ఈ ఏడు అంశాలపైనే మోదీతో చంద్రబాబు చర్చలు
ప్రధాని మోదీతో భేటి అయిన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు.. రాష్ట్ర సమస్యలను వివరించారు. ఏడు అంశాల్లో కేంద్రం సహాయం కావాలని ప్రధానిని అభ్యర్థించారు. అవేంటంటే..
ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. తన పర్యటనలో భాగంగా ఆయన ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక దుర్బలత్వంపై కీలకంగా చర్చించారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో దుర్భరంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు రాష్ట్రాన్ని తిరిగా గాడిలో పెట్టడమే కాకుండా అభివృద్ధి పథంలో నడిపించడమే ప్రధాన లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తోందని చంద్రబాబు వివరించారు. అందుకోసం కేంద్రం ప్రభుత్వ సహకారం ఎంతైనా కావాలని, వికసిత్ ఆంధ్రప్రదేశ్ కలను నెరవేర్చడానికి తమకు సహాయం చేయాలని ప్రధాని మోదీని చంద్రబాబు కోరారు. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా ఏడు అంశాల్లో అత్యధికంగా కేంద్ర సహకారం కావాలని, నిధులు అధికంగా కావాల్సి ఉంటుందని చంద్రబాబు వివరించారు.
బాబు సుడిగాలి పర్యటన
ఆంధ్రప్రదేశ్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు చంద్రబాబు. ఈ క్రమంలోనే ఆయన ఢిల్లీలో సుడిగాలి పర్యటన చేశారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్రమంత్రులు పియూష్ గోయల్, నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహన్, మనోహర్‌లాల్ కట్టర్, హర్‌దీప్ సింగ్ పూరి, 16వ ఆర్థిక సంఘం ఛైర్మన్ అరవింద్ పనగడియాలను కలిశారు. వారితో ఒకరి తర్వాత ఒకరుగా వరుస సమావేశాలలో కూడా చంద్రబాబు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి వారి సహకారం అందించాలని కోరారు. గత ప్రభుత్వం చేతకాని పాలన వల్ల రాష్ట్రంలోని వనరులన్నీ ఆవిరైపోయాయని, రాష్ట్రాన్ని మళ్ళీ సస్యశ్యామలంగా మార్చడానికి కేంద్ర సహకారం కావాలని ఆయన కోరారు.
మోదీకి అంతా వివరించిన చంద్రబాబు
ముచ్చటగా మూడోసారి ప్రధాని పీఠం అధిరోహించి హ్యాట్రిక్ కొట్టిన నరేంద్ర మోదీకి ముందుగా అభినందనలు తెలిపిన చంద్రబాబు.. అనంతరం ఆంధ్రప్రదేశ్ అవస్తలను పూసగుచ్చినట్లు వివరించారు. 2014లో జరిగిన అశాస్త్రీయ విభజన వల్ల కలిగిన నష్టం, గత ప్రభుత్వ ధోరణితో ఆగిపోయిన అభివృద్ధి, పురోగమనం చెందిన దుస్థితిని చెప్పారు. దాంతో పాటుగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న సమస్యలను కూడా వివరించారు. వైసీపీ హయాంలో వ్యక్తిగత ప్రయోజనాల కోసం సహజ వనరుల దోపిడీ, మానవవనరుల అభివృద్ధిని విస్మరించడంతో అభివృద్ధి అడుగంటిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆదాయం తగ్గిపోయి అప్పులు మాత్రం తారామండలాన్ని తాకుతుందని చెప్పారు. రాష్ట్రంలో ఇచ్చే జీతాలు, పింఛన్లు, అప్పుల వడ్డీలు ఆదాయాన్ని మించి ఉన్నాయని, దీనివల్ల మూలధన వ్యయం కోసం రాష్ట్రం దగ్గర ఆర్థిక వనరులు లేకుండా పోయాయని చెప్పారు.
ప్రధాని సాయం కోరిన అంశాలివే
1. స్వల్పకాలానికి రాష్ట్రానికి ఆర్థికంగా చేయూతనివ్వడం
2. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పునఃప్రారంభానికి సత్వర చర్యలు తీసుకోవడం
3. అమరావతి రాజధాని ప్రాంతంలో ముఖ్యమైన మౌలిక వసతులు, ప్రభుత్వ భవనాల సముదాయం పూర్తికి సమగ్ర ఆర్థిక సాయం అందించడం
4. పారిశ్రామికాభివృద్ధికి ప్రోత్సాహకాలు ఇవ్వడం
5. రాష్ట్రాలకు మూలధన వ్యయం అందించే ప్రత్యేక పథకం కింద ఆంధ్రప్రదేశకు అదనపు కేటాయింపులు జరిపి రహదారులు, వంతెనలు, సాగునీరు, తాగునీటి ప్రాజెక్టులు పూర్తయ్యేలా చూడటం
6. బుందేలండ్ ప్యాకేజీ తరహాలో రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలకు మద్దతు పలకడం
7. దుగరాజపట్నం పోర్టు పూర్తి చేసేలా రాష్ట్రానికి చేయూతనందించడం వంటి అంశాల్లో ప్రధాని మోదీ సహాయం కావాలని చంద్రబాబు కోరారు.