రేపు ఉదయం విశాఖకు వచ్చి, అక్కడ నుంచి మళ్లీ ఢిల్లీకి వెళ్తారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఢిల్లీ పర్యటనకు బయలు దేరారు. సీఎం చంద్రబాబు ఉదయం 10 గంటలకు ఉండవల్లి తన నివాసం నుంచి బయలుదేరి విజయవాడ పోరంకిలోని పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ నివాసానికి వెళ్తారు. అక్కడి నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు వెళ్తారు. గన్నవరం నుంచి బయలుదేరి వెళ్లి 1.30 గంటలకు ఢిల్లీ చేరుకుంటారు. ఢిల్లీలో ఓ శుభకార్యానికి హాజరవ్వడంతో పాటు.. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. తిరిగి రాత్రి 9.30 గంటలకు ఢిల్లీ నుంచి విశాఖపట్నం వెళ్తారు. 6వ తేదీ గురువారం ఉదయం 10.30 గంటలకు విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగే తోడల్లుడు డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరు అవుతారు. అదే రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి 4 గంటలకు ఢిల్లీ చేరుకుంటారు. కేవలం తన తోడల్లుడి పుస్తక ఆవిష్కరణ కోసం ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి విశాఖపట్నం వచ్చి, అది పూర్తి అయ్యాక అక్కడ నుంచి మళ్లీ ప్రత్యేక ఫ్లైట్‌లో ఢిల్లీకి చేరుకుంటారు. అదే రోజు సాయంత్రం 5.30 గంటలకు భారత్ మండపంలో జరిగే రిపబ్లిక్ టీవీ కాంక్లేవ్‌లో పాల్గొంటారు. 6వ తేదీ రాత్రి ఢిల్లీలోనే బస చేసి 7వ తేదీ ఉదయం బయలుదేరి అమరావతికి వస్తారు. సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా సహా పలువురు ఎన్డీఏ పెద్దలు, కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు రావలిసిన నిధులు, ఏపీకి సంబంధించిన పలు ప్రాజెక్టులు, వాటికి రావలసిని నిధుల గురించి చర్చించనున్నారు.