ఎన్నికల ప్రచారానికి జగన్ సిద్ధం.. ఇదే ప్లాన్
ఆంధ్ర అసెంబ్లీ ఎన్నికల కోడ్ విడుదలైన వెంటనే ప్రచారం ప్రారంభించడానికి సీఎం జగన్ సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ప్రచార ప్లాన్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టారు.
ఆంధ్రలో ఎన్నికల హడావుడి మొదలైంది. షెడ్యూల్ రావడమే ఆలస్యం ప్రచార రథాలను కదిలించడానికి, జోరుగా తమ ప్రచారాన్ని ప్రారంభించడానికి అన్ని పార్టీల నేతలు, అధినేతలు రెడీగా ఉన్నారు. ఇందులో భాగంగా తన ఎన్నికల ప్రచారంపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ఈసారి ఎన్నికల్లో కూడా తన స్పీచ్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచేలా చూసుకుంటున్నారు. షెడ్యూల్ విడుదల వెంటనే ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టే విధంగా తమ నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం కూడా చేసేశారు. ఇప్పటికే సిద్ధం సభలతో పలు ప్రాంతాల్లో ప్రజల్లోకి వెళ్లిన జగన్ తన ఎన్నికల ప్రచారాన్ని మరింత గట్టిగా చేయాలని యోచిస్తున్నారు. అందులో భాగంగానే మేనిఫెస్టోపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ అందులో కేవలం సంక్షేమాలే కాకుండా ఇతర అంశాలను కూడా జోడించడానికి కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం.
ప్రచారంపై ప్రత్యేక ఫోకస్
అసెంబ్లీ ఎన్నికలు అతి చేరువలోనే ఉన్న నేపథ్యంలో కార్యక్రమాలు, పనులలో ఏమాత్రం అలసత్వం వద్దని పార్టీ శ్రేణులకు సీఎం జగన్ సూచించారు. అంతేకాకుండా తన ఎన్నికల ప్రచార సభలు, సమావేశాలు, రోడ్ షోలను కూడా పక్కా ప్రణాళికతో సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. అందుకోసం ప్రత్యేక టీమ్‌తో ఏయే జిల్లాల్లో ఎప్పుడెప్పుడు పర్యటించాలి, ఎన్ని రోజులు పర్యటించాలి అన్న అంశాలపై కసరత్తులు చేస్తున్నారు. దాంతో పాటుగా ఎక్కడెక్కడ సభలు, రోడ్ షోలు నిర్వహించాలని కూడా కీలక నేతలతో చర్చించి ఓ నిర్ణయానికి వస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఈ నేపథ్యంలోనే సభల్లో ఇచ్చే ప్రసంగాలపై కూడా సీఎం జగన్ స్పెషల్ పోకస్ పెట్టారు. వీటిలో ప్రజాసమస్యలతో పాటు ప్రజలకు తమ ప్రభుత్వం అందించిన పథకాలు, సదుపాయాలను తెలపనున్నారు. వీటన్నింటిని రంగరించి తన ఎన్నికల ప్రచార ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు జగన్. అందులో రోడ్ షోలను కీలక నియోజకవర్గాల్లో భారీగా నిర్వహించాలని కూడా యోచిస్తున్నారు.
ఈసారి మేనిఫెస్టోలో ఈ మార్పులు
2019 ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ మేనిఫెస్టో, స్పీచ్ ప్రత్యేక ఎట్రాక్షన్‌గా నిలిచాయి. గత ఎన్నికల ముందు పాదయాత్ర చేసి 151 నియోజకవర్గాల్లో విజయం సాధించిన వైసీపీ.. 2024 ఎన్నికల్లో ‘వై నాట్ 175’ నినాదంతో ప్రజల చెంతకు వెళ్తున్నారు. అందుకోసం రోడ్‌షోలు, సభలను ఉధృతం చేయడంతో పాటు తమ మేనిఫెస్టోలో కూడా కీలక మార్పులు చేయనున్నారు. 2024 మేనిఫెస్టోలో ప్రజలకు అందించే సంక్షేమ పథకాలే కాకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం చేసే ప్రాజెక్ట్‌లను కూడా ప్రస్తావించనున్నారని సమాచారం. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్ 2024 అసెంబ్లీ ఎన్నికల ప్రసంగం ఎలా ఉండనున్నది అనేది హాట్ టాపిక్‌గా మారింది. ఈ ప్రసంగంలో తమ ఐదేళ్ల పాలనలో రాష్ట్ర, ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం చేసిన కార్యక్రమాలు వివరించడంతో పాటు అందులో కలిసికట్టుగా వస్తున్న ప్రతిపక్షాల పొత్తులను తూర్పారబట్టడానికి సిద్దమవుతున్నారు సీఎం జగన్.
Next Story