వరద ప్రాంతాలకు బోటులో వెళ్లిన చంద్రబాబు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా వర్షాలతో తల్లడిల్లిపోతుంది. విజయవాడలో వర్షపాతం రికార్డు స్థాయిలో నమోదైంది. ఈ నేపథ్యంలో వరద ప్రాంతాలను సందర్శించడానికి సీఎం చంద్రబాబు కదిలి వెళ్లారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా వర్షాలతో తల్లడిల్లిపోతుంది. విజయవాడలో వర్షపాతం రికార్డు స్థాయిలో నమోదైంది. ఈ నేపథ్యంలో వరద ప్రాంతాలను సందర్శించడానికి సీఎం చంద్రబాబు కదిలి వెళ్లారు. విజయవాడలోని సింగ్‌నగర్ సహా ఇతర ప్రాంతాలను ఆయన బోటులో వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించారు. భద్రత సిబ్బంది వద్దంటూ వారిస్తున్నప్పటికీ చంద్రబాబు వారి మాట వినిపించుకోకుండా బోటులో వరద ప్రాంతాలను సందర్శించారు. అనంతరం సింగ్‌నగర్ గండి పూడ్చడంపై అధికారులతో మాట్లాడారు. బాధితులందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆయన ఆదేశించారు. ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ క్రమంలోనే తన సందర్శన గురించి ఆయన మాట్లాడారు.
‘‘బాధితుల ఇబ్బందులను దగ్గరుండి చూశా. వరదనీరు తగ్గే వరకు పరిస్థితి పర్యవేక్షిస్తా. బాధితులకు వెంటనే ఆహారం, తాగునీరు అందిస్తాం. ఆరోగ్యం బాగాలేని వారిని ఆసుపత్రులకు తరలిస్తాం. సాధారణ పరిస్థితులు నేలకొనే వరకు మీ దగ్గర్లోనే ఉంటా. అన్ని వేళల్లో మీకు అందుబాటులో ఉండి. మీ కష్టాలను, సమస్యలను తీర్చేందుకు పనిచేస్తా’’ అని చెప్పారు.
జరిగిన ప్రాణ నష్టం బాధాకరం
‘‘అధికారులతో వర్షాల గురించి ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నాం. వర్షాలు, వరదల్లో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఒకరు గల్లంతయ్యారు. కొండచరియలు పడటం, కారు వాగులో కొట్టుకుపోయి ఆ ప్రమాదంలో ముగ్గురు చనిపోవడం చాలా బాధాకరం. పులిచింతల నుంచి ప్రవాహం ఎక్కువగా వస్తోంది. ప్రకాశం బ్యారేజీకి 8.8 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. బుడమేరు వల్ల వీటీపీఎస్‌లో విద్యుదుత్పత్తి ఆగింది. ప్రకాశం బ్యారేజీ కింద పలు చోట్ల గట్లు బలహీనంగా ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో ఇసుక బస్తాలు వేస్తున్నాం’’ అని చెప్పారు.
పంటలు బాగా దెబ్బతిన్నాయి..
‘‘రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. పంటలు బాగా దెబ్బతిన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 107 క్యాంపులు పెట్టాం.. 17 వేల మందిని పునరావాస ప్రాంతాలకు తరలించాం. ప్రమాదాలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. వరదముంపు ప్రాంతాలకు బోట్లు పంపించాం. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ఏర్పాట్లు తీసుకుంటాం. భవిష్యత్తులో ఇలాంటి విపత్తులు రాకుండా చర్యలు చేపడతాం. ప్రజల ప్రాణాలు కాపాడటమే మా తక్షణ కర్తవ్యం. రోడ్లపై నీరు నిల్వ ఉండకుండా సత్వర చర్యలు చేపడుతున్నాం. వరద ప్రాంతాల్లో బియ్యం, పప్పు, నూనె, పంచదార, కూరగాయలు పంపిణీ చేస్తున్నాం. మత్స్యకారుల కుటుంబానికి 50 కిలోల బియ్యం అందిస్తున్నాం. సాధారణ పరిస్థితులు నెలకొనేవరకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నాం’’ అని వెల్లడించారు.