సీఎం చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి దుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను సమర్పించారు.


ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న కనక దుర్గమ్మను కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం దర్శించుకున్నారు. నారా భువనేశ్వరి, నారా లోకేష్, బ్రాహ్మణి, దేవాన్ష్‌లతో కలిసి బాబు దుర్గమ్మను దర్శించుకున్నారు. సీఎం చంద్రబాబు తలకు స్థానాచార్యులు శివప్రసాద్‌ శర్మ పరివేట్టం చుట్టగా, పట్టు వస్త్రాలు, సుమంగళ ద్రవ్యాలు తలపై ఉంచి సీఎం చంద్రబాబును దుర్గమ్మ అమ్మవారి వద్దకు తీసుకెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు పట్టు వస్త్రాలను సమర్పించారు. ఇంద్రకీలాద్రిపైకి చేరుకోగానే ఆలయ నిర్వాహకులు, పూజారులు సీఎంకు ఘనంగా స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. పట్టు వస్త్రాల సమర్పణ అనంతరం చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో అంతరాలయంలో దుర్గమ్మ అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా డోనర్‌ సెల్‌ వివరాలను దేవదాయ శాఖ కమిషనర్, ఆలయ ఈవో సీఎంకు వివరించారు.

మూల నక్షత్రం రోజు దుర్గమ్మను దర్శించుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాని, లక్షల మంది భక్తులు ఎంతో నమ్మకంతో దుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుంటున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మంచి పనులను ఆశీర్వదించాలని దుర్గమ్మ అమ్మవారిని కోరుకున్నట్లు చెప్పారు. సేవా కమిటీల ద్వారా అనేక రకాల సేవలందిస్తున్న దుర్గ గుడి పాలక మండలి సభ్యులకు అభినందనలు తెలిపారు. క్యూలైన్లలో భక్తులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ఆలయ సిబ్బంది ఏర్పాటు చేశారు. దుర్గమ్మ అమ్మవారి దయ వల్ల రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలు పడ్డాయని, రాష్ట్రంలో నదుల అనుసంధానం దుర్గమ్మ దయతో పూర్తి అవుతుందని, రాష్ట్ర ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని సీఎం ఆకాంక్షించారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగానే తమ నిర్ణయాలు ఉంటాయని, ప్రతి దేవాలయానికి పూర్వ వైభవం వచ్చేలా కృషి చేస్తామని సీఎం చెప్పారు. మూల నక్షత్రం కావడంతో బుధవారం వచ్చే భక్తులందరికీ ఉచిత దర్శనం కల్పించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, మరి కొందరు వీఐపీలు దుర్గమ్మను సందర్శించుకొని మొక్కులు చెల్లించారు.

Next Story