పలికారు. కోరింగ అభయారణ్యంలో సారా తయారీ జరుగుతుందని సమాచారం ఉంది. అసాంఘిక కార్యకలాపాలు జరిగితే జీవరాశుల మనుగడకు ప్రమాదం కాదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్ కల్యాణ్.