అన్నీ సిద్ధం చేయాలి.. అధికారులకు సీఎం ఆదేశాలు
x

అన్నీ సిద్ధం చేయాలి.. అధికారులకు సీఎం ఆదేశాలు

వరదలు ముంచెత్తుతున్న విజయవాడలోని పరిస్థితులను సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అధికారులను అడిగి అక్కడి పరిస్థితులను తెలుసుకుంటున్నారు.


వరదలు ముంచెత్తుతున్న విజయవాడలోని పరిస్థితులను సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అధికారులను అడిగి అక్కడి పరిస్థితులను తెలుసుకుంటున్నారు. అంతేకాకుండా అక్కడ తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇప్పటికే ఒకసారి బోటులో వెళ్లిన ప్రజలకు అందుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించిన చంద్రబాబు.. ఈరోజు మరోసారి అక్కడి పరిస్థితులను స్వయంగా వెళ్లి పరిశీలించనున్నారు. ఆయన వరద ప్రభావిత ప్రాంతాల పర్యటన క్షేత్రస్థాయిలో జరగనుంది. పునరావాస కేంద్రాలను కూడా పరిశీలించనున్నారు సీఎం చంద్రబాబు. సింగ్‌నగర్ ప్రాంతాన్ని బోటులో వెళ్లి పర్యవేక్షించారు. పలు ఇంతర ప్రాంతాల్లో కూడా పర్యటించిన అనంతరం ఆయన సెక్రటేరియట్‌లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఇప్పటికే ఉదయాన్నే ఆయన ఒకసారి పరిస్థితులపై అధికారులతో మాట్లాడారు. వారికి పలు సూచనలు కూడా చేశారు. ఆహార పంపిణీ, పునరావాస కేంద్రాల్లోని సౌకర్యాలు, జరిగిన నష్టం వంటి పలు అంశాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

కేంద్రాలు సిద్ధం చేయండి..

ప్రజలను కాపాడే విషయంలో ప్రయత్నాలు ఎక్కడా ఆగకూడదని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఒక్క రాత్రి ధైర్యంగా ఉండాలని, మరుసటి రోజు ఉదయాన్ని వారికి అండగా ప్రభుత్వం ఉంటుందని ప్రజలకు హామీ ఇచ్చానని, దానిని నిలబెట్టుకునే సమయం వచ్చిందని సీఎం వ్యాఖ్యానించారు. ఆ దిశగా చర్యలు చేపడుతున్నామని, యంత్రాంగం కూడా ఆ దిశగా పనిచేయాలని తెలిపారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఎంత మంది ప్రాణాలను మనం కాపాడగలిగాము అన్నదే ముఖ్యమని, బోట్లు కూడా కొట్టుకుపోతున్న క్రమంలో మన మందు అనేక సవాళ్లు ఉన్నాయని ఆయన చెప్పారు. బొట్లలో వచ్చిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి బస్సులు సిద్ధంగా ఉన్నాయని, అవసరమైతే వృద్ధులు, రోగులకు ఇబ్బంది లేకుండా వారిని హోటళ్లలోనే ఉంచాలని ఆదేశించారు. బాధితుల కోసం కల్యాణ మండపాలు, ఇతర కేంద్రాలు సిద్ధం చేయాలని, మొత్తం 47 కేంద్రాలను గుర్తించామని అధికారులు వివరించారు.

బోట్ల మ్యాపింగ్ జరగాలి

హెలికాప్టర్లను కూడా వినియోగించుకుని సహాయక చర్యలను మరింత ప్రభావవంతంగా చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ‘‘బాధితులకు మూడు పూటల ఆహారం అందించాలి. చిన్నారులు, గర్భిణులను పునరావాస కేంద్రాలకు తరలించాలి. బోట్లు ఎక్కడెక్కడ తిరుగుతున్నాయో హెలికాప్టర్ల సహాయంతో మ్యాపింగ్ చేయాలి. ఒకే ప్రాంతంలో కాకుండా బోట్లను మారుమూల ప్రాంతాలకు కూడా తీసుకెళ్లాలి. మధ్యాహ్నం సమయానికి కొంత మేరకు వరద ప్రభావం తగ్గొచ్చని అంచనా. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్న భరోసా కల్పించాలి’’ అని వివరించారు. వరద ముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు కాలినడకన పర్యటించారు. కృష్ణలంక, జక్కంపూడి ప్రాంతాల్లో పర్యటించి అక్కడి పరిస్థితులను, చేపడుతున్న చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. దాంతో పాటుగా ప్రకాశం బ్యారేజీ దిగువన వరద పరిస్థితిని పరిశీలించారు. లోతట్టు ప్రాంతాల ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు సీఎం చంద్రబాబు.

432 రైళ్లు రద్దు

భారీ వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు దాదాపు 432 రైళ్లు రద్దు అయ్యాయి. ఈ మేరకు విషయాన్ని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. దీంతో పాటుగా మరో 140కి పైగా రైళ్లను దారి మళ్ళించడం జరిగిందని, మరో 13 రైళ్లను పాక్షికంగా రద్దు చేయడం జరిగిందని వెల్లడించింది. రద్దయిన వాటిలో ఎక్స్‌ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లు కూడా ఉన్నాయని వెల్లడించింది రైల్వే శాఖ. పలు ప్యాసింజర్ రైళ్లను కూడా రద్దు చేశామని, ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని రైల్వే అధికారులు వివరించారు.

విద్యుత్‌కు అంతరాయం లేకుండా..

ఈ వరద పరిస్థితుల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని విద్యుత్ శాఖ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఎక్కడైనా విద్యుత్ లేకుంటే తమకు సమాచారం అందించాలని, వెంటనే అక్కడకు చేరుకుని మరమ్మతు చర్యలు చేపడతామని అధికారులు వెల్లడించారు. భారీ వర్షాలు, వరదలతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో, సరఫరాను పునరుద్ధరించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. కంట్రోల్‌ రూమ్‌ల ద్వారా విద్యుత్‌ సరఫరా తీరును సమీక్షిస్తున్నామని ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ తెలిపారు. కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేశారు.. వినియోగదారులకు అసౌకర్యం కలిగితే.. 1912 టోల్‌ ఫ్రీ నంబరుకు ఫోన్‌ చేయాలని, విద్యుత్‌ సిబ్బంది వెంటనే స్పందిస్తారని తెలిపారు.

Read More
Next Story