మళ్లీ సోమవారం పోలవరం కార్యక్రమానికి సీఎం చంద్రబాబు తెరతీశారు. గతంలో ప్రతీ సోమవారం దీనిపైన సమీక్షలు నిర్వహించి రికార్డు సృష్టించారు.
ఆంధ్రప్రదేశ్‌కు జీవ నాడి అయిన పోలవరం ప్రాజెక్టు కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణ పనులను 2025 జనవరి 2 నుంచి ప్రారంభిస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. పోలవరం ప్రాజెక్టును 2026 అక్టోబరు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. 2025 డిసెంబరు నాటికి డయాఫ్రం వాల్ పూర్తి చేస్తామని, ఆ మేరకు పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే 7.20లక్షల ఎకరాల కొత్త ఆయకట్ట అందుబాటులోకి వస్తుందన్నారు. విశాఖ పారిశ్రామిక అవసరాలతో పాటు తాగు నీటికి 23 టీఎంసీలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఈ ప్రాజెక్టుకు 50లక్షల క్యూసెక్కుల నీటిని డిశ్చార్జ్ చేసే సామర్థ్యం ఉందన్నారు. అత్యంత ఎల్తైన స్పిల్ వే గేట్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం పోలవరం ప్రాజెక్టు పర్యటన చేపట్టారు. సోమవారం ఉదయం అక్కడికి చేరుకున్న ప్రాజెక్టు వద్ద సుడిగాలి పర్యటన చేశారు. హెలికాప్టర్‌లో పోలవరం చేరుకున్న సీఎం తొలుత విహంగ వీక్షణం చేశారు. అనంతరం ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు, ఆ శాఖ అధికారులతో వ్యూ పాయింట్‌కు వెళ్లారు. ప్రాజెక్టు గ్యాప్1 పనులను పరిశీలించిన తర్వాత ఫొటో ప్రదర్శనను తిలకించారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా వెళ్లి పనులను పరిశీలించారు. డయాఫ్రం వాల్ నిర్మాణ పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. తర్వాత పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం పోలవరం ప్రాజెక్టు పనులకు సంబంధించి షెడ్యూలన్‌ను ప్రకటించారు.
Next Story