సహజంగా రైతులకు నష్టం లేకుండా.. వారు పండించిన పంటలు చేతికి అందేలోపే కనీస మద్ధతు ధర(ఎమ్మెస్పీ)లను ప్రభుత్వాలు ప్రకటిస్తాయి. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెబుతున్న మాటలు మాత్రం మరోలా ఉన్నాయి. కనీస మద్దతు ధర ప్రకటిస్తే రైతులు నష్ట పోతారని.. అందువల్లే మిర్చికి ఇప్పటి వరకు కనీస మద్దతు ధర ప్రకటించ లేదని వెల్లడించారు. మరో వైపు ఆంధ్రప్రదేశ్‌లో మిర్చికి గిట్టుబాటు ధర లభించక పోవడంతో కొన్ని రోజులుగా ఇటీవల గత కొద్ది రోజులుగా రైతులు ఆందోళన బాట పట్టారు. ఈ నేపథ్యంలో వారి సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అ«ధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లారు. అక్కడ మిర్చి రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ మిర్చి రైతులను ఆదుకోవడంలోను, కనీస మద్దతు ధరను కల్పించడంలో కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు ఘోరంగా ఫెయిల్ అయ్యిందని జగన్ ధ్వజమెత్తారు. బుధవారం ఉదయం చేపట్టిన ఈ జగన్ టూర్‌కు ఊహించని రీతిలో పెద్ద ఎత్తున రైతుల నుంచి మద్దతు లభించింది. దీంతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పందించక తప్పని పరిస్థితి నెలకొంది. బుధవారం అమరావతి సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కనీస మద్దతు ధర ప్రకటిస్తే మిర్చి రైతులు నష్టపోతారనే ఉద్దేశంతోనే మిర్చికి కనీస మద్దతు ధరను ప్రకటించ లేదని స్వయంగా మంత్రే వెల్లడించారు.
ఆయన మాటలు ఇంకా కొనసాగిస్తూ.. శ్రీలంక, చైనా, మలేషియా తదిత దేశాలకు ఏపీ మిర్చి ఎగుమతి అయ్యేదని, ప్రస్తుతం ఆయా దేశాల్లో సొంతంగా మిర్చి పంట సాగు చేసుకోవడం వల్ల ఏపి నుంచి మిర్చి ఎగుమతులు చాలా వరకు తగ్గి పోయాయని వెల్లడించారు. దీని ప్రభావం ఏపీ మిర్చిపై పడిందని, మిర్చి ధర తగ్గడానికి ఇది కూడా ఒక కారణమని ఆయన తెలపడం గమనార్హం. అంతేకాకుండా లాభదాయకతను దృష్టిలో ఉంచుకొని రైతులు కొంత మర్చి పంట నుంచి కొంత మంది రైతులు పత్తి, మొక్క జొన్న, కందులు వంటి వేరే ప్రత్యామ్నాయ పంటల వైపుగా మారడం వల్ల ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు రెండు లక్షల ఎకరాల్లో మిర్చి సాగు తగ్గిందని మరో విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే సాధారణంగా సాగు విస్తీర్ణం తగ్గినప్పుడు డిమాండ్ పెరుగుతుంది. దానికి అనుగుణంగా ధరలు కూడా పెరుగుతాయి. కానీ ఒక పక్క సాగు తగ్గిందని చెబుతూనే మరో వైపు రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతోనే మద్దతు ధర పెంచలేదని మంత్రి చెప్పడం రైతుల వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది. సాగు తగ్గడానికి, మద్దతు ధర పెరకపోవడానికి సంబంధం ఏంటనే ప్రశ్నలు రైతుల్లో వ్యక్తం అవుతున్నాయి.
అందుకే సీఎం ఢిల్లీకి..
పెద్ద ఎత్తున రైతులకు కనీస మద్దతు ధర కోరేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఢిల్లీ వెళ్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. ఇది వరకే మిర్చిధర విషయమై కేంద్రానికి నాలుగు పర్యాయాలు లేఖలు కూడా రాశారని వెల్లడించారు. అయితే ఇది వరకే సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఖరారు అయ్యింది. ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి హాజరు కావలని ఢిల్లీ పెద్దల నుంచి చంద్రబాబుకు ఆహ్వానం అందింది. ఆ మేరకు బుధవారం సాయంత్రం సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు. అయితే కేవలం ఆంధ్రప్రదేశ్ మిర్చి రైతుల సమస్యల పరిష్కారం కోసం, మిర్చి ధరల పెంచమని కోరడం కోసమే సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నట్లు మంత్రి చెప్పడం పట్ల మిర్చి రైతు వర్గాల పెదవి విరుస్తున్నారు. నూతన ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి సీఎం చంద్రబాబు నాయుడు హాజరవుతున్నారని.. అందులో భాగంగా మిర్చి రైతుల విషయమై ఢిల్లీ పెద్దలతో మాట్లాడతారని చెబితే సరిపోయేదిగా అంటూ చర్చించుకుంటున్నారు.