గ్రూప్‌1తో జగన్‌ రాజకీయం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిరుద్యోగులతో చెలగాటమాడుతోంది. గ్రూప్‌1 నోటిఫికేషన్‌ ఇవ్వటంలో నిబంధనలు గాలికొదిలేసింది.


గ్రూప్‌1తో జగన్‌ రాజకీయం
x
APPSC OFFICE

రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పట్టిపీడిస్తుంటే మరోవైపు నిరుద్యోగులతో ఏపీపీఎస్సీ చెలగాటమాడుతోంది. ఏపీపీఎస్సీ రాజకీయ రంగు పులుముకుందా? అనే అనుమానాలు పలువురు నిరుద్యోగులు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రస్థాయిలో ఉన్నత ఉద్యోగ నియామకాలు ఏపీపీఎస్సీ గ్రూప్‌1 ద్వారా భర్తీ చేస్తున్నారు. గ్రూప్‌1 మూడు దశలలో పరీక్ష విధానం ఉంటుందని, ఇంటర్వ్యూలలో పారదర్శకత కొరవడిందని గతంలో జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించి అధికారంలోకి రాగానే ఈ పరీక్షలకు ఇంటర్వ్యూ లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు. సీఎం కాగానే గ్రూప్స్‌కు ఇంటర్వ్యూలు లేకుండా ఆదేశాలు కూడా జారీ చేయించారు. ఆ తరువాత తిరిగి గ్రూప్‌1కు ఇంటర్వ్యూలు ఉంటాయని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. గ్రూప్‌1 పరీక్ష విధానం సిలబస్‌ మొత్తం ఉన్నత సాంకేతిక విద్య అభ్యసించిన వారికి అనుకూలంగా ఉందని, గ్రామీణ ప్రాంత విద్యార్థులు, పేద మధ్య తరగతి వారు గ్రూప్‌1 సాధించలేకపోతున్నారని నిరుద్యోగులు వాపోతున్నారు.

ఏపీపీఎస్సీ గత సంవత్సరం సెప్టెంబర్‌లో గ్రూప్‌1 సిలబస్, పరీక్ష విధానంలో మార్పులు తీసుకొస్తున్నామంటూ అభ్యరులు, విద్యావంతులు, మేధావుల నుండి అభిప్రాయాలు స్వీకరించి కొత్త పరీక్ష విధానం సిలబస్‌ కూడా ప్రకటించారు. అయితే దానికి అనుగుణంగా ప్రస్తుతం గ్రూప్‌1 నోటిఫికేషన్‌ ఇవ్వకుండా పాత పద్ధతిలోనే నిర్వహిస్తామని చెప్పి అభ్యర్థులను మానసిక ఒత్తిడికి అయోమయానికి గురి చేసి నిరుద్యోగులను నిలువునా మోసం చేస్తున్నారని నిరుద్యోగులు వాపోతున్నారు. ఏపీపీఎస్సీ క్రమబద్ధంగా నోటిఫికేషన్‌లు జారీ చేయలేదు. కనీసం నోటిఫికేషన్‌ ఇచ్చినప్పుడు సిలబస్‌కు తగినట్లు సమయం ఇవ్వడం లేదు. ఏళ్ల తరబడి నోటిఫికేషన్‌ల కోసం ఎదురు చూస్తూ కోచింగ్‌లు తీసుకుంటున్న వారి పరిస్థితి దారుణంగా ఉంది. ప్రస్తుత గ్రూప్‌1కు మరో మూడు నెలలు గడువు ఇవ్వాలని నిరుద్యోగులు కోరుతున్నారు. 2023 డిసెంబరు 8న ఏపీపీఎస్సీ గ్రూప్‌1 నోటిఫికేషన్‌ జారీ చేసింది. జనవరి 28వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించింది. మార్చి 17న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. నోటిఫికేషన్‌ ఇచ్చిన తరువాత కనీసం 45 రోజులు సమయం ఇవ్వాల్సి ఉండగా అటువంటి నిబంధనలేవీ పాటించకుండా నిరుద్యోగులతో ఆటలాడుకోవడం ఏమిటని నిరుద్యోగులు వాపోతున్నారు.
గ్రూప్‌1 పరీక్ష విధానం మారుస్తామని చెప్పి మోసం
గ్రూప్‌1 పరీక్ష విధానం కొత్తపద్ధతిలో నిర్వహిస్తామని చెప్పిన ప్రభుత్వం పాతపద్దతినే కొనసాగించి పేద గ్రామీణ నిరుద్యోగులకు అన్యాయం చేస్తోంది. పరీక్ష గడువును మరో మూడు నెలలు పొడిగించాలి. ఏపీపీఎస్‌సీ పరీక్షల్లో రాజకీయ రంగు లేకుండా చూడాలి.
జి.ఈశ్వరయ్య, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు
Next Story