ఏపీ పాలిటిక్స్‌లో కేసీఆర్ అలజడి
x
Source: Twitter

ఏపీ పాలిటిక్స్‌లో కేసీఆర్ అలజడి

ఆంధ్ర ఎన్నికల విజేతపై తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తన జోస్యం చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రమంతటా ఇదే చర్చ జరుగుతోంది. గతంలో నిజమైన కేసీఆర్ జోస్యం.. ఇప్పుడేమవుతుంది.


ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు వాడివేడిగా సాగుతున్నాయి. అధికార ప్రతిపక్షాల మధ్య విమర్శలు, ఆరోపణలు, సవాళ్లతో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. ఈసారి విజేతను అంచనా వేయడం కష్టమేనని కొన్ని సర్వే సంస్థలు కూడా చేతులెత్తేశాయి. దీంతో ఆంధ్రలో ఈసారి విజయం ఎవరిది అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఈ నేపథ్యంలోనే మంగళవారం నాడు ఓ టీవీ ఛానె‌ల్‌తో మాట్లాడుతూ తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్.. ఆంధ్రలో కాబోయే సీఎం ఎవరన్న అంశంపై ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ఆయన మాటలు ప్రస్తుతం తీవ్ర చర్చలకు దారితీశాయి.

ఇంత సస్పెన్స్ ఎందుకు

ఆంధ్ర ఎన్నికలు ఇంత థ్రిల్లర్ సినిమాలా మారడానికి కూడా బలమైన కారణాలే ఉన్నాయి. అందుకు ప్రధాన కారణం ఓటరు. ఆంధ్రలో ఓటర్లు చాలా తెలివిమీరారు. గతంలో మాదిరిగా తమ నిర్ణయాలను వెళ్ళబుచ్చట్లేదు. ఈసారి జరగనున్న ఎన్నికల్లో మరోసారి వైఎస్‌ జగన్‌కే పట్టం కడతారా లేదంటే తెలంగాణ తరహాలో రాష్ట్రంలో మార్పుకు ఓటేస్తారా అనేది రవ్వంత కూడా బహిర్గతం చేయట్లేదు. దీనికి ఆంధ్ర ఓటర్ల స్తబ్దతే నిలువెత్తు నిదర్శనం. ఇది వరకు జరిగిన దాదాపు ప్రతి ఎన్నికల సమయంలో కూడా రాష్ట్రంలో ఏదో ఒక పార్టీ హవా నడుస్తుండేది. కానీ ఈసారి మాత్రం ఆంధ్రలో ఎటు చూసినా ఏ పార్టీ హవా లేదు ఏమీ లేదు. ప్రతి పార్టీ కూడా తమ వేవ్ నడుస్తుందని చెప్పుకోవడమే తప్ప పరిస్థితులు మాత్రం ఏ పార్టీని హైలేట్ చేయట్లేదు. ఇలాంటి సమయంలో కేసీఆర్ ప్రెడిక్షన్ సంచలనంగా మారింది.

అసలు కేసీఆర్ ఏమన్నారంటే..

ఏపీలో ఎవరు గెలవొచ్చు అన్న ప్రశ్నకు కేసీఆర్ ఇలా బదులిచ్చారు. ‘‘ఆంధ్ర రాజకీయాలపై మాకు అంత ఆసక్తి లేదు. కానీ మాకు ఉన్న సమాచారం ప్రకారం మాత్రం ఆంధ్రలో ఈసారి కూడా వైఎస్ జగన్ ప్రభుత్వమే వస్తుంది. అయినా ఆంధ్రలో ఎవరు అధికారంలోకి వచ్చినా మాకు పెద్దగా ఫరక్ పడదు’’ అని తన అభిప్రాయాన్ని వెల్లడించారు కేసీఆర్. అయితే ఇదే తరహాలో 2014లో కూడా కేసీఆర్.. ఆంధ్ర ఎన్నికలపై జోస్యం చెప్పారు. పోలింగ్ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలంగాణలో గులాబీ జెండా, ఆంధ్రలో 100 స్థానాలో గెలిచి జగన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. అందులో తెలంగాణలో కేసీఆర్ గెలుపు కరెక్ట్‌గా జరిగినా ఆంధ్రలో మాత్రం స్వల్ప తేడాతో జగన్ ఓడిపోయారు. బలమైన ప్రతిపక్షంగా నిలిచారు.

స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్న టీడీపీ శ్రేణులు

ఆంధ్రలో కాబోయే సీఎంపై కేసీఆర్ చెప్పిన జోస్యం వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతుంది. ప్రజలకు తాము అందించిన సంక్షేమమే మరోసారి తమను అధికారంలోకి తీసుకొస్తుందన్న ధీమాను అధికం చేస్తోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ వ్యాఖ్యలకు టీడీపీ శ్రేణులు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘‘నేను పోరాడి తీసుకొచ్చిన తెలంగాణ.. కేసీఆర్ అంటే తెలంగాణ.. తెలంగాణ అంటే కేసీఆర్ అని చెప్పుకున్న నీ గెలుపునే నువ్వు అంచనా వేసుకోలేకపోయావు. అటువంటిది పొరుగు రాష్ట్రం గురించి ఏం జోస్యాలు చెప్తావ్. ముందు నీ ఇంటిని చక్కబెట్టుకో పక్కింటి గురించి తర్వాత ఆలోచించొచ్చు’’ అంటూ చురకలంటించారు.

చంద్రబాబు, కేసీఆర్ వైరంతోనే జగన్ గెలిచారా!

అదే విధంగా 2019లో జగన్ గెలుపుకు అంతకు ముందు ఏడాది అంటే 2018 లో చంద్రబాబు, కేసీఆర్ మధ్య చెలరేగిన వివాదం బాగా కలిసొచ్చిందని కొందరు భావిస్తున్నారు. 2018 తెలంగాణ ఎన్నికల సమయంలో టీడీపీ, కాంగ్రెస్ జతకట్టాయి. దాంతో ఆగ్రహించిన కేసీఆర్.. త్వరలోనే చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని బహిరంగంగానే హెచ్చరికలు చేశారు. అదే విధంగా 2019లో ఆంధ్రలో జరిగిన ఎన్నికల్లో జగన్ గెలవడానికి, టీడీపీ ఓటమికి కేసీఆర్ తన వంతుగా సహకారం అందించారని ప్రచారం జరుగుతోంది.

జగన్, బీఆర్ఎస్ మధ్య సత్సబంధాలు

2014 నుంచి వైసీపీ, బీఆర్ఎస్ మధ్య సత్సంబంధాలు ఉన్నాయన్నది అందరికీ తెలిసిన విషయమే. అంతేకాకుండా 2014లో జరిగిన తెలంగాణ ఎన్నికల్లో వైసీపీ కూడా బరిలో నిలిచింది. అయితే కాంగ్రెస్‌ను బలహీనపరచడానికి బీఆర్ఎస్ పార్టీనే జగన్‌ను రంగంలోకి దింపిందని ప్రచారం కూడా జోరుగా సాగింది. అప్పటి నుంచి బీఆర్ఎస్, జగన్ మధ్య సత్సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయి. అనేక సందర్భాల్లో వీరి మధ్య ఉన్న స్నేహం బయట పడింది. 2019 ఎన్నికల్లో గెలిచినందుకు అప్పట్లో కేటీఆర్ ప్రత్యేకంగా జగన్‌కు శుభాకాంక్షలు చెప్పడం, ఆ తర్వాత జగన్ ఆరునెలల పాలన అద్భుతంగా ఉందంటూ కితాబివ్వడం వీరి స్నేహానికి ప్రతీక అని కూడా వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. అంతేకాకుండా ఇటీవల కేసీఆర్‌కు సర్జరీ జరిగినప్పుడు కూడా ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి.. తెలంగాణకు వెళ్లి కేసీఆర్‌ను పరామర్శించారు.

అప్రమత్తమైన టీడీపీ

తాజాగా 2019 తరహాలోనే మరోసారి కేసీఆర్.. ఆంధ్రలో జగన్ గెలుస్తారని చెప్పడంతో టీడీపీ అలెర్ట్ అయిందని సమాచారం. అప్పట్లో జగన్ గెలుపు కోసం కేసీఆర్.. భారీ మొత్తంలో ఆర్థిక సహాయం చేశారని, ఇప్పుడు కూడా చంద్రబాబును ఓడించడానికి కేసీఆర్ ఎంత దూరమైనా వెళతారని టీడీపీ భావిస్తోందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అందులో భాగంగానే టీడీపీ అప్రమత్తమైందని, ఈసారి ఎట్టిపరిస్థితుల్లో ఓడిపోకుండా ఉండటానికి అన్ని జాగ్రత్తలూ తీసుకుంటుందని సమాచారం.

కేసీఆర్ వ్యాఖ్యల ప్రభావం ఎంత

ఈ క్రమంలోనే ఆంధ్ర రాష్ట్రమంతటా.. ఇప్పుడు కేసీఆర్ చేసిన వ్యాఖ్యల ప్రభావం ఆంధ్ర ఎన్నికలపై ఎంత మేర ఉంటుందన్న చర్చే జరుగుతుంది. కానీ కేసీఆర్ ప్రభావం ఆంధ్ర ఎన్నికలపై అంతగా ఉండదని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకు తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోవడమే కారణమని, తన గెలుపోటములనే అంచనా వేసుకోలేని కేసీఆర్.. ఆంధ్ర ఎన్నికల విజేత గురించి, ఆంధ్ర ప్రజల నాడి గురించి ఏమాత్రం అంచనా వేయగలరని విశ్లేషకులు కూడా అంటున్నారు. కానీ ఈసారి ఆంధ్ర ఎన్నికలు మాత్రం ఎన్నడూ లేనంత రసవత్తరంగా సాగనున్నాయని వారు అంటున్నారు.

ఆంధ్రలో పరిస్థితి ఇది

ప్రస్తుతం ఆంధ్రలో ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో జోరుగా ముందుకు సాగుతున్నాయి. ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధిస్తూనే సంక్షేమ పథకాలే ప్రత్యేక అస్త్రాలుగా ప్రజల ముందుకు వెళ్తున్నాయి. దానికి తోడుగా ప్రత్యర్థులపై తీవ్రంగా మాటల దాడులకూ దిగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రెడిక్షన్ ఎంత మేర వాస్తవం అవుతుందో చూడాలి. అది తెలియాలంటే జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే.

Read More
Next Story